సహారాపై సుప్రీం కొరడా | Sahara chief ordered by court to remain in custody | Sakshi
Sakshi News home page

సహారాపై సుప్రీం కొరడా

Mar 5 2014 12:55 AM | Updated on Sep 2 2017 4:21 AM

సహారాపై సుప్రీం కొరడా

సహారాపై సుప్రీం కొరడా

నిబంధనలకు విరుద్ధంగా సమీకరించిన వేల కోట్ల నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించని వివాదంలో.. సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌తో పాటు మరో ఇద్దరు డెరైక్టర్లు రవి శంకర్ దూబే, అశోక్ రాయ్ చౌదరికి సుప్రీం కోర్టు వారం రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

 న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా సమీకరించిన వేల కోట్ల నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించని వివాదంలో.. సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌తో పాటు మరో ఇద్దరు డెరైక్టర్లు రవి శంకర్ దూబే, అశోక్ రాయ్ చౌదరికి సుప్రీం కోర్టు వారం రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరో డెరైక్టరు వందనా భార్గవకు మాత్రం మినహాయింపునిచ్చింది. జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ ఖెహర్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్.. మంగళవారం కేసు విచారణ సందర్భంగా సహారా గ్రూప్ తీరును తీవ్రంగా ఆక్షేపించింది.

 ఇన్వెస్టర్లకు నిధుల చెల్లింపుల విషయంలో ఆదేశాలను అమలు చేయడంలో కుంటి సాకులతో తాత్సారం చేస్తోందంటూ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్వెస్టర్లకు డబ్బు చెల్లించేశామంటూ సంస్థ చెబుతుండటాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. అసలు కంపెనీ చెబుతున్న ఇన్వెస్టర్లే లేరంటూ సెబీ వంటి నియంత్రణ సంస్థలు తేల్చి చెప్పడాన్ని ప్రస్తావించింది. చివరికి కఠిన చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి కల్పించారంటూ వ్యాఖ్యానించింది.

 ఆస్తులు అమ్మై కట్టేస్తాం..
 సహారా కేసు విచారణ సందర్భంగా.. న్యాయస్థానం కిక్కిరిసిపోయింది. ఆదే శాల పాటింపులో ఉల్లంఘన విషయానికి గాను రాయ్ చేతులు జోడించి బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఇన్వెస్టర్లకు చెల్లింపులకు సంబంధించి మరికాస్త గడువు ఇవ్వాలని కోరారు. బ్యాంకు గ్యారంటీ ఇస్తామని, ఆస్తులు విక్రయించి మరీ చెల్లించేస్తామని చెప్పారు. కానీ, నిర్మాణాత్మక ప్రతిపాదనేదీ ఇవ్వకుండా సహారా పదే పదే ఉల్లంఘనలకు పాల్పడటంపై న్యాయస్థానం ఆగ్రహం తగ్గలేదు. డబ్బు మీకిచ్చేసే పూచీ నాదని రాయ్ ఒక దశలో మాట్లాడటంపై న్యాయమూర్తులు ఆగ్రహించారు.

‘మాకు మీ దగ్గర్నుంచి ఏమీ అక్కర్లేదంటూ’ జస్టిస్ ఖెహర్ తీవ్రంగా వ్యాఖ్యానించడంతో.. పొరపాటు జరిగిందంటూ రాయ్ తక్షణమే క్షమాపణలు కోరారు. గడిచిన 37 ఏళ్లుగా తనపై ఎలాంటి ఆరోపణలు లేవని, తానేనాడూ చట్టాల ఉల్లంఘనకు పాల్పడలేదంటూ న్యాయస్థానానికి రాయ్ విన్నవించారు. ‘నాకు న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉంది. మీ ఆదేశాలను పాటించకపోతే తప్పక శిక్షించండి’ అంటూ ఆయన తెలిపారు. కానీ కోర్టు మాత్రం రాయ్ వినతులను తోసిపుచ్చింది. తమ ఆదేశాలను అమలు చేయకుండా కంపెనీ కుంటిసాకులు చెబుతూ తాత్సారం చేసిందని ఆక్షేపించింది. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘కఠిన చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి కల్పించారు. మా ఆదేశాలను నిబద్ధతతో పాటించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేదే కాదు’ అని వ్యాఖ్యానించింది.

 ‘2012 ఆగస్టు 31న, ఆ తర్వాత ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే దిశగా ఆఖరికి ఇవ్వాళ కూడా మీరు నిర్మాణాత్మక ప్రతిపాదనేదీ ఇవ్వలేదు. దీంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 129, 142 కింద సంక్రమించిన అధికారాల ప్రకారం.. ధిక్కారానికి పాల్పడిన వారికి తదుపరి విచారణ తేదీ దాకా జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నాం. వందనా భార్గవను మాత్రం మినహాయిస్తున్నాం’ అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

 చెల్లింపులకు సంబంధించి రాయ్‌తో పాటు ఇతర డెరైక్టర్లు తప్పుడు, పరస్పర విరుద్ధ అఫిడవిట్లు దాఖలు చే శారని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆయా ఇన్వెస్టర్లు నిజంగానే ఉన్నారా లేదా అనే సందేహాలు రేకెత్తించేలా అవి ఉన్నాయని వ్యాఖ్యానించింది. ‘సెబీ, శాట్ హైకోర్టు.. ఆఖరికి ఈ న్యాయస్థానం ముందు కూడా వారు ఆక్షేపణీయమైన ధోరణిలో వ్యవహరించారు. రీఫండ్ విషయంలో వారు సమర్పించిన పత్రాలు.. వారి వాదనలనే ఖండించేవిలా ఉన్నాయి. నిజ నిర్ధారణ ఏజెన్సీలు కూడా చాలా మంది ఇన్వెస్టర్లు అసలు లేనే లేరని నిర్ధారించాయి. ఈ నేపథ్యంలో జాతి ప్రయోజనాలను కాపాడటంతో పాటు మార్కెట్లపై ఇన్వెస్టర్ల నమ్మకం సడలకుండా చూడాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొంది.  విచారణ ఆసాంతం సుబ్రతా కుమారులు సుశాంతో రాయ్, సీమంతో రాయ్ కోర్టులోనే ఉన్నారు.
 
 ఇంకు పడింది..
 గత నెల 28 నుంచి పోలీస్ కస్టడీలోనే ఉన్న సుబ్రతా రాయ్‌ని సుప్రీం కోర్టులో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హాజరు పర్చే విషయంలో హైడ్రామా నడిచింది. ట్రేడ్‌మార్కు వెయిస్ట్ కోటు, సహారా లోగోతో నల్ల టైతో సుబ్రతా రాయ్‌ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సుప్రీం కోర్టుకు తీసుకొచ్చారు. ఆయన కారులో నుంచి దిగుతుండగానే మనోజ్ శర్మ అనే వ్యక్తి .. బాటిల్ నుంచి ఇంకును ఆయన ముఖం మీద జల్లాడు. తన చొక్కాను విప్పేసి.. సుబ్రతా రాయ్ దొంగ అంటూ అరిచాడు. ‘రాయ్ ఒక దొంగ. అతను ప్రజల డబ్బును దొంగిలించారు. నాకు దొంగలంటే గిట్టదు’ అంటూ శర్మ కేకలు పెట్టాడు. అయితే, అక్కడే ఉన్న కొందరు లాయర్లు, మిగతావారు శర్మను పట్టుకుని చితక్కొట్టారు. ఆ తర్వాత అతన్ని పోలీసులు తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. గతంలో మరో కేసులో కాంగ్రెస్ ఎంపీ సురేశ్ కల్మాడీని కోర్టులో హాజరుపర్చినప్పుడు కూడా శర్మ ఇలాగే వ్యవహరించడం గమనార్హం. అప్పట్లో కల్మాడీపై చెప్పు విసిరి కలకలం రేపాడు.
 
 వివాదమిదీ..
 
 సహారా గ్రూప్‌నకు చెందిన 2 సంస్థలు (సహారా ఇండియా రియల్ ఎస్టేట్, సహారా ఇండియా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్) నిబంధనలకు విరుద్ధంగా రూ. 24,000 కోట్ల నిధులు సమీకరించాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఈ డబ్బును సెబీ ద్వారా మూడు కోట్ల మంది ఇన్వెస్టర్లకు రిఫండ్ చేయాలంటూ 2012 ఆగస్టు 31న సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్‌లో దీన్ని మూడు విడతలుగా చెల్లించేందుకు వెసులుబాటునిచ్చింది. కానీ సెబీకి రూ. 5,120 కోట్లు మాత్రమే ఇచ్చిన సహారా.. మిగతా డబ్బును ఇన్వెస్టర్లకు ఎప్పుడో తిరిగిచ్చేశామని చెప్పుకొచ్చింది. అయితే, సెబీ దీన్ని సవాలు చేసింది.

 ఇదే వివాదానికి సంబంధించి ఫిబ్రవరి 26న సుబ్రతా రాయ్ స్వయంగా తమ ముందు హాజరు కావాలంటూ సుప్రీం కోర్టు బెంచ్ ఆదేశించింది. రాయ్ దాన్ని ఖాతరు చేయకపోవడంతో న్యాయస్థానం కోర్టు ధిక్కారం కేసు కింద నాన్-బెయిలబుల్ వారంటు జారీ చేసింది. అయితే, 92 ఏళ్ల తన తల్లి అనారోగ్యంతో ఉండటంతో, పెద్ద కొడుకుగా తాను ఆమె దగ్గరే ఉండక తప్పడం లేదని రాయ్ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణకు హాజరవుతానని, వారంట్లను ఉపసంహరించాలని కోరారు. కానీ న్యాయస్థానం దీన్ని తిరస్కరించింది. దీంతో గత నెల 28న రాయ్‌ను పోలీసులు లక్నోలో అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement