రిలయన్స్‌ మరో ఘనత టాప్‌లోకి

Reliance Industries tops Fortune India 500 list ending IOC's 10 - Sakshi

ఐఓసీని అధిగమించిన రిలయన్స్‌

ఫార్చూన్‌ ఇండియా–500 కంపెనీల జాబితాలో అగ్రస్థానం

2018–19 ఏడాదిలో రూ. 5.81 లక్షల కోట్ల ఆదాయం

వృద్ధిలో ఐఓసీ కంటే 8.4% అధికం

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) మరో ఘనతను సాధించింది. తాజాగా ఫార్చూన్‌ ఇండియా– 500 జాబితాలో అగ్ర స్థానానికి చేరుకుంది. ఆదాయం పరంగా వెలువడిన ఈ జాబితాలో ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ను  (ఐఓసీ) వెనక్కు నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఐఎల్‌ రూ. 5.81 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్లు ఫార్చూన్‌ ఇండియా పేర్కొంది. వృద్ధి 41.5 శాతం ఉండగా.. పోటీ సంస్థ ఐఓసీతో పోల్చితే ఈ కంపెనీ వృద్ధి 8.4 శాతం అధికంగా ఉంది. ఐఓసీ అమ్మకాలు రూ.5.36 లక్షల కోట్లు కాగా, వృద్ధి 26.6 శాతం, లాభం రూ.39,588 కోట్లుగా ఉన్నాయి. ఇక గడిచిన 10 ఏళ్ల సగటు పరంగా చూస్తే.. ఈ కాలంలో ఐఓసీ ఆదాయం కంటే ఆర్‌ఐఎల్‌ ఆదాయం 3 రెట్లు అధికం.  ఇక, 2015 ఆర్థిక సంవత్సరంలో ఐఓసీ రూ. 4,912 కోట్ల లాభాన్ని నమోదుచేయగా.. ఆర్‌ఐఎల్‌ 4 రెట్లు అధికంగా రూ. 23,566 కోట్ల లాభాన్ని కళ్లచూడటం విశేషం.

ఓఎస్‌జీసీ స్థానం పదిలం  
గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా  ఓఎన్‌జీసీ మూడవ స్థానంలో నిలిచింది. ఎస్‌బీఐ(4), టాటా మోటార్స్‌ (5), బీపీసీఎల్‌ (6) స్థానాల్లో ఉన్నాయి. అంతక్రితం ఏడాదిలో కూడా ఈ కంపెనీల జాబితా ఇదే వరుసలో ఉంది. రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ 2019 జాబితాలో 7వ స్థానానికి చేరుకుంది. టాటా స్టీల్, కోల్‌ ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), లార్సెన్‌ అండ్‌ టూబ్రో వరుసగా 8, 9, 10, 11 వ స్థానంలో ఉన్నాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌ రెండు మెట్లు ఎక్కి 12వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత వరుస స్థానాల్లో హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఉన్నాయి. కాగా,
ఫార్చూన్‌ ఇండియా జాబితాలోని 500 కంపెనీల 2019 సగటు ఆదాయం 9.53 శాతం పెరగ్గా, లాభం 11.8 శాతం వృద్ధి చెందింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top