మాల్యా నుంచి ఆఫర్‌ రాలేదు

 Vijay Mallya extradition to speed up loan recovery process: SBI - Sakshi

ఆయన్ని తెస్తే రుణాల రికవరీ వేగవంతమవుతుంది

ఎస్‌బీఐ చీఫ్‌ రజనీష్‌ కుమార్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా నుంచి సెటిల్మెంట్‌కు సంబంధించి అధికారికంగా తమకు ఎలాంటి ఆఫర్‌ రాలేదని ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ స్పష్టంచేశారు. ‘కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల కన్సార్షియానికి ఎస్‌బీఐ సారథ్యం వహిస్తోంది. మాల్యా భారత్‌కు తిరిగి వస్తే రుణాల రికవరీ ప్రక్రియ వేగం కాగలదని చెప్పారాయన. తీసుకున్న రుణాల్లో అసలును తిరిగి ఇచ్చేస్తానని తాను ఆఫర్‌ చేస్తున్నా బ్యాంకులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాల్యా చెబుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీష్‌ కుమార్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం తీసుకున్న రూ.9,000 కోట్ల రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన మాల్యాను భారత్‌కు అప్పగించాలంటూ అక్కడి కోర్టు ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. రుణాలు ఎగ్గొట్టిన వారు ఎక్కడికి పారిపోయినా తప్పించుకోలేరనడానికి మాల్యా ఉదంతం నిదర్శనం కాగలదని కుమార్‌ చెప్పారు. ‘రుణాల రికవరీకి అవకాశాలు మెరుగుపడ్డాయి. రుణాలు ఎగ్గొట్టేసి, దేశం నుంచి పారిపోయినా తప్పించుకోలేరన్నది మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న కోర్టు తీర్పు ద్వారా స్పష్టమవుతోంది‘ అని ఆయన పేర్కొన్నారు.  

నీరవ్‌ను కూడా తెప్పించే అవకాశాలు.. 
మాల్యా ఉదంతం నేపథ్యంలో రూ.13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలను రప్పించే ప్రక్రియ కూడా వేగవంతం కాగలదని రజనీష్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. మాల్యా అప్పగింతతో మొత్తం రుణదాతలు, రుణగ్రహీతల మధ్య సంబంధాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారాయన. ‘దేశానికి పెట్టుబడులు అవసరం. ఇటు రుణదాతలకు, అటు గ్రహీతలకు రుణ లావాదేవీలు ముఖ్యం. కానీ ఇవి పారదర్శకంగా, స్వచ్ఛంగా ఉండాలి. బ్యాంకులు కూడా దేనికోసం రుణాలిస్తున్నాయో ఒకటికి రెండు సార్లు చూసుకుని, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి‘ అని రజనీష్‌ చెప్పారు. మరోవైపు ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామాపై తాను స్పందించబోనని ఆయన చెప్పారు. పటేల్‌ తప్పుకున్న దరిమిలా.. ఒక్క రోజు డిఫాల్ట్‌ అయినా మొండిబాకీగా పరిగణించాలంటూ ఆర్‌బీఐ విధించిన నిబంధనల్లో మార్పులుంటాయా లేదా అన్నది అంచనా వేయడం కష్టమన్నారు. మొండిబాకీలు పేరుకుపోయిన విద్యుత్‌ కంపెనీలకు సంబంధించి.. ఆరు లేదా ఏడు సంస్థల కేసులు త్వరలో పరిష్కారం కాగలవని రజనీష్‌ తెలియజేశారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top