సామాజిక సేవకు సునీల్‌ మిట్టల్‌ 7,000 కోట్లు | Sakshi
Sakshi News home page

సామాజిక సేవకు సునీల్‌ మిట్టల్‌ 7,000 కోట్లు

Published Thu, Nov 23 2017 11:51 PM

Sunil Mittal to pay Rs 7,000 crore for social service - Sakshi - Sakshi - Sakshi

న్యూఢిల్లీ: మరో సంపన్న కుటుంబం సామాజిక సేవా కార్యక్రమాలకు తమ వంతు చేయూతనందించడానికి ముందుకు వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్‌ కుటుంబం తమ సంపదలో 10 శాతాన్ని దాతృత్వానికి ఇస్తామని ప్రతిన బూనింది. ఈ మొత్తం సుమారు రూ.7,000 కోట్లు. భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీలో మిట్టల్‌ కుటుంబ సభ్యులకు ఉన్న మూడు శాతం వాటా కూడా విరాళంలో భాగమే.

ఈ మొత్తాన్ని తమ కుటుంబం తరఫున ఏర్పాటు చేసిన భారతీ ఫౌండేషన్‌ కార్యక్రమాల కోసం ఇవ్వనున్నట్టు సునీల్‌ భారతీ మిట్టల్‌ తెలిపారు. తన సోదరులు రాకేశ్, రాజన్‌తో కలసి ఆయన ఢిల్లీలో గురువారం మీడియా సమావేశం నిర్వహించి ఈ వివరాలు ప్రకటించారు. ‘‘తొలితరం ప్రారిశ్రామిక వేత్తలుగా ప్రపంచ స్థాయి వ్యాపారాల స్థాపనకు ఈ దేశం మాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని భావిస్తున్నాం. దేశాభివృద్ధిలో పాలు పంచుకున్నందుకు ఎంతో గర్విస్తున్నాం. మా సంపదను తిరిగి సమాజానికి ఇవ్వడం ద్వారా ఇతరులకూ అవకాశాలు కల్పించాలని ఎంతగానో కోరుకుంటున్నాం’’ అని మిట్టల్‌ తెలిపారు.
 

పేదలకు ఉచితంగా టెక్నాలజీ విద్య
ప్రతిభావంతులైన నిరుపేదలకు ఉచితంగా విద్యనందించేందుకు సత్యభారతి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని మిట్టల్‌ చెప్పారు. ఉత్తర భారతంలో ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీ 2021 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. ఇందుకోసం పంజాబ్, హరియాణా సహా పలు రాష్ట్రాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. విరాళంలో అధిక భాగం యూనివర్సిటీ ప్రాజెక్టుపైనే వెచ్చించనున్నామని, కొంత మేర ఇప్పటికే నిర్వహిస్తున్న సత్యభారతి స్కూళ్ల విస్తరణకు వినియోగిస్తామని చెప్పారు.

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీలపై ఈ యూనివర్సిటీ ఫోకస్‌ ఉంటుందన్నారు. అలాగే, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీలనూ ఆఫర్‌ చేయనున్నట్టు వివరించారు. నందన్‌ నిలేకని, ఆయన సతీమణి రోహిణి తమ సంపదలో సగం మేర దాతృత్వానికి ఇచ్చేందుకు ముందుకొచ్చిన కొన్ని రోజులకే మిట్టల్‌ కుటుంబం కూడా ఇదే బాటలో పయనించడం గమనార్హం. దాతృత్వానికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చే ధోరణి మన దేశంలో క్రమంగా విస్తరిస్తున్నట్టు దీన్ని చూస్తే తెలుస్తోంది. తొలుత ఈ దిశగా అడుగు వేసి మార్గదర్శకులుగా నిలిచిన వారిలో విప్రో చైర్మన్‌ ప్రేమ్‌జీ ఒకరు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement