
యాపిల్.. ఐప్యాడ్ ఎయిర్ 2
టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా ఐప్యాడ్ ఎయిర్ 2 ట్యాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది.
ప్రపంచంలోనే అత్యంత పల్చని ట్యాబ్లెట్ ధర 499 డాలర్లు
వాషింగ్టన్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా ఐప్యాడ్ ఎయిర్ 2 ట్యాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత పల్చని ట్యాబ్లెట్‌గా కంపెనీ సీఈవో టిమ్ కుక్ దీన్ని అభివర్ణించారు. దీని ధర 499 డాలర్లుగా ఉంటుంది. ఇందులో 8 మెగాపిక్సెల్ ఐసైట్ కెమెరా, సుమారు 3 బిలియన్ ట్రాన్సిస్టర్లు ఉండే కొత్త తరం ఏ8ఎక్స్ చిప్, యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉంటాయి. ఈ కోటింగ్‌ను ఉపయోగించడం ట్యాబ్లెట్లో ఇదే తొలిసారని కుక్ పేర్కొన్నారు. అలాగే, స్లో మోషన్ వీడియోలు తీసుకునే వీలుండటం ఈ ట్యాబ్లెట్ ప్రత్యేకతని వివరించారు.
మరోవైపు స్వల్పంగా అప్‌గ్రేడ్ చేసిన ఐప్యాడ్ మినీ 3ని, సరికొత్త మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కుక్ ఆవిష్కరించారు. ఎయిర్, మినీ ట్యాబ్లెట్లలో టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటాయి. మినీ ధర 399 డాలర్ల నుంచి మొదలవుతుందని కుక్ చెప్పారు. వీటికి ప్రీ-ఆర్డర్లు ప్రారంభించినట్లు తెలిపారు. ఇక, కొత్త మొబైల్ పేమెంట్స్ విధానం యాపిల్ పేని విస్తృతంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 బ్యాంకులు, మరెన్నో భారీ రిటైల్ సంస్థలు ఈ డిజిటల్ చెల్లింపుల విధానానికి మద్దతునిచ్చేందుకు అంగీకరించాయని కుక్ పేర్కొన్నారు.