బడ్జెట్‌ నష్టాలు భర్తీ

Sensx: Closing At 40,789 With A Gain Of 917 Points - Sakshi

కరోనా వైరస్‌ ప్రభావం నుంచి కోలుకుంటున్న ప్రపంచ మార్కెట్లు

ఏడాది కనిష్టానికి ముడిచమురు ధరలు

బ్లూచిప్‌ షేర్లలో వేల్యూ బయింగ్, షార్ట్‌ కవరింగ్‌

డివిడెండ్‌ షేర్లలో జోరుగా కొనుగోళ్లు

గణాంకాలు, ఆర్థిక ఫలితాల ప్రోత్సాహం

40 వేల పాయింట్లపైకి సెన్సెక్స్‌

917 పాయింట్ల లాభంతో 40,789 వద్ద ముగింపు

12,000 పాయింట్ల చేరువలో నిఫ్టీ

272 పాయింట్లు ఎగసి 11,980 పాయింట్లకు చేరిక

కరోనా వైరస్‌ మరింత ముదరకుండా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయన్న భరోసాతో ప్రపంచ మార్కెట్లు కోలుకోవడం, ముడిచమురు ధరలు 13 నెలల కనిష్టానికి పడిపోవడంతో స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం భారీగా లాభపడింది. సెన్సెక్స్‌ 40,000 పాయింట్లపైకి ఎగియగా, నిఫ్టీ 12,000 పాయింట్లకు 20 పాయింట్ల  దూరంలో నిలిచింది. వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం, బ్లూచిప్‌ షేర్లలో వేల్యూ, షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు చోటు చేసుకోవడం సానుకూల ప్రభావం చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 917 పాయింట్లు ఎగసి 40,789 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 272 పాయింట్లు పెరిగి 11,980 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 2.3 శాతం, నిఫ్టీ 2.32 శాతం చొప్పున పెరిగాయి. గత నాలుగు  నెలల్లో సెన్సెక్స్, నిఫ్టీ ఈ రేంజ్‌లో లాభపడటం ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి.

బడ్జెట్‌ నిరాశ నుంచి బయటకు... 
వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఉద్దేశించిన కేంద్ర బడ్జెట్‌ అంచనాలను అందుకోలేకపోవడంతో గత శనివారం జరిగిన  ప్రత్యేక ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమైన విషయం తెలిసిందే. బడ్జెట్‌ రోజున సెన్సెక్స్‌ 988 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్ల మేర నష్టపోయాయి. మొత్తం మీద గత వారంలో ఈ సూచీలు 4.5 శాతం మేర నష్టపోయాయి. ఈ నష్టాలన్నింటినీ ఈ సూచీలు మంగళవారం భర్తీ చేసుకున్నాయని, మళ్లీ బడ్జెట్‌ ముందటి స్థాయికి చేరుకున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. బడ్జెట్‌ నిరాశ నుంచి ఇన్వెస్టర్లు తేరుకున్నారని, మార్కెట్‌ను నడిపించే కంపెనీల క్యూ3 ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి సారిస్తున్నారని వారంటున్నారు.

మరిన్ని విశేషాలు.... 
►ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో టైటాన్‌ కంపెనీ షేరు 8 శాతం లాభంతో రూ.1,276 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
►మొత్తం 30 సెన్సెక్స్‌ షేర్లలో రెండు షేర్లు–బజాజ్‌ ఆటో, హిందుస్తాన్‌ యూనిలివర్‌ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు లాభాల్లో ముగిశాయి.  
►దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. వీటిలో సగం షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఆఫిల్‌ ఇండియా, ఐఆర్‌సీటీసీ, ఇండి యామార్ట్‌ ఇంటర్‌మెష్, గోద్రేజ్‌ ప్రాపర్టీస్, హనీవెల్‌ ఆటోమేషన్,  ఇన్ఫోఎడ్జ్‌ ఇండియా, ఏషియన్‌ పెయింట్స్, బజాజ్‌ ఫైనా న్స్, బాటా ఇండియా, బెర్జర్‌ పెయింట్స్, డాబర్‌ ఇండియా, హెచ్‌యూఎల్, పీవీఆర్, రిలాక్సో ఫుట్‌వేర్, శ్రీ సిమెంట్, ఎస్‌ఆర్‌ఎఫ్‌  తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

రెండు రోజుల్లో రూ.3.57 లక్షల కోట్లు పెరిగిన సంపద
స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల కారణంగా 2 రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.3.57 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ విలువ రూ.3,57,044 కోట్లు పెరిగి రూ.156.62 లక్షల కోట్లకు చేరింది. ఒక్క మంగళవారం రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.2.79 లక్షల కోట్లు ఎగబాకింది.

మార్కెట్‌ జోరు ఎందుకంటే...
కరోనా నుంచి కోలుకుంటున్న మార్కెట్లు... 
కరోనా వైరస్‌ కట్టడికి గట్టి ప్రయత్నాలే జరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు కోలుకున్నాయి. మరోవైపు మందగమనాన్ని తట్టుకోవడానికి చైనా కేంద్ర బ్యాంక్‌ భారీగా నిధులను(17,300 కోట్ల డాలర్లు) విడుదల చేయాలని నిర్ణయించడం కూడా ప్రపం చ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించింది. సోమవారం 7% పతనమైన షాంఘై సూచీ మంగళవారం 1.3 % పుంజుకుంది. జపాన్‌ నికాయ్, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్, దక్షిణ కొరియా కోస్పి సూచీలు 0.5%–1.8 శాతం మేర లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. ఇక డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ కూడా 300 పాయింట్ల మేర ర్యాలీ జరిపింది.  
దిగి వస్తున్న చమురు ధరలు...  
కరోనా వైరస్‌ భయాలతో వృద్ధి మందగిస్తుందని, ఫలితంగా చమురుకు డిమాండ్‌ పడిపోతుందనే ఆందోళనతో ముడి చమురు ధరలు క్షీణిస్తున్నాయి. జనవరి గరిష్ట స్థాయి నుంచి చూస్తే, బ్రెంట్‌ ముడిచమురు ధర దాదాపు 10 డాలర్లు పతనమైంది. చమురు ధరలు 20% పైగా తగ్గాయి. మూడొంతులకు పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న మన దేశానికి చమురు ధరలు తగ్గడం చాలా మేలు చేస్తుంది.  
డివిడెండ్‌ షేర్ల జోరు... 
ఏప్రిల్‌ 1 తర్వాత డివిడెండ్‌ ఇస్తే, కంపెనీ ప్రమోటర్లు దాదాపు 40% డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ) చెల్లించాల్సి వస్తుందని అంచనా. ఈ భారాన్ని తప్పించుకునేందుకు పలు కంపెనీలు ఈ ఏడాది మార్చిలోపే డివిడెండ్‌ను ఇస్తాయనే అంచనాలతో డివిడెండ్‌ చెల్లించే షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి.  
బడ్జెట్‌ బాగా లేకపోయినా...  
బడ్జెట్‌ అంచనాలకు అనుగుణంగా లేకపోయినా, మరీ అధ్వానంగా అయితే లేదని, దీర్ఘకాలంలో వృద్ధికి తోడ్పడే విధంగానే ఉందని ఇన్వెస్టర్లు మెల్లగా గ్రహిస్తున్నారని నిపుణులంటున్నారు. కార్పొరేట్‌ బాండ్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పరిమితిని 9 శాతం నుంచి 15 శాతానికి పెంచడం, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ భారాన్ని కంపెనీలపై తొలగించడం తదితర కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు భారత్‌ మరింత ఆకర్షణీయంగా అవతరించిందని వారంటున్నారు. అందుకే కొనుగోళ్లు జోరుగా జరిగాయని వారంటున్నారు.  
షార్ట్‌ కవరింగ్, వేల్యూ బయింగ్‌ కొనుగోళ్లు 
శనివారం నాటి భారీ పతనం కారణంగా పలు బ్లూచిప్‌ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభ్యమవుతుండటంతో వేల్యూ బయింగ్‌ చోటుచేసుకుంది. మరోవైపు షార్ట్‌ పొజిషన్లను కవర్‌ చేసుకునేందుకు ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడం కూడా కలసివచ్చింది.  
ఎనిమిదేళ్ల గరిష్టానికి తయారీ రంగ పీఎమ్‌ఐ 
ఈ ఏడాది జనవరి నెలలో తయారీ రంగ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎమ్‌ఐ) ఎనిమిదేళ్ల గరిష్టానికి ఎగసింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందనడానికి ఇదే నిదర్శనమని భావించి ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారు.  
పుంజుకున్న రూపాయి... 
డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరిగింది. 11 పైసలు పుంజుకొని 71.27కు చేరింది. 
గణాంకాల, ఫలితాల ప్రోత్సాహం... 
జనవరి వాహన విక్రయ గణాంకాలు ఒకింత ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. అంతేకాకుండా కంపెనీల క్యూ3 ఫలితాలు మరీ నిరాశమయంగా కాకుండా ఒకింత మెరుగ్గానే ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top