మార్కెట్‌పై ‘బడ్జెట్‌’ ప్రభావం

Results, rates and rupee to drive market trends - Sakshi

ఐఐపీ, ద్రవ్యోల్బణం, కార్పొరేట్‌ ఫలితాల పాత్ర కూడా

ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అంచనాలు

9న టీసీఎస్, 12న ఇన్ఫోసిస్‌ ఫలితాలు

న్యూఢిల్లీ: గత శుక్రవారం బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కీలక నిర్ణయాలు, ప్రతిపాదనల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని, అలాగే ఐఐపీ(పారిశ్రామికోత్పత్తి), ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక గణాంకాలపైనా ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక జూన్‌  త్రైమాసికానికి సంబంధించి విడుదలయ్యే కంపెనీల ఫలితాలు కూడా మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్ణయించొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 9న టీసీఎస్, 12న ఇన్ఫోసిస్‌ ఫలితాలు విడుదల కానున్నాయి.

అలాగే, బడ్జెట్‌ నిర్ణయాల నేపథ్యంలో డాలర్‌తో రూపాయి కదలికలు, అంతర్జాతీయ అంశాల ప్రభావం సైతం ఉంటుందని భావిస్తున్నారు. గత శుక్రవారం బడ్జెట్‌ నిర్ణయాలు ఆశాజనకంగా లేకపోవడంతో సూచీలు నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లిస్టెడ్‌ కంపెనీల్లో కనీస ప్రజల వాటాను ప్రస్తుత 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడం, బైబ్యాక్‌పై 20 శాతం పన్ను వంటి అంశాలు మార్కెట్లకు రుచించలేదు. ‘‘ఎంతగానో వేచి చూసిన బడ్జెట్‌ కార్యక్రమం ముగిసింది. అయితే, దీని తాలూకూ ప్రభావం ఈ వారం కూడా మార్కెట్‌పై కొనసాగుతుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌ మోదీ తెలిపారు.

‘‘బడ్జెట్‌ ప్రభావం సోమవారం నాటి మార్కెట్‌పైనా ఉంటుంది. సూచీల్లో భారీ క్షీణత మరింత నష్టాలు ఉంటాయన్న సంకేతాన్నిస్తోంది. 11,800ను నిఫ్టీ కోల్పోతే మరింత క్షీణతకు దారితీస్తుంది’’అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రిటైల్‌ డిస్ట్రిబ్యూషన్‌  ప్రెసిడెంట్‌ జయంత్‌ మంగ్లిక్‌ తెలిపారు. ఇక, పారిశ్రామిక ఉత్పత్తి, జూన్‌  నెల ద్రవ్యోల్బణం గణాంకాలు, చమురు ధరల కదలిక, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి సైతం ఈ వారం మార్కెట్‌ దిశను నిర్ణయించనున్నాయి. లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రజల వాటాను పెంచే ప్రతిపాదన అవసరమైనదే కానీ, లార్జ్‌క్యాప్‌ కంపెనీల విషయంలో దీని అమలు సమస్యలతో కూడుకున్నదేనని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌కుమార్‌ అన్నారు.  

మార్కెట్లకు నిరుత్సాహం...
‘‘ప్రభుత్వం నుంచి మద్దతు చర్యలను మార్కెట్‌ ఆశించింది. కానీ, అది జరగలేదు. దేశీయంగా, అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులే ఇందుకు కారణం’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌హెడ్‌ వినోద్‌నాయర్‌ పేర్కొన్నారు. ఈక్విటీల్లో పెట్టుబడులపై ప్రోత్సాహకాల్లేమి మార్కెట్లను సమీప కాలంలో నిరుత్సాహంగా మార్చొచ్చన్నారు. ఈ స్థాయి నుంచి మార్కెట్‌ పనితీరు అన్నది 2020 ఆర్థిక           సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక పనితీరుపై ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయాన్ని వినిపించారు.  

ఈ వారంలో వచ్చే ఫలితాలు
8వ తేదీన డెల్టాకార్ప్, గోవా కార్బన్‌ , 9న టీసీఎస్, 10న సీసీఎల్, 12న ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఇన్ఫోసిస్, కర్ణాటక బ్యాంకు, 13న డీహెచ్‌ఎఫ్‌ఎల్, డీమార్ట్‌ ఈ వారంలో ఫలితాలు విడుదల చేయనున్న ప్రముఖ కంపెనీల్లో కొన్ని.  ‘‘బడ్జెట్‌లో అదనపు సాయం కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు కొనసాగుతాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. 2019–20 ఫలితాల విషయంలో ఎన్‌ఎస్‌ఈ 500 కంపెనీల పన్ను అనంతరం లాభంలో 30 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాం’’అని ఎడెల్‌వీజ్‌ ఇన్వెస్టర్‌ రీసెర్చ్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ సాహిల్‌కపూర్‌ తెలిపారు.

తొలి వారంలో విదేశీ పెట్టుబడులు వెనక్కి  
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు, బడ్జెట్‌ ప్రతిపాదనలపై అనిశ్చితి అంచనాల నేపథ్యంలో జూలై తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ. 475 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంతకు ముందు దాదాపు అయిదు నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరుపుతూ వస్తున్నారు. ఈక్విటీ, డెట్‌ మార్కెట్లకు సంబంధించి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) నికరంగా ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు, మార్చిలో రూ. 45,981 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 16,093 కోట్లు, మే లో రూ. 9,031.15 కోట్లు, జూ¯Œ లో రూ. 10,385 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేశారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top