1350 డాలర్లు దాటేయొచ్చు!!

Trade War Effect Gold may touch 1350 Dollars - Sakshi

పసిడిపై పరిశీలకుల అంచనాలు

గడిచిన ఏడాది కాలంగా చూస్తే గత వారంలో పసిడి మార్కెట్‌ అత్యుత్తమ పనితీరు కనపర్చింది. ఇదే ఊపు కొనసాగిస్తే.. కీలకమైన దీర్ఘకాలిక నిరోధ స్థాయి 1,350 డాలర్ల మార్కును సమీప కాలంలోనే దాటేసేయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగ కల్పన గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటంతో బంగారం ధరలు మళ్లీ 1,350 డాలర్ల చేరువకు దగ్గరయ్యాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్లో ఆగస్టు కాంట్రాక్టుకు సంబంధించి పసిడి ఔన్సు (31.1 గ్రాములు) ధర 2.7 శాతం పెరిగి ఒక దశలో 1,347.10 డాలర్లుగా ట్రేడయ్యింది. గత నెలలో కనీసం 1,77,000 ఉద్యోగాల కల్పన జరగవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేసినప్పటికీ .. వాస్తవానికి కేవలం 75,000 ఉద్యోగాల కల్పన మాత్రమే జరగడం పసిడి ర్యాలీకి కారణమైనట్లు ఆర్థికవేత్తలు తెలిపారు.

పసిడి మరింత అధిక స్థాయికి పరుగులు తీసేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ఆర్‌జేవో ఫ్యూచర్స్‌ సంస్థ సీనియర్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ ఫిలిప్‌ స్ట్రీబుల్‌ తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఔన్సుకు 1,400 డాలర్లకు కూడా చేరగలిగేంత సత్తా కనిపిస్తోందని పేర్కొన్నారు. అయితే, ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ.. సాంకేతికంగా కొన్ని గట్టి నిరోధ స్థాయులు కూడా ప్రతిబంధకాలుగా ఉంటున్నాయి. 2015లో కనిష్ట స్థాయిని తాకినప్పట్నుంచి 1,350 నిరోధ స్థాయిని పసిడి ఇప్పటిదాకా ఎనిమిది సార్లు పరీక్షిస్తూ వస్తోంది. ఏదైతేనేం.. పసిడి రేటు 1,350కి పైన పటిష్టంగా ముగిసిన పక్షంలో మధ్య కాలికంగా ఆ తర్వాత 1,360, 1,375 స్థాయులకు చేరే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top