ఈ–కామర్స్‌ జోష్‌

Reliance Owns Half Of The Online Grocery - Sakshi

2024 నాటికి 99 బిలియన్‌ డాలర్లకు

ఆన్‌లైన్‌ గ్రాసరీలో సగం వాటా రిలయన్స్‌దే

గోల్డ్‌మన్‌ శాక్స్‌ నివేదిక

న్యూఢిల్లీ: దేశీయంగా ఈ–కామర్స్‌ వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతోంది. 2024 నాటికి 27 శాతం వార్షిక వృద్ధి రేటుతో 99 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం కారణంగా ఆన్‌లైన్‌లో నిత్యావసరాల విక్రయాల్లో దాదాపు సగం వాటా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌దే ఉండనుంది. గోల్డ్‌మన్‌ శాక్స్‌ రూపొందించిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్‌ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ–కామర్స్‌ వ్యాపార కార్యకలాపాలు మరింత జోరు అందుకున్నాయని నివేదిక పేర్కొంది.

‘2019–24 మధ్య భారత్‌లో ఈ–కామర్స్‌ వ్యాపారం 27 శాతం వార్షిక వృద్ధితో 2024 నాటికి 99 బిలియన్‌ డాలర్లకు చేరుతుంది. నిత్యావసరాలు, ఫ్యాషన్‌/దుస్తులు మొదలైనవి ఈ వృద్ధికి తోడ్పడతాయి‘ అని వివరించింది. ‘రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ–కామర్స్‌లోకి అడుగుపెట్టడం, ఆన్‌లైన్‌లో నిత్యావసరాల విక్రయానికి వాట్సాప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సమీప భవిష్యత్‌లో గణనీయంగా ప్రబావం చూపే అంశం‘ అని గోల్డ్‌మన్‌ శాక్స్‌ తెలిపింది. 2019లో ఆన్‌లైన్‌ గ్రాసరీ విభాగంలో బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్‌ వాటా 80 శాతం పైగా ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్‌ 9.99 శాతం వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  

ఆన్‌లైన్‌ గ్రాసరీ 81 శాతం వృద్ధి .. 
గడిచిన కొన్నాళ్లుగా ఆన్‌లైన్‌ గ్రాసరీ విభాగం 50 శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తుండగా.. కరోనా వైరస్‌ పరిణామాలు, రిలయన్స్‌ ఎంట్రీ కారణంగా 2019–24 మధ్య కాలంలో ఏకంగా 81 శాతం వార్షిక వృద్ధి నమోదు చేయొచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ పేర్కొంది. ‘ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం కారణంగా ఆన్‌లైన్‌ గ్రాసరీ విభాగంలో 2024 నాటికి 50 శాతం పైగా వాటాతో రిలయన్స్‌ మార్కెట్‌ లీడరుగా ఎదిగే అవకాశం ఉంది. రెండు.. అంతకు మించిన సంఖ్యలో సంస్థలు ఈ విభాగంలో కార్యకలాపాలను సాగించేందుకు పుష్కలమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయి‘ అని వివరించింది.

నిత్యావసరయేతర ఈ–కామర్స్‌ వినియోగం వచ్చే రెండేళ్లలో 500 బేసిస్‌ పాయింట్ల మేర పెరగొచ్చని, 2021 నాటికి 16.1 శాతానికి చేరవచ్చని పేర్కొంది. దేశీయంగా నిత్యావసరాల మార్కెట్‌ 2019లో 380 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మొత్తం రిటైల్‌ మార్కెట్లో దీని వాటా దాదాపు 60 శాతం ఉంటుంది. అయితే, ఆన్‌లైన్‌ అమ్మకాలు మాత్రం కేవలం 2 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంటున్నాయి. ప్రస్తుతం ఈ–కామర్స్‌ ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ గ్రాసరీ మార్కెట్‌ వచ్చే అయిదేళ్లలో 29 బిలియన్‌ డాలర్లకు పెరగవచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ తెలిపింది. 2019లో ఆన్‌లైన్‌ గ్రాసరీ ఆర్డర్లు రోజుకు 3,00,000 స్థాయిలో ఉండగా.. 2024 నాటికి 50 లక్షలకు చేరవచ్చని పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top