స్వయం ఉపాధికీ... ఖర్చులవేగా?

స్వయం ఉపాధికీ... ఖర్చులవేగా?


ఇతరుల్లాగే ఖర్చులున్నపుడు ప్రణాళిక తప్పనిసరి

రిజర్వు నిధులతో పాటు జీవిత. ఆరోగ్య బీమా ఉండాలి

స్థిరమైన ఆదాయం ఉన్నట్టుగానే పెట్టుబడి వ్యూహాలు

అందుకోసం సిస్టమాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌ ఉత్తమం

రిటైర్మెంట్‌ నిధికీ ప్లానింగ్‌ ఉండాలంటున్న నిపుణులు  




స్థిరమైన ఆదాయం లేనివారికి ఆర్థిక లక్ష్యాలను చేరుకోవటమనేది చాలా క్లిష్టమైన సవాలు. మన దేశంలో కోటిన్నర మంది స్వయం ఉపాధిని నమ్ముకున్న వారే. వీరికి స్థిరమైన ఆదాయం ఉండదు. ఒక నెల ఎక్కువగా ఉండొచ్చు. మరో నెలలో తగ్గిపోవచ్చు. కానీ, నెలసరి ఖర్చులు అలా ఉండవు కదా!!. అందుకే ఈ తరహా వ్యక్తులు అనుసరించాల్సిన ఆర్థిక ప్రణాళిక గురించి నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఆ వివరాలివీ...



పన్నులకు ప్రణాళిక ఉందా?

స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారు జీఎస్‌టీ సహా రవాణా, తరుగుదల వ్యయాలపై పన్ను మినహాయింపుల కోసం క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఆదాయం రూ.50 లక్షల్లోపు ఉంటే సెక్షన్‌ 44ఏడీఏ కింద మొత్తం ఆదాయంలో 50 శాతం మేర ఊహాత్మక వ్యయాల కింద చూపించుకోవచ్చు. అందుకే స్వయం ఉపాధిలో ఉన్నవారు తమ ఆదాయం, వ్యయాల వివరాలను ఓ రికార్డు నిర్వహించడం వల్ల పన్ను రిటర్నుల సమయంలో ఏదీ మర్చిపోయేందుకు అవకాశం ఉంది.



పెట్టుబడికి ఎస్‌టీపీ బెటర్‌...

వేతన జీవులకు సిప్‌ చక్కని సాధనం. నెలనెలా క్రమం తప్పకుండా ఇంత మొత్తం పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. కానీ, అస్థిర ఆదాయంలో ఉన్న వారికి సిప్‌ సాధ్యం కాకపోవచ్చు. అందుకే వీరికి సిస్టమాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌ (ఎస్‌టీపీ) అనువైనది. అధిక ఆదాయం వచ్చినప్పుడు లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి అక్కడి నుంచి నెలనెలా కొంత మొత్తాన్ని డెట్, బ్యాలన్స్‌డ్, ఈక్విటీ ఫండ్స్‌లోకి ఎస్‌టీపీ చేసుకోవచ్చు. సుదర్శన్‌ మార్కెటింగ్‌లో ఉన్నాడు. ప్రతీ నెలా రూ.10,000 మొత్తానికి సిప్‌ ఎంచుకున్నాడు. కానీ, ఏడాదిలోపే ఆ సిప్‌ కాస్తా రూ.5,000కు తగ్గించాడు. పరిస్థితి బాగులేకపోతే ఈ మొత్తాన్ని కూడా ఎత్తేసే అవకాశం లేకపోలేదు. అందుకే ఎస్‌టీపీ అన్నది స్వయం ఉపాధిలో ఉన్న వారికి చక్కని సాధనం.



టర్మ్‌ పాలసీ తప్పనిసరి!!

తమపై ఆధారపడిన వారికి ఇచ్చే అపూర్వ కానుక జీవిత బీమా. సంప్రదాయ పాలసీల్లో రూ.లక్ష కవరేజీకే రూ.6,000 వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కానీ, ఇంతే మొత్తానికి రూ.40–50 లక్షల టర్మ్‌ పాలసీ తీసుకోవచ్చు. బీమా కవరేజీ కూడా తగినంతగా ఉండాలి. తాను లేకపోతే, తన ఆర్జన అవసరాలు కుటుంబానికి ఇంకా ఎన్నేళ్లు అవసరమో అంత మేర టర్మ్‌  కవరేజీ ఉండాలన్నది నిపుణుల సూచించేది. కనీసం పదేళ్ల వార్షిక సంపాదన మేరకైనా టర్మ్‌ కవరేజీ ఉండాలి.



రిటైర్మెంట్‌ కోసం నిధి...

నిరుద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారు ఏ పింఛను పథకంలోనూ కవర్‌ కారు. విశ్రాంత జీవనంలో పోషణావసరాలకు, వైద్య ఇతర అవసరాలకు గాను తగిన నిధిని సమకూర్చుకునేందుకు ముందునుంచే ప్రణాళిక వేసుకోవాలి. పీపీఎఫ్, ఎన్‌పీఎస్‌ తరహా పథకాలను ఇందుకు పరిశీలించొచ్చు. నిధులను వెనక్కి తీసుకునేందుకు అవకాశం లేని పథకాలతోనే మలి జీవితానికి కావాల్సిన నిధి సాధ్యమవుతుంది. ఎన్‌పీఎస్‌ ఈ తరహాలోనే పనిచేస్తుంది. పైగా ఇందులో వ్యయాలు తక్కువ. 60 ఏళ్లకు కాల వ్యవధి తీరుతుంది. ఈక్విటీలకు గరిష్టంగా 50 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. మెచ్యూరిటీ అనంతరం వచ్చే ఫండ్‌లో 40 శాతాన్ని కచ్చితంగా యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. దాంతో ఆ మొత్తంపై నెలనెలా పెన్షన్‌ అందుతుంది. దీనిపై సెక్షన్‌ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000కు పన్ను ప్రయోజనం కూడా ఉంది. సెక్షన్‌ 80సీ కింద రూ.1.50 లక్షల పన్ను ప్రయోజనానికి ఇది అదనం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top