Bhuma Family: భూమా కుటుంబంలో 'దావా'నలం | Sakshi
Sakshi News home page

Bhuma Family: భూమా కుటుంబంలో 'దావా'నలం

Published Sun, Oct 9 2022 1:24 PM

Cheating case Petition Allagadda Court Bhuma Nagireddy Couple - Sakshi

దివంగత భూమా నాగిరెడ్డి దంపతులపై చీటింగ్‌ కేసు నమోదు చేయాలని ఆళ్లగడ్డ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనను నిశితంగా పరిశీలిస్తే భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్‌ ప్రధాన అనుచరుడు గుంటూరు శీను తండ్రి మాదాల వెంకటరమణయ్య ఈ దావా వేశారు. దీనికి ప్రధాన కారణం నంద్యాల ఆంధ్రా బ్యాంకులోని అప్పును ఎగవేసేందుకు ఓ పథకం ప్రకారం కోర్టులో దావా వేసినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న ఈఘటనకు సంబంధించిన  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సాక్షి, ఆళ్లగడ్డ: భూమా నాగిరెడ్డి తన పేరుపై ఉన్న భూమిని నంద్యాల ఆంధ్రా బ్యాంకులో తనఖాపెట్టి రుణం తీసుకున్నారు. నాగిరెడ్డి బతికి ఉన్నంత వరకూ నెలవారీగా వాయిదాలు చెల్లించారు. వారు చనిపోయిన తర్వాత అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.19 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటిని చెల్లించాలని బ్యాంకు నుంచి భూమా వారసులపై ఒత్తిడి పెరిగింది. దీని నుంచి బయట పడేందుకు వారు పథకం రచించారు. బ్యాంకులో రుణం తీసుకునేందుకు ముందే తనఖా పెట్టిన ఆస్తి మాదాల వెంకటరమణయ్య అనే వ్యక్తికి విక్రయించినట్లు ఓ అగ్రిమెంట్‌ సృష్టించారు. తర్వాత తమకు విక్రయించిన ఆస్తిని తమకు తెలియకుండా బ్యాంకులో తనఖా పెట్టి మోసం చేశారని కోర్టులో దావా వేశారు. అయితే, ఈ దావా దాఖలు వెనుక భూమా  వారసుల ప్రమేయం ఉందనే చర్చ జిల్లాలో జోరుగా నడుస్తోంది. ఈ దిశగానే సోషల్‌ మీడియాలో కూడా కథనాలు  వస్తున్నాయి.  

బకాయిల బాగోతం ఇదీ 
2011 డిసెంబరు నెలలో  భూమానాగి రెడ్డి పేరు మీద ఉన్న సర్వే నంబర్‌ 66/1 లో 1.94, 66/1 లో 4.37, 73 లో 6.17,  370/1ఎ లో 1.50, 370/ఏ2 లో 4.10, 370 /ఏ3 లో 0.40, 370/బి3లో 0.43, ఎకరాలు,   భూమా శోభానాగి రెడ్డి పేరుమీద ఉన్న  356/ఏ, 170/ఏ లోని 1190 చదరపు గజాలు, 75/3 లో 1.08, 75/1లో 013 ఎకరాలు,  భూమా శివలక్షమ్మ పేరుమీద ఉన్న 574/1లో 1.00, 574/2లో 1.40 ఎకరాల భూము లను ఉమ్మడిగా నంద్యాల ఆంధ్రా బ్యాంకులో కుదువ పెట్టి రుణం తీసుకున్నారు.

ఈ ఆస్తులను బ్యాంకు తనఖా కంటే 4 నెలల ముందే అంటే 2011 ఆగస్టు 10న తనకు విక్రయించారని, అందుకు సంబంధించి అగ్రిమెంట్‌ రాసిచ్చారని వెంకటరమణయ్య ఓ అగ్రిమెంట్‌ సృష్టించినట్లు తెలుస్తోంది. రూ. 30 లక్షలు అగ్రిమెంట్‌ రోజు ఇచ్చారని, ఆపై 2014 ఫిబ్రవరి 10న మరో రూ.3 లక్షలు ఇచ్చారని దావాలో పేర్కొన్నారు. శోభానాగిరెడ్డి మృతి తర్వాత వారి వారసులు అఖిల, నాగమౌనిక, జగత్‌ విఖ్యాత్‌ రెడ్డిలు 2016 జనవరి 5న రూ.5 లక్షలు, భూమానాగిరెడ్డి మృతి తర్వాత 2019 డిసెంబర్‌ 26న రూ.6 లక్షలు తీసుకున్నారని, మిగిలిన సొమ్ము చెల్లిస్తామని సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేయించాలని ఆళ్లగడ్డ కోర్టులో ఈ నెల 6న వెంకటరమణయ్య దావా వేశారు. 

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు! 
తల్లిదండ్రులు మృతి చెందిన తరువాత వారి పేరు ప్రతిష్టలు తగ్గకుండా వారసులు చూస్తారు. ఎవరైనా వారి గురించి తప్పుగా మాట్లాడినా జీర్ణించుకోలేరు. ఇందుకు విరుద్ధంగా భూమా వారసులు రాజకీయంగా పదవులు.. కోట్లాది రూపాయల ఆస్తుల అనుభవిస్తూ వారిపైనే కోర్టులో దావా వేయించడం పట్ల భూమా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడమే కాదు వారు చేసిన అప్పులను కూడా చెల్లించాలని చర్చించుకుంటున్నారు. దీనికి తోడు పై ఆస్తుల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ 100 కోట్ల దాకా ఉంటుంది. ఇంత విలువైన ఆస్తులను భూమా దంపతులు మాదాల వెంకటరమణయ్యకు కేవలం రూ. 45 లక్షలకు విక్రయించారంటే నమ్మశక్యం కావడం లేదని భూమా అభిమానులు చర్చించుకుంటున్నారు. 

ఎవరీ మాదాల వెంకటరమణయ్య  
గుంటూరు పట్టణానికి చెందిన వెంకటరమణయ్య ఇటీవల ఆళ్లగడ్డ ప్రాంతంలో తరచూ వినపడుతున్న గుంటూరు శీనుకు తండ్రి.    అఖిలప్రియ భర్త భార్గవరామ్‌కు శీను అత్యంత సన్నిహితుడు.  టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి హత్యాయత్నం కేసు, హైదరాబాద్‌లో స్థలం విషయంలో జరిగిన కిడ్నాప్‌ కేసులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఆయా కేసుల్లో అఖిలప్రియ, భార్గవరామ్‌తో పాటు  గుంటూరు శీను ప్రధాన నిందితుడు.  ఇప్పుడు అతని తండ్రి వెంకటరమణయ్య  భూమా దంపతులతో పాటు వారి వారసులైన భూమా అఖిలప్రియ, నాగమౌనిక, జగత్‌ విఖ్యాత్‌ రెడ్డిలపై కోర్టులో కేసు వేయడం ఒక ఎత్తైతే ఆ దావాకు వకాల్తా పుచ్చుకున్నది అభిలప్రియ వ్యక్తిగత లాయరే కావడం విశేషం. 

బ్యాంకుకు శఠగోపం పెట్టేందుకే!  
భూమా దంపతులు ఉన్నప్పుడు తీసుకున్న రుణానికి సంబంధించి  2015 సంవత్సరం వరకు క్రమం తప్పకుండా కంతులు చెల్లిస్తూ వచ్చారు. వారు మృతి చెందినప్పటి నుంచి వారసులు కంతులు కట్టక పోవడంతో ప్రస్తుతం సుమారు రూ. 19 కోట్ల వరకు బకాయి పడ్డట్టు తెలుస్తోంది. ఈ రుణం చెల్లించాలని అనేక దఫాలుగా వారి వారసులైన  కూతుర్లు, కొడుకుకు నోటీసులు పంపినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. దీంతో విసిగి పోయిన బ్యాంకర్లు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని ఇటీవల నోటీసులు పంపించారు. అయితే, సదరు షెడ్యూల్‌ ఆస్తులు వివాదాస్పదంగా ఉన్నాయని సృష్టిస్తే  వేలం పాటలో ఎవ్వరూ పాల్గొనరు. తద్వారా బ్యాంకులకు శఠగోపం పెట్టొచ్చనే ఉద్దేశంతో తమకు అత్యంత సన్నిహితుడు అయిన గుంటూరు శీను తండ్రి మాదాల వెంకటరమణయ్యతో దావా వేయించారని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. 

Advertisement
Advertisement