ఏడో రోజు లాభాలు : రికార్డు ముగింపు

Sensex rises for 7th day in a row, closes at record high - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో పటిష్టంగా ముగిసాయి.  సోమవారం ఆరంభంలోనే కీలక  సూచీలు రెండూ  రికార్డు స్థాయిలను నమోదు చేసాయి. అనంతరం ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు దిగడంతో  సెన్సెక్స్‌, నిఫ్టీ అత్యధిక స్థాయిల నుంచి వెనక్కి తగ్గాయి.  అయితే  మిడ్‌ సెషన్‌లో కాస్త వెనుకంజవేసినప్పటికీ చివరి గంటలో పుంజుకుని వరుసగా ఏడవ రోజు కూడా స్థిరంగా ముగిసాయి.  సెన్సెక్స్‌ 137  పాయింట్లు ఎగిసి 40302 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు  లాభపడి 11941 వద్ద ముగిసాయి.  

అమెరికాలో ఉపాధి మార్కెట్‌ పుంజుకోవడం, చైనాలో తయారీ రంగ వృద్ధి అంచనాలను మించడం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే అమెరికా చైనా ట్రేడ్‌వార్‌ వివాదం ఒక కొలిక్కి రానుందన్న అంచనాలు కూడా బలాన్నిచ్చాయి. దీనికితోడు  విజిల్‌ బ్లోయర్‌ ఆరోపణలపై  ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు  లేవంటూ ఇన్ఫోసిస్‌ ఇచ్చిన వివరణ ఇన్ఫీ షేర్లలో కొనుగోళ్లకు ఊతమిచ్చింది.  దాదాపు అన్ని రంగాలూ లాభపడగా మెటల్‌, నిఫ్టీ బ్యాంక్‌, రియల్టీ బాగా పుంజుకున్నాయి.  ఆటో, మీడియా రంగ షేర్లు నష‍్టపోయాయి. భారతి ఇన్‌ఫ్రాటెల్‌, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, కోల్‌ ఇండియా,  ఇన్ఫోసిస్‌  టాప్‌ గెయినర్స్‌గా నిలవగా,  జీ, ఐవోసీ, మారుతి సుజుకి, హీరో మోటో, ఇండస్‌ ఇండ్‌బ్యాంకు టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top