ఆర్‌ఐఎల్‌తో జట్టుకు సౌదీ ఆరామ్‌కో ఆసక్తి! | Sakshi
Sakshi News home page

ఆర్‌ఐఎల్‌తో జట్టుకు సౌదీ ఆరామ్‌కో ఆసక్తి!

Published Thu, Feb 21 2019 12:58 AM

Saudi Aramco to investment more in India; in talks with RIL, others - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతి సంస్థ సౌదీ ఆరామ్‌కో... రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతోంది. భారత్‌లో పెట్రో కెమికల్స్, రిఫైనరీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో పాటు ఇతర కంపెనీలతో చర్చిస్తున్నట్టు బుధవారం సౌదీ ఆరామ్‌కో ప్రకటించింది. మహారాష్ట్రలోని రత్నగిరిలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయతలపెట్టిన 44 బిలియన్‌ డాలర్ల మెగా రిఫైనరీ– పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌లో సౌదీ ఆరామ్‌కో (సౌదీ అరేబియా జాతీయ కంపెనీ), యూఏఈకి చెందిన అడ్‌నాక్‌తో కలసి 50 శాతం వాటా తీసుకుంటున్న విషయం తెలిసిందే. భారత్‌లో పెట్టుబడుల విషయంలో తాము ఇప్పటికీ సానుకూలంగా ఉన్నామని, భాగస్వాములతో కలసి పనిచేస్తున్నామని సౌదీ ఆరామ్‌కో సీఈవో అమిన్‌ ఆల్‌ నసీర్‌ తెలిపారు. భారీ రిఫైనరీ ప్రాజెక్టును మహారాష్ట్రలో రత్నగిరి నుంచి మార్చేందుకు సిద్ధమని తాజాగా బీజేపీ– శివసేన అంగీకారానికి రావడంపై స్పందిస్తూ... అన్నీ సవ్యంగానే కొనసాగుతున్నాయని ఇక్కడి భాగస్వాములు తమకు భరోసానిచ్చినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టులో సౌదీ ఆరామ్‌కో పెట్టుబడులు కొనసాగిస్తుందన్నారు. భారత్‌లో పెట్టుబడులకు ఇతర కంపెనీలతో కూడా చర్చిస్తున్నట్లు తెలియజేశారు. రత్నగిరి రిఫైనరీ ప్రాజెక్టుకే పరిమితం కాబోమని, ఇతర అవకాశాలనూ పరిశీలిస్తున్నామని చెప్పారు. 

భారీ అవకాశాలు...
భారత్‌ తమకు పెట్టుబడుల పరంగా ప్రాధాన్య దేశమని అమిన్‌ ఆల్‌ నసీర్‌ తెలిపారు. ‘‘సౌదీ ఆరామ్‌కో భారత్‌కు 8,00,000 బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది. భారత్‌లో డిమాండ్‌ వృద్ధి పట్ల మేం సంతోషంగానే ఉన్నాం’’ అన్నారు. ఆర్‌ఐఎల్, సౌదీ ఆరామ్‌కో మధ్య చర్చల విషయం తొలిసారి గత డిసెంబర్‌లో వెలుగు చూసింది. ఉదయ్‌పూర్‌లో ముకేశ్‌ అంబానీ కుమార్తె వివాహ ముందస్తు వేడుకలకు సౌదీ పెట్రోలియం మంత్రి ఖాలిద్‌ అల్‌ ఫలీహ్‌ హాజరైన సందర్భంగా చర్చలు జరిపారు. పెట్రో కెమికల్, రిఫైనరీ ప్రాజెక్టుల్లో సంయుక్త పెట్టుబడి అవకాశాల గురించి తాము చర్చించినట్టు అనంతరం ఆయన ట్వీట్‌ చేశారు. రిలయన్స్‌కు జామ్‌నగర్‌లో 68.2 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో రిఫైనరీ ఉంది. పూర్తి ఎగుమతి ఆధారిత రిఫైనరీ సామర్థ్యం ప్రస్తుతం 35.2 మి. టన్నులుగా ఉండగా, దీన్ని 41 మి. టన్నులకు పెంచుకోవాలని చూస్తోంది. అయితే, కొత్త రిఫైనరీ ఏర్పాటు పట్ల ఆసక్తిగా లేదని, పెట్రోకెమికల్, టెలికం వ్యాపారాల విస్తరణపైనే ప్రధానంగా దృష్టి పెట్టిందని పరిశ్రమ వర్గాల సమాచారం.

Advertisement
Advertisement