వొడాఫోన్‌ ఐడియా రైట్స్‌ ఇష్యూ ధర రూ.12.50

Vodafone Idea Board Okays Price of Rs 12.50/share for Rs 25,000 Crore Rights Issue - Sakshi

బుధవారం ముగింపు ధర కంటే 62 శాతం తక్కువ 

రైట్స్‌ ఇష్యూ రికార్డ్‌ డేట్‌ ఏప్రిల్‌ 2

ఏప్రిల్‌ 10–24 మధ్య రైట్స్‌ ఇష్యూ 

ప్రతి 38 షేర్లకు 87 రైట్స్‌ షేర్లు 

న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఐడియా కంపెనీ రైట్స్‌ ఇష్యూ ధరను నిర్ణయించింది. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.25,000 కోట్లు సమీకరించాలని ఈ కంపెనీ యోచిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదిత రైట్స్‌ ఇష్యూలో ఒక్కో ఈక్విటీ షేర్‌ (రూ.10 ముఖ విలువ) ధరను రూ.12.50కు జారీ చేయడానికి  కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. బుధవారం వొడాఫోన్‌ ఐడియా ముగింపు ధర(రూ.33)కు ఇది దాదాపు 62 శాతం తక్కువ. 

రికార్డ్‌ డేట్‌ వచ్చే నెల 2 
రైట్స్‌ ఇష్యూకు రికార్డ్‌  డేట్‌గా వచ్చే నెల 2ను నిర్ణయించామని కంపెనీ తెలిపింది. ఏప్రిల్‌ 2వ తేదీలోపు ఎవరి దగ్గరైతే వొడాఫోన్‌ ఐడియా షేర్లు ఉంటాయో వారికి మాత్రమే ఈ రైట్స్‌ ఇష్యూలో షేర్లు పొందడానికి అర్హత ఉంటుంది.  ప్రతి 38 ఈక్విటీ షేర్లకు కొత్తగా 87 రైట్స్‌ షేర్లను జారీ చేస్తారు. రైట్స్‌ ఇష్యూ ఏప్రిల్‌ 10న మొదలై 24న ముగుస్తుంది. ఈ రైట్స్‌ ఇష్యూలో ప్రమోటర్‌ సంస్థలు–వొడాఫోన్‌ గ్రూప్‌ రూ.11,000 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.7,250 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేయనున్నాయి. రైట్స్‌ ఇష్యూలో భాగంగా  ఈ కంపెనీ 2,000 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. రైట్స్‌ ఇష్యూ వల్ల సమకూరే నిధులతో ఆర్థికంగా మరింతగా పుంజుకొని రిలయన్స్‌ జియోకు వొడాఫోన్‌ ఐడియా గట్టిపోటీనివ్వగలదని నిపుణుల అంచనా. ఐడియా రుణ భారం రూ.1,23,660 కోట్లుగా ఉంది. ఈ రుణ భారం తగ్గించుకోవడానికి రైట్స్‌ ఇష్యూ నిధులను వినియోగించుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. 

నష్టాల్లోంచి.. లాభాల్లోకి ఐడియా షేరు...
రైట్స్‌ ఇష్యూ వార్తల నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా తీవ్రమైన ఒడిదడుకులకు గురైంది. రైట్స్‌ ఇష్యూ ధర వార్త వెలువడగానే ఈ షేర్‌ 8 శాతం పతనమై రూ.29.60ను తాకింది. ఆ తర్వాత కోలుకుని ఇంట్రాడే గరిష్ట స్థాయి, రూ.33.50ను తాకింది.  చివరకు 3 శాతం లాభంతో రూ.33 వద్ద ముగిసింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top