రూపాయికి ‘ఫెడ్‌’ షాక్‌! | Sakshi
Sakshi News home page

రూపాయికి ‘ఫెడ్‌’ షాక్‌!

Published Fri, Sep 22 2017 12:32 AM

రూపాయికి ‘ఫెడ్‌’ షాక్‌! - Sakshi

డాలర్‌ ఇండెక్స్‌ రయ్‌ రయ్‌...
► రూపాయికి 54 పైసలు నష్టం
► అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌
► ‘కఠిన విధాన’ ప్రకటన నేపథ్యం
►  పసిడి 24 డాలర్లు డౌన్‌


ముంబై: అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగుందని, ఈ ఏడాది ఒకసారి, వచ్చే ఏడాది  మూడుసార్లు ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపు ఖాయమని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ బుధవారం చేసిన ప్రకటన డాలర్‌ ఇండెక్స్‌ పెరుగుదలకు, రూపాయి పతనానికి దారితీశాయి. బంగారం కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా 20 డాలర్లు పైగా పడిపోయింది. వివరాలివీ....

డాలర్‌ ఇండెక్స్‌: ఫెడ్‌ రేటు (ప్రస్తుతం 1 – 1.25 శాతం) పెంపు తప్పదన్న నిర్ణయంతో పాటు అక్టోబర్‌ నుంచి నగదు ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు లిక్విడిటీని  వెనక్కు తీసుకునే చర్యలకు శ్రీకారం చుడతామని భారత్‌ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30కి అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడే సమయానికి డాలర్‌ ఇండెక్స్‌ 91.30 వద్ద ఉంది. ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాలకే ఇండెక్స్‌ భారీగా ఒక డాలర్‌ మేర లాభపడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై తక్షణం వెలువడిన ‘బులిష్‌ ధోరణి’ ఫలితం ఇది. గురువారం ఈ వార్త రాసే సమయానికి డాలర్‌ ఇండెక్స్‌ గరిష్ట స్థాయి 92.46కాగా, కనిష్టస్థాయి 91.89.

రూపాయిపైనా ప్రభావం...
డాలర్‌ విలువకు జోష్‌ రావటం గురువారంనాడు భారత రూపాయిపై ప్రభావం చూపించింది. ఫారెక్స్‌ మార్కెట్‌లో సాయంత్రం 5 గంటలకు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బుధవారం ముగింపుతో పోల్చిచూస్తే, డాలర్‌ మారకంలో రూపాయి విలువ 54 పైసలు నష్టపోయింది. 64.81 వద్ద ముగిసింది. ఇది రెండున్నర నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. కాగా. కడపటి సమాచారం అందేసరికి, అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ  మరింత బలహీనంగా 64.90 వద్ద ట్రేడవుతోంది. రూపాయి కనిష్ట–గరిష్ట స్థాయిలు 64.29 – 65.07గా నమోదయ్యాయి.

జారిన బంగారం...
ఉత్తరకొరియా ఉద్రిక్తత, అమెరికా ఆర్థిక అనిశ్చితులు, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత వంటి అంశాల నేపథ్యంలో, బంగారం రెండు వారాల క్రితం ఔన్స్‌కు (31.1 గ్రా.) 1,365 డాలర్ల ధరను తాకింది. లాభాల స్వీకరణతో అటు తర్వాత  కిందకు దిగుతూ వస్తున్న బంగారానికి ‘ఫెడ్‌’ నిర్ణయం దెబ్బ గట్టిగానే తగిలింది. గురువారం ఒకానొకదశలో బుధవారంతో పోలిస్తే ఏకంగా 20 డాలర్లు తగ్గి, 1,296 డాలర్ల వద్దకు దిగజారింది. ఒక దశలో 1,292 డాలర్ల స్థాయిని సైతం తాకింది. గత ట్రేడింగ్‌లో బంగారం 1,300 డాలర్లను తాకడానికి దాదాపు రెండు వారాలు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గురువారం ట్రేడింగ్‌ అంతా ఇలా బలహీనంగానే సాగితే 1,300 డాలర్ల కీలక మద్దతును కోల్పోయినట్లే.

దేశీయంగా స్పాట్, ఫ్యూచర్స్‌ ఇలా...: ఇక దేశీయంగా ఫ్యూచర్స్‌ మార్కెట్‌.. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఎంసీఎక్స్‌)లో పసిడి 10 గ్రాముల ధర ఒకదశలో క్రితం ముగింపుకన్నా రూ.220 నష్టంతో రూ. 29,554 వద్దకు దిగజారింది. ముంబై స్పాట్‌లో బుధవారం 99.9 స్వచ్ఛత ధర రూ. 220 తగ్గి రూ.29,730 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.29,580కి చేరింది. వెండి కేజీ ధర రూ.600 కిందకుదిగి రూ.39,265కు పడింది.

Advertisement
 
Advertisement
 
Advertisement