కాఫీ డే ఫౌండర్‌కు ఐటీ శాఖ ఝలక్‌ | Sakshi
Sakshi News home page

కాఫీ డే ఫౌండర్‌కు ఐటీ శాఖ ఝలక్‌

Published Sat, Jan 26 2019 7:26 PM

Tax dept attaches Shares held by VG Siddhartha, Coffee Day in Mindtree - Sakshi

కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త,  కెఫే కాఫీ డే ఫౌండర్‌ వీజీ సిద్ధార్థకు ఆదాయ పన్నుశాఖ భారీ  షాక్‌ ఇచ్చింది. ఐటీ సంస్థ మైండ్‌ ట్రీలో సిద్దార్థకున్న వాటాలను ఐటీ శాఖ ఎటాచ్‌ చేసింది.  ఈ మేరకు  మైండ్‌ ట్రీ శనివారం అందించిన రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది.  సిద్ధార్థతోపాటు, సిద్దార్థ అండ్ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు ఉన్న రూ.665కోట్ల విలువైన వాటాలను ఎటాచ్‌ చేసిందని మైండ్‌ ట్రీ వెల్లడించింది. సిద్ధార్థకు చెందిన 52.7లక్షల షేర్లు,  కాఫీడేకు సంబంధించిన 22.2 లక్షల ఈక్విటీ షేర్ల  విక్రయాలు, లేదా బదలాయింపులను  కూడా నిషేధించిందని పేర్కొంది.  ఐటీ ఆదేశాల ప్రకారం ఈ నిషేధం జనవరి 25నుంచి ఆరునెలల పాటు అమల్లో ఉంటుందని  తెలిపింది. 

మైండ్‌ ట్రీలో ఆయనకున్న 21 శాతం వాటాను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో  బెంగళూరు ఐటీ విభాగం ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. డిసెంబరు 2018 త్రైమాసికానికి సిద్ధార్థ మైండ్‌ ట్రీ లో 3.3 శాతం వాటా  (54.69 లక్షల షేర్లు)ను కలిగి ఉండగా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు 1.74 కోట్ల షేర్లు (10.63 శాతం వాటా) ఉన్నాయి. మరో సంస్థ కాఫీ డే ట్రేడింగ్ లిమిటెడ్ 1.05 కోట్ల షేర్లను (6.45 శాతం) కలిగి ఉంది. సంస్థ మిగిలిన ప్రమోటర్లైన సుబ్రతో బాగ్చి, కృష్ణకుమార్‌ నటరాజన్, ఎన్.ఎస్. పార్థసారథి, రోస్తోవ్‌ రావణన్‌లకు కలిపి  కంపెనీలో 13 శాతా వాటాను కలిగి ఉన్నారు.  

మిడ్‌ సైజ్‌ ఐటీ సంస్థ మైండ్‌ ట్రీలోని తన వాటాలను ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, మరో ప్రయివేటు సంస్థ కెకెఆర్‌కు విక్రయించే క్రమంలో తుది దశ చర్చల్లో ఉన్నట్టు సమాచారం. మరో పదిరోజుల్లో ఈ డీల్‌ను సిద్ధార్థ్‌ పూర్తి చేసుకునేందుకు సిద్ధమవుతుండగా ఐటీ శాఖ  అప్రమత్తమైనట్టు  తెలుస్తోంది. అయితే ఈ పరిణామంపై  అటు మైం‍డ్‌ టీ ఫౌండర్లు , ఇటు వీజీ సిద్ధార్థ ఇంకా స్పందించాల్సి ఉంది.

కాగా 2017లోనే కాఫీడే సంస్థల యజమాని వీజీ సిద్ధార్థ నివాసం, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఈ  సందర్బంగా  రూ.650 కోట్ల విలువైన అప్రకటిత ఆస్తులను గుర్తించినట్టు తెలిపింది. అలాగే దీనిపై చర్యలు తీసుకుంటామని కూడా ఐటీ శాఖ  ప్రకటించింది. అయితే  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,  మహారాష్ట్ర మాజీ గవర్నరు, మాజీ కేంద్ర మంత్రి ఎస్‌ఎం కృష్ణ అల్లుడే వీజీ సిద్ధార్థ.

Advertisement

తప్పక చదవండి

Advertisement