ఉబెర్, ఓలాకు డ్రైవర్‌ ఓనర్ల గుడ్‌బై!

Uber, Ola drivers threaten indefinite strike from Sunday - Sakshi

సగానికి సగం కొత్త ఉపాధి వైపు

ఇన్సెంటివ్‌లు లేకపోవటమే ప్రధాన కారణం

ఆదివారం అర్ధరాత్రి నుంచి డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ట్యాక్సీ అగ్రిగేటర్లు ఉబెర్, ఓలాకు డ్రైవర్‌ ఓనర్లు గుడ్‌బై చెబుతున్నారు. బుకింగ్‌లు తగ్గడం, రాబడి విషయంలో కంపెనీ హామీ ఇచ్చిన మొత్తం రాకపోవడంతో ట్యాక్సీ సేవల నుంచి వీరు తప్పుకుంటున్నట్టు సమాచారం. దీంతో ఐటీ కంపెనీలకు కారును లీజుకిచ్చేవారు, రెంటల్స్‌కు నడుపుకుంటున్న వారి సంఖ్య ఈ మధ్య గణనీయంగా పెరిగింది కూడా. బుకింగ్‌ల విషయంలో తాను లీజుకిచ్చిన వాహనాలకు ఓలా అధిక ప్రాధాన్యమిస్తూ డ్రైవర్‌ ఓనర్లకు బుకింగ్‌లు పెద్దగా ఇవ్వటం లేదని, ఇక ఇన్సెంటివ్‌లు దాదాపు కనుమరుగయ్యాయని... అందుకే తాము తప్పుకోవాల్సి వస్తోందని వీరు చెబుతున్నారు.

ట్రిప్పులు లేక ఇన్సెంటివ్‌లు జీరో...
తొలినాళ్లలో కస్టమర్‌ ఇచ్చే మొత్తం కాకుండా ఇన్సెంటివ్‌ రూపంలో డ్రైవర్‌ ఓనర్లకు 10 ట్రిప్పులకు గాను ఓలా రూ.5,000 నగదును  చెల్లించింది. ఉబెర్‌ ఒక ట్రిప్పుకు రూ.250 అందించింది. ఈ స్థాయి ప్రోత్సాహకాలను చూసి వేల మంది కార్లను కొనుగోలు చేశారు.

ఇప్పుడు ప్రోత్సాహకాల కింద ఇచ్చే నగదు భారీగా తగ్గడంతోపాటు, అవి అందుకోవడానికి చేయాల్సిన ట్రిప్పులు పెరిగి తలకు మించిన భారమయ్యాయి. దీంతో అదనపు ఆదాయం దాదాపు లేనట్టేనని శ్రీనివాస్‌ అనే డ్రైవర్‌ ఓనర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఏడాదిన్నర కిందట డ్రైవర్‌ జీతం రూ.15 వేలుంటే, ఇప్పుడు రూ.18 వేలకు చేరింది. డీజిల్‌ లీటరుకు రూ.10 పెరిగింది. ట్యాక్సీలు ఎక్కువై డిమాండ్‌ పడిపోయింది. ట్రాఫిక్‌ రోజు రోజుకూ అధికం కావడం కూడా మా సమస్యను పెంచింది’ అని చెప్పారాయన.

రుణాలు చెల్లించలేక..
ఒకానొక దశలో హైదరాబాద్‌లో ఉబెర్, ఓలా వద్ద దాదాపు 75,000 వాహనాలు తిరిగాయని తెలంగాణ క్యాబ్స్, బస్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నిజాముద్దీన్‌ ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ప్రస్తుతం సగం మంది బయటకు వచ్చారని తెలిపారు.

‘అప్పులు చేసి మరీ చాలామంది కార్లను కొనుక్కున్నారు. ఆదాయాలు లేక డ్రైవర్‌ ఓనర్లు బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించలేకపోతున్నారు. వేల వాహనాలను బ్యాంకులు తీసుకెళ్లిపోయాయి. ఇపుడు ఉబెర్, ఓలాకు ట్యాక్సీ నడపాలనుకుంటున్న అభ్యర్థులకు బ్యాంకులు రుణాలివ్వటం లేదు. దీంతో చాలా మంది కార్లను అమ్మేసి డ్రైవర్లుగా మారారు’’ అని ఆయన వివరించారు.

దేశవ్యాప్తంగా సమ్మె!
ఈ ఆదివారం (మార్చి 18) అర్థరాత్రి నుంచి ఉబెర్, ఓలా డ్రైవర్‌ ఓనర్లు సమ్మెకు దిగుతున్నారు. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఈ రెండు కంపెనీలు సర్వీసులందిస్తున్న నగరాల్లో సమ్మె ఉంటుందని సమాచారం. తమ డిమాండ్లకు యాజమాన్యాలు దిగిరాకపోతే సమ్మెను కొనసాగించాలని యూనియన్లు భావిస్తున్నాయి. కంపెనీల నుంచి నగదు ప్రోత్సాహకాలు తగ్గడమే సమ్మెకు ప్రధాన కారణం. వాహనాలను ఇబ్బడిముబ్బడిగా నమోదు చేస్తుండడంతో ట్రిప్పులు లేక ఆదాయాలు పడిపోతున్నాయని డ్రైవర్‌ ఓనర్లు చెబుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top