మీ పేరుతో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోండిలా

Telecom Users Now Check The Aadhaar-Linked Numbers With SMS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇటీవల తెలంగాణలో భారీ సిమ్‌కార్డు స్కాం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. నకిలీ వేలిముద్రలు, ఆధార్‌తో వేలాది సిమ్‌కార్డులను అక్రమంగా యాక్టివేట్‌ చేశాడు ఓ మొబైల్‌ షాపు యజమాని. మన ఆధార్‌ కార్డుతో ఒకే సిమ్‌కార్డు తీసుకున్నామనే అనుకున్నా, వాటిని నకిలీ చేసి వాటి నుంచి ఎన్ని సిమ్‌కార్డులు తీసుకున్నారో ఎవరికి తెలుసు? ఇటీవల తెలంగాణలో వెలుగు చూసిన సంఘటనతో మన వివరాలతో ఎవరు ఏ దారుణాలకు ఒడిగడుతున్నారో? అనే భయం ఇప్పుడు ప్రతిఒక్కరిలో ఉంది. అందుకే ఆ భయం పోవడానికి, మీ పేరుతో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోండి. పలు టెలికం కంపెనీల్లో మన ఆధార్‌ కార్డు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో ఇలా చెక్‌ చేసుకోండి.

యూఐడీఏఐ ఆదేశాల మేరకు, గతంలో ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుడు తన ఆధార్‌ కార్డు మీద ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకునేలా ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇప్పుడు ఆ జాబితాలో  ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ కూడా చేరింది. ఒక్క మెసేజ్‌తో వివరాలను అందిస్తోంది. జియో తన యాప్‌లో ఆ వివరాలను పొందుపరుస్తుంది. అయితే ఐడియా, వొడాఫోన్‌, డొకోమో, టెలీనార్‌, రిలయన్స్‌ కంపెనీలు మాత్రం ఈ సర్వీసులను అందించడం లేదు.

మీఆధార్‌ మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోండి ఇలా..

  • మీరు ఎయిర్‌టెల్‌ వినియోగదారుడు అయితే మీఫోన్‌ నుంచి ADCHK స్పేస్‌ ఆధార్‌కార్డు నెంబర్‌ టైప్‌ చేసి 121కి మెసేజ్‌ చేయాలి. మరుక్షణమే మీ ఆధార్‌ కార్డుతో లింక్‌ అయిన నెంబర్ల జాబితా వస్తుంది. 
  • జియో వినియోగదారుడు అయితే మై జియో యాప్‌, మై అకౌంట్‌లో లింక్ న్యూ అకౌంట్‌ అని ఉంటుంది. అలా కనుక లేకపోతే మీ పేరు మీద ఒక జియో సిమ్‌ ఉన్నట్లే లెక్క.
  • బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్‌ అయితే ALIST స్పేస్‌ ఆధార్‌ నెంబర్‌ టైప్‌ చేసి 53734 అనే నెంబర్‌కు మెసేజ్‌ చేయాలి. రిప్లై మెసేజ్‌లో మీ ఆధార్‌ కార్డుతో లింక్‌ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ నంబర్లు వస్తాయి.
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top