ఫేస్‌బుక్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Russia threatens to block Facebook - Sakshi

మాస్కో:  ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్‌  దిగ్గజం ఫేస్‌బుక్‌పై  రష్యా  సంచలన హెచ్చరిక జారీ చేసింది. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకపోతే ఫేస్‌బుక్‌ను తమ దేశంలో నిషేధిస్తామని స్ట్రాంగ్‌ వార్నింగ్‌  ఇచ్చింది.   తమ చట్టాలను అతిక్రమిస్తే 2018లో తమ దేశంలో ఫేస్‌బుక్‌ను నిషేధిస్తామని రష్యా  టెలికాం సంస్థ అల్టిమేటమిచ్చింది. ఈ మేరకు ఇప్పటివరకు తాము ఫేస్‌బుక్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని కానీ, తమ దేశ చట్టాల నిబంధనలకు లోబడి అది పనిచేయాలని  స్పష్టం చేసింది.
 
టెలికం రెగ్యులేటరీ  హెడ్‌ అలెగ్జాండర్‌ ఝరోవ్‌  స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ హెచ్చరిక​ చేశారు. చట్టముందు అందరూ సమానమేనని, ఎలాంటి మినహాయింపులేవని స్పష్టం చేశారు. ఫేస్‌బుక్‌ తమ దేశ చట్టాలను అనుసరించేలా చేస్తామని తెలిపారు. 2018లో కచ్చితంగా ఇది జరుగుతుందని వెల్లడించారు.  దీనికి సంబంధించి త్వరలోనే ఫేస్‌బుక్‌ తగిన నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే  లింక్డ్‌ఇన్‌ మాదిరిగానే రష్యాలోనిషేధిస్తామని ఝరోవ్‌ వెల్లడించారు.

వ్యక్తిగత డేటా నిల్వపై రష్యా చట్టం 2015 సెప్టెంబరులో అమల్లోకి వచ్చింది.  దీని ప్రకారం విదేశీ మెసేజింగ్‌ సర్వీసులు, సెర్చ్‌ ఇంజన్లు, సామాజిక మాధ్యమాల వెబ్‌సైట్లు రష్యన్‌ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి కావాల్సిన విధివిధానాలను దీనిలో రూపొందించారు. దీని ప్రకారం ఆ దేశస్థుల అన్ని విషయాలను రష్యాలోని సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలి. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర సామాజిక మాద్యమాలు వినియోగదారుల సమాచారాన్ని వారి ప్రమేయం లేకుండానే  తస్కరిస్తున్నాయని  అక్కడి టెలికం సంస్థలు ఆరోపిస్తున్నాయి.

2016 అమెరికా ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలపై రష్యన్లకు సంబంధమున్న ఖాతాలను ఉపయోగించారని ఫేస్‌బుక్‌వె ల్లడించిన కొన్ని రోజులు తరువాత   రష్యా  అధికారులు తాజా హెచ్చరికలను  జారీ చేయడం గమనార్హం.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top