నా ఆస్తుల జప్తు అమానుషం: మాల్యా 

Vijay Mallya tries to obfuscate again - Sakshi

పారిపోయిన ఆర్థిక నేరస్తునిగా ప్రకటించడంపై ముంబై హైకోర్టులో పిటిషన్‌

ముంబై: ఆర్థిక నేరాలకు పాల్పడి పారిపోయిన వారికి సంబంధించిన చట్టం (ఎఫ్‌ఈఓఏ), 2018 కింద తన ఆస్తుల జప్తు అమానుషమని బ్యాంకులకు వేలాదికోట్ల రూపాయలు ఎగొట్టి ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న విజయ్‌మాల్యా పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తన ఆస్తుల జప్తు చేయాలనుకోవడం బ్యాంకులు, రుణదాతలకు ఎటువంటి ప్రయోజనం నెరవేర్చదని కూడా ఆయన బొంబై హైకోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.  జస్టిస్‌ ఐఏ మహంతీ, జస్టిస్‌ ఏఎం బాదర్‌లతో కూడిన ధర్మాసనం ముందు మాల్యా తరఫున ఆయన న్యాయవాది అమిత్‌ దేశాయ్‌ తన వాదనలు వినిపిస్తూ, ‘‘ఆస్తుల జప్తు చర్యలు అమానుషం. బ్యాంకులు, రుణ గ్రహీతలతో ప్రస్తుతం ఒక అవగాహన కుదుర్చుకోవడం అవసరం. మాల్యా ఆస్తులను తిరిగి కోరుకోవడం లేదు. ఆస్తుల జప్తు చేయడం వల్ల బ్యాంకులు, రుణ దాతలకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చదని మాత్రం ఆయన చెప్పదలచుకున్నారు’’ అని పేర్కొన్నారు.

అయితే ఈ వాదనలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తీవ్రంగా తప్పుపట్టింది.   కేసు తదుపరి విచారణ ఏప్రిల్‌ 24వ తేదీకి వాయిదా పడింది. ఎఫ్‌ఈఓఏ, 2018 సెక్షన్‌ 12 కింద మాల్యాను ‘‘పారిపోయిన’’ నేరస్తునిగా జనవరి 5వ తేదీన ముంబై స్పెషల్‌ కోర్ట్‌ ప్రకటించింది. ఇదే చట్టం కింద మాల్యా ఆస్తుల జప్తునకు ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలను ఈ నెల 8వ తేదీన ప్రత్యేక ఎంఎంఎల్‌ఏ (అక్రమ ధనార్జన) కోర్టు విననుంది. గత ఏడాది జూన్‌ 22న ఆమోదం పొందిన కొత్త చట్టం కింద ఈ తరహా కేసు విచారణ ఇదే మొదటిసారి. ఈడీ పిటిషన్‌ ఆమోదం పొందితే, మాల్యాకు చెందిన రూ.12,000 కోట్ల ఆస్తుల జప్తునకు వాటిని విక్రయించి రుణ దాతల బకాయిల చెల్లింపునకు ఈడీకి మార్గం సుగమం అవుతోంది. అయితే తనను ‘‘పారిపోయిన’’ నేరస్తునిగా జనవరి 5వ తేదీన ముంబై స్పెషల్‌ కోర్ట్‌ ప్రకటించడాన్ని మాల్యా ముంబై హైకోర్టులో సవాలు చేశారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top