సెన్సెక్స్‌ 37,950పైన స్థిరపడితేనే...

Sensex slumps over 400 points despite RBI rate cut - Sakshi

మార్కెట్‌ పంచాంగం

కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కారణంగా గత నెల మూడోవారంలో జరిగిన ర్యాలీలో వచ్చిన లాభాల్ని పట్టుమని పదిరోజులు కూడా మార్కెట్‌ నిలుపుకోలేకపోయింది. పన్ను తగ్గింపు ప్రయోజనం లేకుండా పెరిగిన షేర్లు తగ్గడం సహజమేగానీ, ఆ ప్రయోజనం పొందే షేర్లు సైతం గతవారం చివర్లో అమ్మకాల ఒత్తిడికి లోనుకావడం ఆశ్చర్యం కల్గించేదే. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ షేర్లను మొండి బకాయిలు, జీడీపీ బలహీన వృద్ధి అంచనాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు సైతం విక్రయిస్తున్నారు. ఈ రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగితే...వీటికే సూచీల్లో అధిక వెయిటేజీ వున్నందున, మార్కెట్‌ మరింత దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం వుంటుంది.

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
అక్టోబర్‌ 4తో ముగిసిన నాలుగురోజుల వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,923 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో 37,633 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 1150 పాయింట్ల భారీ నష్టంతో 37,673 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం వేగంగా 37,950 పాయింట్ల తొలి అవరోధాన్ని అధిగమించి, స్థిరపడితేనే డౌన్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడుతుంది. అధిక ట్రేడింగ్‌ పరిమాణంతో ఈ స్థాయిని దాటితే 38,300–38,400 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ శ్రేణిని ఛేదిస్తే క్రమేపీ 38,850 పాయింట్ల వద్దకు చేరే అవకాశం వుంటుంది.  ఈ వారం సెన్సెక్స్‌ తొలి అవరోధంపైన స్థిరపడలేకపోయినా, బలహీనంగా మొదలైనా 37,540 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 37,305 పాయింట్ల స్థాయికి, ఈ లోపున 37,000 పాయింట్ల వద్దకు
పతనం కొనసాగవచ్చు.  

నిఫ్టీ తొలి నిరోధం 11,260
గతవారం ప్ర«థమార్థంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,554 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ పెరిగిన తర్వాత ... చివరిరోజున 11,158 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 337 పాయింట్ల నష్టంతో 11,175 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీకి తొలుత 11,260 పాయింట్ల సమీపంలో గట్టి నిరోధం ఎదురవుతున్నది. ఈ స్థాయిపైన స్థిరపడితేనే మార్కెట్‌ క్షీణతకు అడ్డుకట్టపడుతుంది. అటుపైన 11,370–11,400 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 11,500 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. నిఫ్టీ ఈ వారం తొలి అవరోధాన్ని అధిగమించలేకపోతే 11,110 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 11,060 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ లోపున 10,950 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.   

– పి. సత్యప్రసాద్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top