వాటాలు విక్రయించాలని మిస్త్రీని బలవంతపెట్టొద్దు

Tata Sons can't force Cyrus Mistry out, yet: NCLAT - Sakshi

టాటా సన్స్‌కు ఎన్‌సీఎల్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశం

ప్రైవేటు కంపెనీగా మార్పుపై సెప్టెంబర్‌ 24న విచారణ

న్యూఢిల్లీ: టాటా గ్రూపు కంపెనీల మాతృ సంస్థ ‘టాటాసన్స్‌’లో మిస్త్రీ కుటుంబానికి ఉన్న వాటాలను విక్రయించాలంటూ బలవంతం చేయవద్దని జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) టాటాలను ఆదేశించింది. అలాగే, టాటాసన్స్‌ను ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా మార్చుతూ తీసుకున్న నిర్ణయానికి అనుమతిని హోల్డ్‌లో ఉంచింది. ఈ విషయమై మిస్త్రీ పిటిషన్‌ను అనుమతించిన అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ విచారణను సెప్టెంబర్‌ 24కు వాయిదా వేసింది.

సైరస్‌ మిస్త్రీని టాటాసన్స్‌ చైర్మన్‌గా తప్పించిన తర్వాత, పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీని కాస్తా ప్రైవేటు కంపెనీగా మార్చేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి వాటాదారులు కూడా ఆమోదం తెలిపారు. అయితే, మిస్త్రీ పిటిషన్‌ నేపథ్యంలో టాటాసన్స్‌ను ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా మార్చడంపై అనుమతిని నిలిపివేస్తూ ట్రిబ్యునల్‌ శుక్రవారం మధ్యంతర ఆదేశాలు వెలువరించింది. టాటాసన్స్‌లో 18.4% వాటాతో మిస్త్రీ కుటుంబం మైనారిటీ వాటాదారుగా ఉంది.

టాటాసన్స్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తప్పించే అధికారం కంపెనీ బోర్డుకు ఉందంటూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) ముంబై బెంచ్‌ ఇటీవలే ఆదేశాలు వెలవరించగా, దీన్ని మిస్త్రీ   కంపెనీలు అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ముందు సవాల్‌ చేశాయి. అలాగే, టాటాసన్స్‌ను ప్రైవేటు కంపెనీగా మార్చుతూ, వాటాదారులు తమ స్వేచ్ఛ ప్రకారం తమ వాటాలను విక్రయించుకోకుండా నిరోధించడం, ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌లోని ఆర్టికల్‌ 75 కింద వాటాదారులు తమ వాటాలను విక్రయించేలా బలవంత పెట్టే అధికారం బోర్డుకు కల్పించడాన్ని కూడా సవాల్‌ చేశాయి.

‘‘వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న మీదట అప్పీల్‌ పెండింగ్‌లో ఉంచడం జరిగింది. అప్పీలుదారు (మిస్త్రీ) తన వాటాలను విక్రయించేందుకు బలవంతం చేస్తే అప్పీల్‌ మెరిట్స్‌పై ప్రభావం చూపిస్తుంది. వారు కంపెనీ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ అప్పీల్‌ పెండింగ్‌లో ఉన్న కాలంలో ఆర్టికల్‌ 75 కింద మైనారిటీ వాటాదారుల షేర్లను బదిలీ చేసే విషయంలో ఎలాంటి నిర్ణయంవద్దని ప్రతివాదుల(టాటాలు)ను ఆదేశిస్తున్నాం’’ అని చైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఎస్‌జే ముకోపాధ్యాయ అధ్యక్షతన గల ఇద్దరు సభ్యుల అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ బెంచ్‌ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. స్పందన తెలియజేసేందుకు టాటాలకు పది రోజుల గడువు ఇచ్చింది.  

ప్రైవేటు కంపెనీగానే ఉంది...
టాటాసన్స్‌.. నిజానికి ప్రైవేటు సంస్థ మాదిరిగానే ఉందని, కాకపోతే కంపెనీ పరిమాణం, పాత  న్యాయ నిబంధన మేరకు పబ్లిక్‌ లిమిటెడ్‌గా పరిగణించడం జరిగిందని టాటాసన్స్‌ ఈ సందర్భంగా వాదించింది. పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ హోదా అన్నది వాటాదారులు తమ వాటాలను బదిలీ చేసే విషయంలో ఎంతో సౌకర్యాన్ని కల్పిస్తోందని, ఈ చట్టబద్ధమైన హోదా మార్పిడికి గాను టాటా సన్స్‌ వాటాదారులను అనుమతిస్తూ మార్పులు చేసినట్టు తెలిపింది.

టాటాలు ఆదరాబాదరగా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్, ముంబై కార్యాలయాన్ని సంప్రదించగా, టాటాసన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌గా మారుస్తూ సర్టిఫికెట్‌ను వెంటనే జారీ చేసినట్టు వాదనల సందర్భంగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు నివేదించాయి. పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలో వాటాదారులు తమ షేర్లను ఎవరికైనా విక్రయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీల్లో వాటాదారులు ఎవరైనా తమ వాటాలను బయటి వ్యక్తులకు విక్రయించేందుకు అనుమతి ఉండదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top