వెండి.. బంగారాన్ని మించనుందా?

Silver may outperform than Gold - Sakshi

పసిడి, వెండి ధరల నిష్పత్తి సంకేతం

సెప్టెంబర్‌లో 79- ప్రస్తుతం 100కు

ఈ ఏడాది మార్చిలో 124కు

ఒత్తిడిని చూపుతున్న గోల్డ్‌, కాపర్‌ రేషియో

బంగారం, వెండి ధరల మధ్య నిష్పత్తి ప్రకారం సమీప భవిష్యత్‌లో వెండి కొంతమేర బంగారాన్ని మించనున్న సంకేతాలు ఇస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. లాక్‌డవున్‌వల్ల సరఫరా తగ్గడం, తక్కువ ధర పలుకుతుండటం వంటి అంశాలు వెండికి సానుకూలమని చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో 79గా ఉన్న పసిడి, వెండి నిష్పత్తి ఈ ఏడాది మార్చిలో 124ను తాకింది. ఇది చరితత్రాత్మక గరిష్టంకాగా.. వెండి కూడా బలమైన కమోడిటీయే కావడంతో గత కొద్ది రోజులుగా ఈ నిష్పత్తి 100కు చేరింది. గత రెండు దశాబ్దాలలో 100 మార్క్‌ను రెండుసార్లు మాత్రమే చేరుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ రేషియో ఎలాగంటే.. ఔన్స్‌ బంగారంతో ఎన్ని ఔన్స్‌ల వెండి కొనగలమనే అంశాన్ని తెలియజేస్తుంది. వెరసి ఈ రెండు విలువైన లోహాల అంతర్గత బలిమి(రెలిటివ్‌ స్ట్రెంగ్త్‌)ను ఈ రేషియో తెలియజేస్తుంది. ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో పసిడి ఔన్స్ 1734 డాలర్లకు చేరగా.. ఔన్స్‌ వెండి 17.74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

నిష్పత్తి ఆధారంగా
బంగారం, వెండి నిష్పత్తి ఆధారంగా ట్రేడర్లు సాధారణంగా ఈ విలువైన లోహాలలో పొజిషన్లు తీసుకుంటుంటారని విశ్లేషకులు చెబుతున్నారు. కొంతమంది ఈ రేషియోలో సైతం ట్రేడింగ్‌ చేస్తుంటారని తెలియజేశారు. ఈ నిష్పత్తి బలపడితే.. ఇందుకు అనుగుణంగా ఓవైపు బంగారాన్ని కొంటూ మరోపక్క వెండిని విక్రయిస్తుంటారని వివరించారు. కాగా.. బంగారం, వెండి చరిత్రాత్మక సగటు నిష్పత్తి 60కాగా.. ప్రస్తుతం 100కు చేరినట్లు కేడియా అడ్వయిజరీ డైరెక్టర్‌ అజయ్‌ కేడియా పేర్కొన్నారు. ప్రస్తుత నిష్పత్తి చరిత్రాత్మక సగటును అందుకోవాలంటే బంగారం ధరలు దిగిరావడం లేదా వెండి భారీగా పుంజుకోవడం జరగవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. లేదంటే వెండిని మించి బంగారం ధరలు పతనంకావలసి ఉన్నట్లు వివరించారు. 

వెండి జోరు
పారిశ్రామికంగా అధిక వినియోగం కలిగిన వెండి ధరలు ఈ ఏడాది పుంజుకోవచ్చని భావిస్తున్నట్లు కేడియా చెప్పారు. ఈ లోహంలో పెట్టుబడులు పెరగడం కూడా ఇందుకు సహకరించవచ్చని అంచనా వేస్తున్నారు. వీటితోపాటు వెండి వెలికితీత(మైనింగ్‌), ఉత్పత్తి తదితర సమస్యలతో సరఫరాలు తగ్గడం కూడా ధరలు పెరిగేందుకు కారణంకావచ్చని అభిప్రాయపడ్డారు. ‘ఇటీవల పలు దేశాలు లాక్‌డవున్‌ ఎత్తివేస్తున్న కారణంగా పారిశ్రామికోత్పత్తి పుంజుకోనుంది. దీంతో వెండికి డిమాండ్‌ పెరగనుంది. వెరసి సాంకేతికంగా చూస్తే.. బంగారం, వెండి నిష్పత్తి 94కు దిగిరావచ్చని భావిస్తున్నాం. ఈ స్థాయిలో నిష్పత్తి కొనసాగకుంటే.. మరింత బలహీనపడవచ్చు. అంటే భవిష్యత్‌లో బంగారాన్ని మించి వెండి లాభపడే వీలున్నద’ని కేడియా ఊహిస్తున్నారు.

వెండి- రాగి 
ఆర్థిక వ్యవస్థకు బారోమీటర్‌గా భావించే గోల్డ్‌, కాపర్‌(రాగి) నిష్పత్తిని సైతం కమోడిటీ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. పసిడి, రాగి నిష్పత్తిని ఆర్థిక స్ట్రెస్‌ రేషియోగా పేర్కొంటారు. అంటే ఈ నిష్పత్తి అధికంగా ఉంటే ఆర్థిక వ్యవస్థపై అధిక ఒత్తిడి ఉన్నట్లుగా భావిస్తుంటారు. పసిడి ధరలు అధికంగా ఉండి, రాగి ధరలు బలహీనపడుతూ ఉంటే ఈ రేషియో పెరుగుతుంది. ప్రస్తుతం గోల్డ్‌- కాపర్‌ రేషియో 727 సమీపంలో ఉంది. గత రెండు నెలల్లో పెరుగుతూ వచ్చింది. 2019 ఏప్రిల్‌లో 429గా ఉన్న ఈ నిష్పత్తి ఈ ఏడాది ఏప్రిల్‌లో 756ను తాకింది. దీంతో మరికొంతకాలం ఆర్థిక వ్యవస్థల్లో ఒత్తిడి కొనసాగవచ్చని, ఇది పసిడి ధరలకు దన్నునిస్తుందని చెబుతున్నారు. కాగా.. పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్‌ లభించే కాపర్‌, సిల్వర్‌ రేషియో.. ప్రస్తుతం వెండికి సానుకూలంగా కనిపిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రేషియో ఏప్రిల్‌లో 5గా నమోదుకాగా.. ప్రస్తుతం 7.3కు ఎగసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top