ఎట్టకేలకు నోరిప్పిన మాల్యా, ట్వీట్ల వర్షం

VijayMallya Tweets Again, Explains Why He Broke Silence - Sakshi

న్యూఢిల్లీ :  కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, దర్యాప్తు ఏజెన్సీలు తనపై ఎగవేతదారు ముద్ర వేశాయని తీవ్ర ఆరోపణలు గుప్పించిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా.. తనకున్న ఆస్తులను అమ్ముకోనైనా బ్యాంకులకు బకాయిలు చెల్లించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నానంటూ మంగళవారం చెప్పుకొచ్చారు. బ్యాంకులకు రుణపడిన రూ.13,900 కోట్ల బకాయిలను చెల్లించడానికి తన ఆస్తులను విక్రయించుకునేలా కోర్టు అనుమతి ఇవ్వాలని మంగళవారం కోరారు. అయితే ఇన్ని రోజులు బకాయిల చెల్లింపులపై ఎలాంటి ప్రకటన చేయకుండా స్తబ్ధుగా ఉన్న మాల్యా.. ఇప్పుడెందుకు నోరు విప్పాల్సి వచ్చిందో తెలుపుతూ బుధవారం మరో ట్వీట్‌ చేశారు. బుధవారం ఉదయం చేసిన ట్వీట్‌ లో ‘ఈ సమయంలోనే ప్రకటన చేయడానికి ఎందుకు ఎంచుకున్నారని చాలామంది అడుగుతున్నారు. నాకున్న సుమారు రూ.13,900 కోట్ల ఆస్తులను అమ్ముకునేందుకు 2018 జూన్‌ 22న కర్నాటక హైకోర్టు ముందు నేను, యూబీహెచ్‌ఎల్‌ కలిసి మా పిటిషన్ దాఖలు చేశాం. ఆ కారణంతోనే ఈ సమయంలో ప్రకటన చేస్తున్నా’ అని పేర్కొన్నారు. 

అదేవిధంగా తన మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ద్వారానే 2016లో ప్రధానికి, ఆర్థికమంత్రికి రాసిన లేఖను కూడా మాల్యా బహిర్గతం చేశారు. ఈ లేఖలో తాను ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుని కాదని పేర్కొన్నారు. బ్యాంకులకు బాకీ పడిన రుణాలను తిరిగి చెల్లించడానికి తనకు, యూబీహెచ్‌ఎల్‌కు అనుమతి ఇవ్వాలంటూ మాల్యా బుధవారం పలు ట్వీట్లు చేశారు. ఒకవేళ ఈడీ ఆస్తులను అమ్ముకోవడానికి నిరాకరిస్తే, తనకు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతుందని తాను నమ్ముతానని అన్నారు. బ్యాంకులతో సెటిల్‌ చేసుకోవడానికి శతవిథాలా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. రాజకీయ అంశాలను ఈ కేసులో తలదూర్చితే, అప్పుడు తానేం చేయలేనని కూడా చెప్పుకొచ్చారు. ఇలా బుధవారం మరోసారి మాల్యా తన మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో ట్వీట్ల వర్షం కురిపించారు.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top