
న్యూఢిల్లీ: రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఆర్‌నామ్) ఐపీవోకి భారీ స్పందన లభించింది. ఐపీవో తొలి రోజున నిమిషం వ్యవధిలోనే ఇష్యూ 4.64 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. తద్వారా నిమిషం వ్యవధిలోనే పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయిన తొలి ఐపీవోగా నిల్చిందని మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు రూ. 1,542 కోట్లు సమీకరిస్తోంది.
మొత్తం 4.28 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా (యాంకర్ ఇన్వెస్టర్ల వాటా కాకుండా) మొత్తం 19.88 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చినట్లు ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం వెల్లడైంది. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ విభాగం 6.13 రెట్లు, సంస్థాగేతర ఇన్వెస్టర్లు 11.38 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 0.90 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. తొలి రోజున మొత్తం 2,61,694 దరఖాస్తులు వచ్చాయి. షేరు ఒక్కింటి ధరల శ్రేణి రూ. 247–252గా ఉన్న ఈ ఇష్యూ అక్టోబర్ 27తో ముగుస్తుంది.