టెస్లా @1000 డాలర్లు- కొత్త రికార్డ్‌

Tesla inc @1000 dollars- Nasdaq hits new high - Sakshi

అత్యంత విలువైన ఆటో కంపెనీగా టెస్లా

బుధవారం యూఎస్‌ మార్కెట్లు వీక్‌

మూడో రోజూ నాస్‌డాక్‌ సరికొత్త రికార్డ్‌

2020లో జీడీపీ 6.5 శాతం డౌన్‌

నిరుద్యోగ రేటు 9.3 శాతానికి

ఫెడరల్‌ రిజర్వ్‌ తాజా అంచనాలు

కొత్త తరం ఆటోమొబైల్‌, డైవర్సిఫైడ్‌ రంగ కంపెనీ టెస్లా ఇంక్‌ సరికొత్త రికార్డును సాధించింది. బుధవారం యూఎస్‌ మార్కెట్లు వెనకడుగు వేసినప్పటికీ షేరు తొలిసారి 1,000 డాలర్ల మార్క్‌ను తాకింది. షేరు 6.3 శాతం అంటే 59 డాలర్లకుపైగా జంప్‌చేసి 1,000 డాలర్ల ఫీట్‌ను సాధించింది. తద్వారా కంపెనీ మార్కెట్‌ విలువరీత్యా ఆటో రంగ దిగ్గజాలలో టాప్‌ ర్యాంకులో నిలిచింది. టెస్లా మార్కెట్‌ క్యాప్‌ 184 బిలియన్‌ డాలర్లను అధిగమించడంతో 179 బిలియన్‌ డాలర్ల విలువగల జపనీస్‌ ఆటో దిగ్గజం టయోటా ద్వితీయ స్థానానికి పరిమితమైంది. కాగా.. గతేడాది ఒక దశలో టెస్లా షేరు విలువ 760 డాలర్లకు చేరడంతో కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌.. అత్యంత ఖరీదుగా మారిందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం! ఈ ఏడాది ఇప్పటివరకూ టెస్లా ఇంక్‌ షేరు 125 శాతం దూసుకెళ్లడం విశేషం!

ఎలక్ట్రిక్‌ పవర్‌
టెస్లా ఇంక్‌ కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రిక్‌ వాహన(కార్ల) తయారీలో ముందంజలో ఉంది. ఈ బాటలో కోవిడ్‌-19 నేపథ్యంలోనూ ఎలక్ట్రిక్‌ సెమీట్రక్‌ ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధంకావాలంటూ ఎలన్‌ మస్క్‌ తాజాగా సిబ్బందిని కోరడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. గిగా నెవడా ప్లాంటులో బ్యాటరీ, పవర్‌ట్రయిన్‌ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఉద్యోగులకు మస్క్‌ తెలియజేశారు. లాక్‌డవున్‌ తదుపరి కంపెనీ ఇటీవలే ప్లాంట్లను పునఃప్రారంభించింది. వాల్‌మార్ట్‌, పెప్సీ తదితర దిగ్గజాల అవసరాలకు అనుగుణంగా సెమీ ట్రక్‌ను 2017లో కంపెనీ రూపొందించింది. మోడల్‌ 3 సెడాన్‌ కారుకు కనిపిస్తున్న డిమాండ్‌ సైతం టెస్లా షేరుకి బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మే నెలలో చైనాలో మోడల్‌-3 కార్లను 11,095 యూనిట్లు విక్రయించినట్లు తెలుస్తోంది.

డోజోన్స్‌ డౌన్‌
రెండు రోజులపాటు పాలసీ సమీక్షను చేపట్టిన ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చని అంచనా వేసింది. నిరుద్యోగ రేటు 9.3 శాతానికి పెరిగే వీలున్నట్లు పేర్కొంది. అయితే అవసరమైతే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా భవిష్యత్‌లో మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. వడ్డీ రేట్లను యథాతంగా 0-0.25 శాతం స్థాయిలో కొనసాగించేందుకే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బుధవారం డోజోన్స్‌ 282 పాయింట్లు(1 శాతం) క్షీణించి 26,990 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 17 పాయింట్లు(0.55 శాతం) నీరసించి 3,190 వద్ద ముగిసింది. అయితే నాస్‌డాక్‌ 67 పాయింట్లు(0.7 శాతం) పుంజుకుని 10,020 వద్ద స్థిరపడింది. తద్వారా వరుసగా మూడో రోజు సరికొత్త గరిష్టం వద్ద ముగిసింది. ఇందుకు టెక్‌ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ బలపడటం సహకరించింది. సెప్టెంబర్‌కల్లా కోవిడ్‌-19 చికిత్సకు ఔషధాన్ని తీసుకువచ్చే వీలున్నట్లు కంపెనీ ప్రతినిధి పేర్కొనడంతో ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ షేరు 1.3 శాతం లాభపడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top