థియేటర్లలో నో లైట్స్‌ ఆఫ్‌!

Samsung develops the Inox LED LCD screens - Sakshi

‘ఓనిక్స్‌’ ఎల్‌ఈడీ తెరలను అభివృద్ధి చేసిన శామ్‌సంగ్‌ 

పీవీఆర్, ఐనాక్స్‌తో ఒప్పందం; ఒక్క స్క్రీన్‌ ధర రూ.5 కోట్లు 

ప్రస్తుతం ఢిల్లీ, ముంబైల్లో.. త్వరలోనే ఇతర నగరాల్లో ప్రారంభం 

ఏడాదిలో 20 స్క్రీన్ల ఏర్పాటు; 50 శాతం మార్కెట్‌ వాటా 

‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’తో శామ్‌సంగ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ పునీత్‌ సేథీ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చిత్ర పరిశ్రమలో కొత్త శకం ప్రారంభమైంది. ఇక థియేటర్‌లో సినిమా చూడాలంటే లైట్లు ఆపేయాల్సిన అవసరం లేదు. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ ‘ఓనిక్స్‌’ పేరిట ఎల్‌ఈడీ తెరలను అభివృద్ధి చేసింది. అమెరికా, మెక్సికో, చైనా వంటి దేశాల్లో అందుబాటులో ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్లను తొలిసారిగా భారత్‌లో విడుదల చేసింది. మల్టిప్లెక్స్‌ ఆపరేటర్‌ ఐనాక్స్‌ లీజర్స్‌తో ఒప్పందం చేసుకొని బుధవారం ముంబైలో ‘ఓనిక్స్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌’ను ప్రారంభించింది. ఈ సందర్భంగా శామ్‌సంగ్‌ ఇండియా కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పునీత్‌ సేథీ ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’తో మాట్లాడారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. 

గతేడాది కొరియాలో తొలి ఎల్‌ఈడీ ఆధారిత సినిమా స్క్రీన్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం చైనా, మలేషియా, మెక్సికో, థాయ్‌ల్యాండ్‌ వంటి దేశాల్లో 26 స్క్రీన్లున్నాయి. ఇండియా విషయానికొస్తే.. ఈ ఏడాది ఆగస్టులో పీవీఆర్‌ సినిమాతో ఒప్పందం చేసుకొని ఢిల్లీ వసంత్‌కుంజ్‌లోని పీవీఆర్‌ ఐకాన్‌లో తొలి ఓనిక్స్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ప్రారం భించాం. డిజిటల్‌ సినిమా ఇనీషియేటివ్‌ (డీసీఐ) సర్టిఫికేషన్‌ పొందిన తొలి స్క్రీన్‌ ఇది. వచ్చే ఏడాది జనవరిలో ముంబైలోని ఫోనిక్స్‌ మాల్‌లో రెండో స్క్రీన్‌ను ప్రారంభించనున్నాం. తాజాగా ఐనాక్స్‌తో ఒప్పం దం చేసుకొని ముంబైలోని ఇనార్బిట్‌ మాల్‌లో ఎల్‌ఈడీ తెరను ప్రారంభించాం. 

ఏడాదిలో 20 తెరలు.. 
ఇవి కాకుండా పీవీఆర్‌తో మరో రెండు స్క్రీన్స్, ఐనాక్స్‌తో ఒక స్క్రీన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి దేశంలో 20 స్క్రీన్లను అందుబాటులోకి తీసుకురావాలన్నది లక్ష్యం. ఇందుకోసం ఇతర మల్టిప్లెక్స్‌ చెయిన్స్‌తో సంప్రదింపులు జ రుపుతున్నాం. సినిమా ప్రేక్షకుల స్పందనను బట్టి ఓ నిక్స్‌ ఎల్‌ఈడీ స్క్రీన్లను ముంబైతో పాటూ ఢిల్లీ, బెం గళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు విస్తరిస్తాం. 

ఓనిక్స్‌ ప్రత్యేకతలివే.. 
ఓనిక్స్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌ ప్రత్యేకత ఏంటంటే? థియేటర్‌లో ప్రొజెక్టర్‌ అవసరం ఉండదు. సినిమా కంటెంట్‌ నేరుగా సర్వర్‌ నుంచి ఎల్‌ఈడీ తెర మీద పడుతుంది. సాధారణ తెర మీద కంటే ఓనిక్స్‌లో బొమ్మ 10 రెట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఓనిక్స్‌లో స్పష్టతతో పాటూ వ్యూ, త్రీడీ, సౌండ్‌ మూడు కేటగిరీలూ మిళితమై ఉంటాయి. దీంతో మొబైల్, టీవీ స్క్రీన్లలో బొమ్మలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో సినిమా తెర మీద కూడా అంతే స్పష్టత ఉంటుంది. త్రీడీ సాంకేతికతతో థియేటర్‌లో లైటింగ్‌ ఉన్నప్పుడు కూడా సినిమాను స్పష్టంగా చూడొచ్చు. థియేటర్‌ అన్ని వైపులా ధ్వని తరంగాలు ప్రసరించి.. థియేటర్‌లో ఏ దిక్కున కూర్చున్నా సరే శబ్దం అన్ని వైపులా ఒకే విధంగా, స్పష్టంగా వినిపిస్తుంటుంది. 

ధర రూ.5 కోట్లు 
సాధారణ స్క్రీన్‌ నుంచి ఓనిక్స్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌కు మారడానికి 6–8 వారాలు పడుతుంది. ప్రస్తుతం 5, 10, 14 మీటర్ల తెరల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు తెరల సైజ్‌ను బట్టి రూ.4–5 కోట్ల వరకుంటాయి. 6డబ్ల్యూ రీసెర్చ్‌ ప్రకారం దేశంలో డిజిటల్‌ స్క్రీన్ల మార్కెట్‌ 2022 నాటికి 874 మిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం మన దేశంలో డిజిటల్‌ స్క్రీన్స్‌ వ్యాపారంలో శామ్‌సంగ్‌కు 50% మార్కెట్‌ వాటా ఉంది. ఏటా డిజిటల్‌ సైనేజ్‌ బిజినెస్‌ 20% వృద్ధి చెందుతుంటే.. తాము దానికంటే ముందున్నామని పునీత్‌ తెలిపారు.

ఏడాదిలో హైదరాబాద్‌లో 40 ఐనాక్స్‌ స్క్రీన్స్‌
మల్టిప్లెక్స్‌ ఆపరేటర్‌ ఐనాక్స్‌ లీజర్స్‌.. వచ్చే ఏడాది కాలంలో హైదరాబాద్‌లో కొత్తగా మరో 40 తెరలను ప్రారంభించాలని లకి‡్ష్యంచింది. ప్రస్తుతం నగరంలో 11 స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయని.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐనాక్స్‌ తెరలను ప్రారంభించనున్నామని ఐనాక్స్‌ లీజర్స్‌ సీఈఓ అలోక్‌ టాండన్‌ ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఐనాక్స్‌కు 67 నగరాల్లో 137 మల్టీప్లెక్స్‌ల్లో 542 స్క్రీన్స్‌ ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో రూ.1,500 కోట్ల పెట్టుబడులతో అదనంగా 850 స్క్రీన్ల ఏర్పాటు ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. ‘‘లగ్జరీ, సర్వీస్, టెక్నాలజీ ఇదే ఐనాక్స్‌ సక్సెస్‌కు కారణం. 2012లో లగ్జరీ ప్రొజెక్టర్‌ స్క్రీన్స్‌తో డిజిటల్‌లోకి రంగం ప్రవేశం చేశాం. ఆ తర్వాత ఫుడ్‌ యాప్, కియోస్క్‌ టికెట్స్‌ వంటివి సర్వీస్‌లను తీసుకొచ్చాం. తాజాగా ఓనిక్స్‌ ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఓనిక్స్‌ ఎల్‌ఈడీ స్క్రీన్లను ముంబైతో పాటూ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తున్నాం’’ అని వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top