రెరా గడువు మళ్లీ పొడిగింపు!

Telangana Real Estate Regulatory Authority - Sakshi

ఫిబ్రవరి 15 వరకూ నమోదుకు అవకాశం

‘సాక్షి రియల్టీ’తో రెరా సెక్రటరీ విద్యాధర్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా)లో ప్రాజెక్ట్‌లు, ప్రమోటర్లు, ఏజెంట్ల నమోదు గడువును మళ్లీ పొడిగించారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు, జరిమానా రూ.2 లక్షల చెల్లించి ఈ నెల 15వ తేదీ వరకూ నమోదు చేసుకోవచ్చని టీ–రెరా సెక్రటరీ కె. విద్యాధర్‌ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. ఇదే చివరి అవకాశమని.. ఇప్పటికీ రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోతే రెరా చట్టం సెక్షన్‌ 59 ప్రకారం ప్రాజెక్ట్‌ వ్యయంలో గరిష్టంగా 10 శాతం వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు టీ–రెరాలో 1,892 ప్రాజెక్ట్‌ ప్రమోటర్లు, 1,527 ఏజెంట్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. 

గడువు పొడిగింపు ఆరోసారి.. 
టీ–రెరా నమోదు గడువును పొడిగించడం వరుసగా ఇది ఆరోసారి. వాస్తవానికి జనవరి 31తో రిజిస్ట్రేషన్‌ గడువు ముగిసింది. కానీ, ఆశించిన స్థాయిలో ప్రాజెక్ట్‌ ప్రమోటర్లు నమోదు కాకపోవటంతో మళ్లీ గడువు తేదీని పొడిగించారు. గతేడాది ఆగస్టు 31న తెలంగాణ రెరా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. 2017, జనవరి 1 నుంచి 2018, ఆగస్టు 31 మధ్య కాలంలో యూడీఏ, డీటీసీపీ, మున్సిపల్‌ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, టీఎస్‌ఐఐసీల నుంచి అనుమతి పొందిన ప్రతి ప్రాజెక్ట్‌ రెరాలో నమోదు చేసుకోవాలి. 8 యూనిట్లు లేదా 500 చ.మీ.లో ఉండే ప్రతి అపార్ట్‌మెంట్, లే అవుట్‌ రెరాలో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. 

39 మందిపై విచారణ షురూ.. 
కొందరు డెవలపర్లు తప్పుడు సమాచారంతో రెరాలో రిజిస్ట్రేషన్స్‌ చేస్తున్నారని, రెరాలో నమోదు చేసుకోకుండానే ప్రకటనలు, విక్రయాలు జరుపుతున్నట్లు తెలిసిందని విద్యాధర్‌ తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన సుమారు 39 మంది డెవలపర్లకు షోకాజ్‌ నోటీసులు అందించామని, వారం రోజుల్లోగా వీళ్లందరినీ విచారణకు పిలుస్తామని ఆయన తెలిపారు. విచారణకు హాజరుకాకపోయినా లేక సంతృప్తికరంగా వ్యవహరించకపోయినా సరే సెక్షన్‌ 59 ప్రకారం ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం జరిమానా విధిస్తామని తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top