సెన్సెక్స్‌ 3,935 పాయింట్లు డౌన్‌

Sensex plunges 3935 points in biggest intraday fall as India lockdown - Sakshi

కొనసాగుతున్న కరోనా కల్లోలం

భారత్‌లో పెరుగుతున్న కేసులు 

లాక్‌డౌన్‌ ప్రకటించిన పలు రాష్ట్రాలు

ఉత్పత్తి ఆపేస్తున్న కంపెనీలు 

ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందనే భయాందోళనలు 

వెల్లువెత్తిన అమ్మకాలు

కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనం 

76 దిగువకు రూపాయి పతనం

ప్రపంచ మార్కెట్లదీ పతన బాటే 

3,935 పాయింట్ల నష్టంతో 25,981 వద్ద ముగిసిన సెన్సెక్స్‌ 

1,135 పాయింట్లు పతనమై 7,610కు నిఫ్టీ 

రెండు సూచీలకు అత్యధిక పాయింట్ల నష్టం ఇదే

కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ కల్లోలం కొనసాగుతుండటంతో స్టాక్‌ మార్కెట్‌ నష్టాలు కూడా కొనసాగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ వైరస్‌ కట్టడి కోసం పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీంతో ఆర్థిక కార్యకలాపాలు మరింతగా కుంటుపడతాయనే భయాందోళనతో ఇన్వెస్టర్లు సోమవారం ఎడాపెడా అమ్మకాలకు పాల్పడ్డారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ జీవిత కాల కనిష్ట స్థాయి, 76 మార్క్‌ను దాటిపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, ప్రపంచ మార్కెట్ల పతనం తీవ్రమైన ప్రభావమే చూపించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన మద్దతు స్థాయిలన్నింటినీ కోల్పోవడం ఇన్వెస్టర్ల సెంట్‌మెంట్‌ను దెబ్బకొట్టింది. 

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 26,000 పాయింట్లు దిగువకు పడిపోగా, నిఫ్టీ ఒక్క రోజే 1,000 పాయింట్లకు పైగా క్షీణించింది. సెన్సెక్స్‌ 3,935 పాయింట్లు పతనమై 25,981 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1,135 పాయింట్లు నష్టపోయి 7,610 పాయింట్ల వద్ద ముగిశాయి.  ఇక బ్యాంక్‌ నిఫ్టీ 3,400 పాయింట్ల నష్టంతో 16,918 పాయింట్లకు పడిపోయాయి. ఈ సూచీలన్నీ ఒక్క రోజులో ఇన్నేసి పాయింట్లు పతనం కావడం ఇదే మొదటిసారి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 13.15 శాతం, నిఫ్టీ 12.9%, బ్యాంక్‌ నిఫ్టీ 16% నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు నాలుగేళ్ల కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఆరంభంలోనే సెన్సెక్స్‌ 10 శాతం పతనం కావడంతో సర్క్యూట్‌ బ్రేకర్‌ నిబంధనల ప్రకారం ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపేశారు. ఆ తర్వాత ట్రేడింగ్‌ మొదలైనప్పటికీ, నష్టాలు కొనసాగాయి.

పతనానికి పంచ కారణాలు..
► ఇండియా లాక్‌డౌన్‌
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3.41 లక్షలకు, మరణాలు 14,700కు, రికవరీలు 99,000కు చేరాయి. ఇక భారత్‌లో  మొత్తం కరోనా కేసుల సంఖ్య 468కు పెరగ్గా, మరణాలు పదికి చేరాయి. ప్రస్తుతం భారత్‌ కీలక దశలో ఉందని, ఇటలీ గతి పడుతుందా, చైనాలాగా రికవరీ అవుతుందా చూడాల్సి ఉందని నిపుణులంటున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతం కావడంతో ఈ వైరస్‌ కట్టడికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. పలు కంపెనీలు తమ తమ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలు ఆపేస్తున్నాయని ప్రకటించాయి. మరిన్ని కంపెనీలు కూడా ఇదే బాట నడవనున్నాయి. ఈ లాక్‌డౌన్‌లు, ప్లాంట్ల మూసివేతల కారణంగా ఉత్పత్తి కార్యకలాపాలు మందగించి ఆర్థిక వ్యవస్థ కుంటుపడగలదనే భయాలతో స్టాక్‌ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.  

► కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత నెల 24 నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అయినకాడికి షేర్లను అమ్మేస్తున్నారు. సోమవారం నాటి రూ.2,989 కోట్ల నికర అమ్మకాలను కలుపుకుంటే ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు రూ.54,232 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.  

► రూపాయి ఢమాల్‌
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు మరింతగా కొనసాగుతాయనే భయాలతో డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోతోంది. సోమవారం రూపాయి విలువ జీవిత కాల కనిష్ట స్థాయి, 76.30కు చేరింది.  

► ప్రపంచ మార్కెట్ల పతనం  
కోవిడ్‌–19 వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి పలు దేశాలు లాక్‌డౌన్‌లు ప్రకటించాయి. ఈ ప్రపంచవ్యాప్త లాక్‌డౌన్‌లు మహా మాంద్యానికి దారి తీస్తాయనే భయాలతో ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. చైనా, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియాల సూచీలు 5 శాతం మేర నష్టపోయాయి. ఒక్క జపాన్‌ నికాయ్‌ సూచీ మాత్రం 2 శాతం పెరిగింది. ఇక యూరప్‌ మార్కెట్లు 5 శాతం నష్టాల్లో మొదలై, 3–5 శాతం నష్టాల్లో ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు ఏడేళ్ల కనిష్టాలకు పడిపోయాయి. అమెరికా ఫ్యూచర్స్‌ 5 శాతం మేర నష్టపోయాయి.  

► వృద్ధి అంచనాలు తగ్గింపు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి 5.2 శాతంగానే ఉండగలదని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ వెల్లడించడం ప్రతికూల ప్రభావం చూపింది. భారత్‌ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5 వాతంగా ఉండగలదని ఈ సంస్థ  గతంలో అంచనా వేసింది.

మరిన్ని వివరాలు...
► సెన్సెక్స్‌లోని 30, నిఫ్టీలోని 50 షేర్లు నష్టపోయాయి.  
► యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ 28 శాతం నష్టంతో రూ.308 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
► 1,180 పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. టైటాన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎన్‌టీపీసీ, సన్‌ ఫార్మా, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ  ఈ జాబితాలో ఉన్నాయి.  
► బజాజ్‌ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, యాక్సిస్‌ బ్యాంక్‌లు 20 శాతం మేర నష్టపోయాయి.  
► బీఎస్‌ఈ 500 సూచీలోని వందకు పైగా షేర్లు ఒక్క నెలలోనే 70–50% మేర క్షీణించాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్షియల్‌  జాబితాలో ఉన్నాయి.  
► పలు వాహన కంపెనీలు తమ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపేశాయి. ఫలితంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా, హీరో మోటొకార్ప్, మారుతీ సుజుకీ, టీవీఎస్‌ మోటార్‌  తదితర వాహన కంపెనీల షేర్లు 10 శాతం మేర పతనమయ్యాయి.  
► రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు రెండేళ్ల కనిష్టానికి, యాక్సిస్‌ బ్యాంక్‌ ఆరేళ్ల కనిష్టానికి, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఎనిమిదేళ్ల కనిష్టానికి, ఎం అండ్‌ ఎం పదేళ్ల కనిష్టానికి పడిపోయాయి.

45 నిమిషాలు ఆగిన ట్రేడింగ్‌
భారీ నష్టాలతోనే సెన్సెక్స్, నిఫ్టీలు ఆరంభమయ్యాయి. సెన్సెక్స్‌ 2,718 పాయింట్ల నష్టంతో ఆరంభమైంది. పది గంటల సమయానికే ఈ నష్టాలు 2,992 పాయింట్లు (శుక్రవారం ముగింపుతో పోల్చితే 10 శాతం నష్టం)కు చేరాయి. ఈ సమయానికి నిఫ్టీ 842 పాయింట్లు (9.6 శాతం నష్టం)తో 7,903 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్‌ 10 శాతం నష్టపోవడంతో సర్క్యూట్‌ బ్రేకర్‌ నిబంధన ప్రకారం ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపేశారు. సర్క్యూట్‌ బ్రేకర్‌ కారణంగా ట్రేడింగ్‌ను నిలిపేయడం పది రోజుల్లో ఇది రెండోసారి. ఈ నెల 13న కూడా ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు ఆపేశారు. ఉదయం 11 గంటల అనంతరం ట్రేడింగ్‌ మళ్లీ ఆరంభమైంది. నష్టాలు కొనసాగాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఒడిదుడుకులను నివారించడానికి షార్ట్‌ సెల్లింగ్‌ నిబంధనలను కఠినతరం చేస్తూ, సెబీ తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. కరోనా కేసులు తగ్గితేనే మార్కెట్‌ రికవరీ అవుతుందని నిపుణులంటున్నారు.  

14 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల కారణంగా రూ. 14.22 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇది అల్జీరియాతో సహా 130 దేశాల జీడీపీకి సమానం. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.14,22,207 కోట్లు హరించుకుపోయి రూ.1,01,86,936 కోట్లకు పడిపోయింది.  

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మార్కెట్లో కూడా అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది.  ఫలితంగా మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు కొనసాగుతాయి. కరోనా వైరస్‌ వల్ల ఆర్థికంగా వాటిల్లే నష్టాన్ని తగ్గించే ఉద్దీపన చర్యల కోసం మార్కెట్‌ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.
–అజిత్‌ మిశ్రా, రెలిగేర్‌ బ్రోకింగ్‌ విశ్లేషకులు

మాంద్యం భయాలతో మార్కెట్‌ సోమవారం భారీగా పడిపోయింది. కరోనా అనిశ్చితి నేపథ్యంలో ఈ పతనం ఇక్కడితో ఆగుతుందా, లేదో అని చెప్పడం కష్టతరమే. అయితే  వైరస్‌కు సంబంధించి స్వల్ప ఊరట లభించినా, మార్కెట్లో స్మార్ట్‌ రికవరీ ఉండొచ్చు. 
–సంతోశ్‌ మీనా, ట్రేడింగ్‌ బుల్స్, ఎనలిస్ట్‌  

ఇన్వెస్టర్ల భయాన్ని ప్రతిబింబించే ఒలటైల్‌ ఇండెక్స్‌ (వీఐఎక్స్‌) 6.6 శాతం ఎగసి 71.56 స్థాయిలకు చేరింది. ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు రూ.54,232 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ప్రస్తుత స్టాక్‌ మార్కెట్‌ సంక్షోభం మరింత భయాందోళనకు దారి తీయనున్నది. ఆర్‌బీఐ తక్షణం రేట్లను తగ్గించాలి. ప్రభుత్వం కూడా తగిన చర్యలతో ముందుకు రావాలి. మార్కెట్లను మూసేయాల్సిన అవసరం ఉంది.  
–దేవేన్‌ చోక్సీ, కేఆర్‌ చోక్సీ  

మార్కెట్‌ గురించి ఒక ఆరు నెలల పాటు మరచిపోండి. యోగా చేయండి. చేతిలో నగదు ఉంచుకోండి.
విజయ్‌ కేడియా, కేడియా సెక్యూరిటీస్‌

50కు పైగా షేర్లు 20 శాతం లోయర్‌ సర్క్యూట్లను తాకాయి. ట్రెంట్, ర్యాలీస్, పాలీక్యాబ్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. మరో 130 షేర్లు 10% లోయర్‌ సర్క్యూట్లను తాకాయి. మార్కెట్‌ పతన సమయాల్లో ఒక్క రోజు లాభాలను తర్వాతి రోజుల్లో వచ్చే నష్టాలు హరించివేసే పోకడ... పతనం ఎంత బలంగా ఉందో సూచిస్తోంది. ఇక నిఫ్టీ తదుపరి కీలక మద్దతు 6,825 పాయింట్లు. ఇక్కడి నుంచే 2016, ఫిబ్రవరి నాటి పతనం రివర్స్‌ అయింది.    
–నాగరాజ్‌ శెట్టి, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top