చాలా వేగంగా మొబైల్‌ నెంబర్‌ పోర్టబులిటీ

TRAI To Make Mobile Number Portability Simpler Faster - Sakshi

మొబైల్‌ నెంబర్‌ను పోర్టబులిటీ పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక నుంచి ఈ ప్రక్రియ చాలా తేలికగా, వేగంగా అయిపోనుందని తెలుస్తోంది. మొబైల్‌ నెంబర్‌ పోర్టబులిటీ మెకానిజాన్ని(ఎంఎన్‌పీ) సమీక్షించాలని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్‌ ప్లాన్‌ చేస్తోంది. ఎంఎన్‌పీ కింద ఒక నెట్‌వర్క్‌ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారడానికి సమయాన్ని తగ్గించేందుకు ట్రాయ్‌ ఓ కన్సల్టేషన్‌ పేపర్‌ కూడా రూపొందిస్తోంది. 

ఇది మొత్తం ప్రక్రియను సులభతరం చేయనుందని ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ చెప్పారు. ప్రస్తుతం ఈ ప్ర​క్రియకు చాలా సమయం పడుతుందని, ఈ సమయాన్ని తగ్గించడంతో పాటు, మొత్తం ప్రక్రియను మార్చాలని కన్సల్టేషన్‌ పేపర్‌ లక్ష్యంగా పెట్టుకుందని శర్మ అన్నారు. ప్రస్తుతం దీనిపై పనిచేస్తున్నామని, ఈ నెలాఖరి వరకు ఈ ప్ర​క్రియ ముగుస్తుందని చెప్పారు. అంతకముందే మొబైల్‌ నెంబర్‌ పోర్టబులిటీ ఛార్జీలను ట్రాయ్‌ 79 శాతం మేర తగ్గించిన సంగతి తెలిసిందే. అంతకముందు 19 రూపాయలుగా ఉన్న ఎంఎన్‌పీ ఛార్జీలను ప్రస్తుతం గరిష్టంగా 4 రూపాయలు ఉండేలా నిర్ణయించింది. 

దీనిపై ఇండస్ట్రి అభిప్రాయాలను కూడా ట్రాయ్‌ స్వీకరిస్తోంది. మొత్తం ఎంఎన్‌పీ ప్రక్రియ ఎలా సులభతరంగా, వేగంగా చేయాలో కూడా ట్రాయ్‌ ఇండస్ట్రి అభిప్రాయాలను కోరుతోంది. ప్రస్తుతం ఒక నెట్‌వర్క్‌ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారడానికి ఏడు రోజుల సమయం పడుతోంది. కానీ గ్లోబల్‌గా ఈ ప్రక్రియకు కేవలం గంటల వ్యవధి మాత్రమే సమయం పడుతుందని ట్రాయ్‌ అధికారులు చెప్పారు. ఎంఎన్‌పీ కింద నెంబర్‌ను మార్చుకోవాల్సినవసరం లేకుండా ఒక ఆపరేటర్‌ నుంచి మరో ఆపరేటర్‌కు పోర్టబులిటీ పెట్టుకోవచ్చు. గత కొన్ని నెలలుగా రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, టాటా టెలిసర్వీసెస్‌, ఎయిర్‌సెల్‌ ఆపరేటర్ల సబ్‌స్క్రైబర్లు తమ నెంబర్లను పోర్టబులిటీ పెట్టుకోవడానికి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.  
 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top