రూ.10వేల కోట్ల బిజినెస్ లక్ష్యం | Sakshi
Sakshi News home page

రూ.10వేల కోట్ల బిజినెస్ లక్ష్యం

Published Sat, Sep 6 2014 1:16 AM

రూ.10వేల కోట్ల బిజినెస్ లక్ష్యం

విజయవాడ: వచ్చే మార్చి 2015 నాటికి రూ.10వేల కోట్లు వ్యాపారం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ సీవీఆర్ రాజేంద్రన్ అన్నారు. నగరంలోని హోటల్ గేట్‌వేలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన బ్యాంక్ ప్రణాళికను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో పది నూతన బ్రాంచిలను ప్రారంభిస్తున్నామని, మరో పది బ్రాంచిలను ఆధునీకరించి నవశక్తి ప్రాజెక్ట్ ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు  తెలిపారు.

 రిటైల్ వ్యాపార రుణాలతోపాటు, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు, హౌసింగ్, ఎడ్యుకేషన్ రుణాల మంజూరుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ద్వారా సెప్టెంబరు 4 నాటికి 29వేల ఖాతాలు ప్రారంభించామన్నారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వ నియమ నిబంధనలను అనుగుణంగా వ్యవహరిస్తామని, ఇప్పటికే తాము ప్రభుత్వానికి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో రైతు రుణాలు రూ.1284 కోట్ల నిరర్ధక ఆస్తులుగావున్నాయని, రుణ మాఫీ వర్తించని వారు తక్షణమే  రుణాలు చెల్లించి, తిరిగి పొందాలని రాజేంద్రన్ కోరారు.

విజయవాడ జోన్‌కు సంబంధించి 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెండు నూతన బ్రాంచీలు, నాలుగు ఏటీఎంలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. గుంటూరు డీజీఎం గిరీష్‌కుమార్ మాట్లాడుతూ.. రుణమాఫీకి అర్హులైన రైతులు రుణాలు చెల్లించినప్పటికీ, మాఫీ వర్తింపజేసిన తర్వాత కట్టిన రుణాలు తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు. అందువలన రైతులు తొలుత తమ రుణాలు చెల్లించి, 24గంటల్లోపు తిరిగి పొందవచ్చన్నారు. డ్వాక్రా సభ్యులూ రుణాలు చెల్లించాలని, లేనిపక్షంలో వడ్డీ లేని రుణాలు పొందుటకు అనర్హులవుతారని పేర్కొన్నారు. సమావేశంలో విజయవాడ డీజీఎం కృష్ణారావు కూడా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement