వొడాఫోన్‌ రెండో ఆర్బిట్రేషన్‌కు సుప్రీం అనుమతి

Vodafone supreme approval for second arbitration - Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం జారీ చేసిన రూ.11,000 కోట్ల పన్ను డిమాండ్‌పై ఇండియాకు వ్యతిరేకంగా వొడాఫోన్‌ రెండోసారి ఆర్బిట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ మేరకు గురువారం కంపెనీకి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. దీంతో 2012 నాటి చట్టం ప్రకారం వొడాఫోన్‌ రూ.11,000కోట్లు పన్ను చెల్లించాలంటూ కేంద్రం ఇచ్చిన నోటీసుపై ఆర్బిట్రేటర్‌ లేదా కమిషన్‌ ఛైర్మన్‌ను నియమించే పక్రియ ఆరంభమవుతుంది. ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటవుతుంది. అయితే జనవరి 10వ తేదీ నాటికి ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు తన ఉత్తర్వులు ఇవ్వనున్న నేపథ్యంలో– అప్పటి వరకూ వాదనలు మాత్రం కొత్త ట్రిబ్యునల్‌లో ప్రారంభం కారాదని సుప్రీంకోర్టు నిర్దేశించింది.

నేపథ్యం ఇదీ: వొడాఫోన్‌ 11 బిలియన్‌ డాలర్లు వెచ్చించి హచిసన్‌ ఎస్సార్‌ను కొనుగోలు చేసింది. తద్వారా 2007లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. అయితే ఈ వ్యవహారానికి సబంధించి గత లావాదేవీకూ వర్తించే విధంగా 2012లో తీసుకువచ్చిన రెట్రాస్పెక్టివ్‌ చట్టం ప్రకారం – కేంద్రం రూ.11,000 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసు జారీ చేసింది. అయితే ఈ అంశం బ్రిటన్‌తో పెట్టుబడుల ఒప్పందం కిందికి వస్తున్నందున ఇందులో భారత్‌ జోక్యం చేసుకునేందుకు ఎలాంటి న్యాయ పరిధీ లేదన్నది వొడాఫోన్‌ వాదన.

ఈ అంశంపై ఇండియా–నెదర్లాండ్స్‌ ద్వైపాక్షిక పెట్టుబడుల రక్షణ ఒప్పందం (బీఐపీఏ) పరిధిలోని క్లాజ్‌  ప్రకారం 2014లో వొడాఫోన్‌ తొలి ఆర్బ్రిట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది. ఇది ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఆ తర్వాత ఇండియా–బ్రిటన్‌ బీఐపీఏ ప్రకారం రెండో ఆర్బిట్రేషన్‌ ప్రక్రియకూ వొడాఫోన్‌ చర్యలు ప్రారం భించింది. దీన్ని సమర్దిస్తూ, ఢిల్లీ హైకోర్టు అక్టోబర్‌ 26న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ, కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. అయితే ఇక్కడా వొడాఫోన్‌కు అనుకూలంగా రూలింగ్‌ వచ్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top