దేశీ ఈ కామర్స్‌ సంస్థలకూ అవే నిబంధనలు...

These e-commerce companies have the same rules - Sakshi

అమలుకు సీఏఐటీ డిమాండ్‌...

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో (ఎఫ్‌డీఐ) కూడిన ఈ కామర్స్‌ సంస్థలకు సంబంధించిన నిబంధనలను దేశీయ ఈ కామర్స్‌ సంస్థలకూ అమలు చేయడం ద్వారా, అనైతిక వ్యాపార విధానాలకు పాల్పడకుండా నిరోధించాలని అఖిల భారత వర్తకుల సంఘం (సీఏఐటీ) డిమాండ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన విధానాన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్‌ ప్రభుకు లేఖ రాసింది. ఈ కామర్స్‌ రంగానికి సంబంధించిన విధానంపై వాణిజ్య శాఖ పనిచేస్తుండగా... త్వరలోనే దాన్ని విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో సీఏఐటీ లేఖ రాయడం గమనార్హం. ‘‘నూతన విధానంలో పేర్కొన్న ఎఫ్‌డీఐ నిబంధనలు దేశీయ ఈ కామర్స్‌ సంస్థలకూ వర్తింపజేయాలి.

అనైతిక వ్యాపార ధోరణలను అనుసరించకుండా నిరోధించాలి. వాటిని ఇతర ఈ కామర్స్‌ సంస్థలతో సమానంగా చూడాలి’’ అని సీఏఐటీ కోరింది. ఈ రంగానికి స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్‌ చేసింది. కొన్ని సంఘాలు ఎఫ్‌డీఐ నిబంధనలను తప్పుబడుతున్నాయని, ఎటువంటి ఒత్తిళ్లకు లొంగవద్దని కోరింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి విదేశీ ఈ కామర్స్‌ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లపై, తమ వాటాలు కలిగిన కంపెనీల ఉత్పత్తులను విక్రయించకుండా, ప్రత్యేకమైన మార్కెటింగ్‌ ఒప్పందాలతో ఉత్పత్తులను మార్కెట్‌ చేయకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. అయితే త్వరలోనే ఈ–కామర్స్‌లోకి రావటానికి ప్రయత్నాలు చేస్తున్న రిలయన్స్‌ వంటి సంస్థలకు ఈ పరిణామం లాభించవచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ సంస్థలకూ ఇవే నిబంధనలు వర్తింపజేయాలని వర్తకుల సంఘం డిమాండ్‌ చేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top