బ్రిటన్‌ కోర్టులో మాల్యాకు ఎదురుదెబ్బ

UK Court Orders Vijay Mallya To Be Extradited - Sakshi

లండన్‌: రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాల్యాను భారత్‌కు  అప్పగించే విషయంలో సోమవారం తీర్పు వెలువరించిన న్యాయస్థానం.. భారత ప్రభుత్వ వాదనను సమర్ధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 9 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేయడంతో పాటు, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు మాల్యాపై ఉన్నాయి. రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించిన క్రమంలో 2016లో విజయ్‌ మాల్యా భారత్‌ నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే.

మాల్యాపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సీబీఐ, ఈడీలు అతన్ని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్‌ కోర్టును ఆశ్రయించాయి. భారత ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించారు. మరోవైపు తనపై రాజకీయ దురుద్దేశంతోనే కేసులు మోపారని, భారత జైళ్లలో దారుణ పరిస్థితులు ఉంటాయని మాల్యా వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం భారత ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ.. నేడు తీర్పు వెలువరించింది. కాగా, మాల్యాకు ఈ తీర్పుపై 14 రోజుల్లోగా హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top