
16–17 తేదీలలో పరపతి సమీక్ష
0.25 శాతం వడ్డీ రేటు కోతపై ఆశలు
దేశీయంగా ధరల గణాంకాలు కీలకం
ఈ వారం స్టాక్ మార్కెట్‌పై అంచనాలు
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపించగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. దీంతో ఫైనాన్షియల్ మార్కెట్లతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు సైతం ఫెడ్ నిర్ణయాలపై దృష్టిపెట్టనున్నాయి. మరోవైపు దేశీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక టెక్నికల్ అంశాల ప్రకారం మార్కెట్లు ఈ వారం బ్రేకవుట్ సాధించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.
దేశీయంగా నేడు(15న) ఆగస్ట్ నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. 2025 జూలైలో డబ్ల్యూపీఐ మైనస్ 0.45 శాతంగా నమోదైంది. అయితే గత నెలలో 0.45 శాతం పెరిగే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా ఆహారం, ఇంధనం, ఇతర కీలక విభాగాలలో ధరల పెరుగుదల కారణంకానున్నట్లు అంచనా వేశారు. కాగా.. గత వారాంతాన విడుదలైన వివరాల ప్రకారం ఆగస్ట్ నెలలో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 2.07 శాతానికి చేరింది. జూలైలో 1.61 శాతం కాగా, గత నెలలో కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లు, నూనెలు, కొవ్వు ఉత్పత్తుల ధరలు పెరగడం ప్రభావం చూపింది. ఇవికాకుండా యూఎస్‌తో వాణిజ్య వివాదాలకు చెక్ పడటంపై సానుకూల సంకేతాలు వెలువడితే దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహం లభించనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు.
కనీసం పావు శాతం
ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్శన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన ఈ నెల 16 నుంచి ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) రెండు రోజులపాటు పాలసీ సమావేశాలు నిర్వహించనుంది. యూఎస్ ఉపాధి మార్కెట్ నీరసించిన నేపథ్యంలో 17న ఫెడరల్ ఫండ్స్(కీలక వడ్డీ) రేటులో కోత పెట్టనున్నట్లు అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. సీపీఐ జూలైలో 0.2 శాతంకాగా.. ఆగస్ట్‌లో 0.4 శాతానికి ఎగసింది.
దీంతో వార్షిక ద్రవ్యోల్బణం 2.9 శాతంగా నమోదైంది. దీంతో ఈసారి పాలసీ సమావేశంలో ఉద్యోగ కల్పనకు దన్ను, ధరల తగ్గింపును ఫెడ్ కీలక లక్ష్యాలుగా ఎంచుకునే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు. కనీసం పావు శాతం కోతకు వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేటు 4.25–4.5% గా ఉంది. ఈ నేపథ్యంలో అటు యూఎస్, ఆసియా మార్కెట్లతోపాటు దేశీయంగానూ ఫెడ్ వడ్డీ రేట్ల కోత బలమివ్వనున్నట్లు ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థ ఎన్‌రిచ్ మనీ సీఈవో పొన్ముడి ఆర్ అభిప్రాయపడ్డారు.
ఇతర అంశాలకూ ప్రాధాన్యం
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. అయితే ఫెడ్ వడ్డీ కోత పెడితే దేశీ మార్కెట్లో పెట్టుబడులు పుంజుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గత నెల(ఆగస్ట్)లో దేశీ స్టాక్స్ నుంచి ఎఫ్‌పీఐలు రూ. 34,900 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. జూలైలోనూ రూ. 17,700 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఈ నెలలో సైతం తొలి వారంలో రూ. 12,257 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించడం గమనార్హం! కాగా.. డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టాలకు చేరుతోంది. దీంతో అటు పసిడి, ఇటు ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. రూపాయి బలహీనతతో దిగుమతుల బిల్లు పెరిగి మరింత వాణిజ్య లోటుకు దారితీస్తున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు. అయితే ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన జీఎస్‌టీ సంస్కరణలతో వినియోగం ఊపందుకోనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు.
గత వారమిలా..
జీఎస్‌టీ సంస్కరణలు, భారత్, యూఎస్ మధ్య టరిఫ్ వివాద పరిష్కారంపై ఆశలతో గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,117 పాయింట్లు(1.4%)
జంప్‌చేసి 81,905 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 314 పాయింట్లుపైగా(1.4%) ఎగసి 25,114 వద్ద స్థిరపడింది.
బ్రేకవుట్‌కు చాన్స్
యూఎస్, భారత్ మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులో కోతపై అంచనాలు, జీఎస్‌టీ సంస్కరణలతో పలు రంగాలలో ఊపందుకోనున్న వినియోగం వంటి సానుకూల అంశాలు గత వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. తాజా సానుకూలతల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లలో బ్రేకవుట్‌కు వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. కొద్దిరోజులుగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 79,750–82,250 పాయింట్ల శ్రేణిలో కదులుతోంది. 82,250ను అధిగమిస్తే.. 83,500–83,650 పాయింట్లకు బలపడే వీలుంది. ఒకవేళ దిగువకు చేరితే.. 81,450–81,200 స్థాయిలో మద్దతు లభించవచ్చు. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ పుంజుకుంటే 25,250ను అధిగమించవలసి ఉంటుంది. ఆపై 25,500 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. బలహీనపడితే 24,900 వద్ద తొలుత, ఆపై 24,700 వద్ద తదుపరి మద్దతు అందుకునే వీలుంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్