లాభాల్లో రిలయన్స్‌ కొత్త రికార్డు  | Sakshi
Sakshi News home page

లాభాల్లో రిలయన్స్‌ కొత్త రికార్డు 

Published Thu, Oct 18 2018 12:22 AM

Reliance Industries’ Profit Meets Estimates On Petchem Boost - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌)... ఈ ఆర్థిక సంవత్సరం జూలై– సెప్టెంబర్‌ త్రైమాసిక లాభంలో 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.9,516 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.8,109 కోట్లతో పోలిస్తే 17% వృద్ధి చెందగా, ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంతో పోల్చి చూస్తే మాత్రం 0.6 శాతమే పెరిగింది. రూ.9,629 కోట్ల లాభాన్ని ఆర్జించొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. రిటైల్, జియో, పెట్రోకెమికల్‌ వ్యాపారాలు కళకళలాడాయి. దీంతో రిఫైనరీ వ్యాపారం దెబ్బకొట్టినా, కంపెనీ మెరుగైన ఫలితాలను నమోదు చేయగలిగింది. కంపెనీ కన్సాలిడేటెడ్‌ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 54.5% పెరిగి రూ.1,56,291 కోట్లకు చేరింది. పెట్రోకెమికల్, రిఫైనరీ ఉత్పత్తులకు అధిక ధరలు లభించడం ఆదాయం పెరిగేందుకు తోడ్పడింది. కొత్త పెట్రోకెమికల్‌ తయారీ సదుపాయాలు అందుబాటులోకి రావడం అధిక విక్రయాలకు కారణమని కంపెనీ తెలిపింది.  

రిటైల్‌ వ్యాపారం భళా
రిటైల్‌ వ్యాపారంలో పన్నుకు ముందస్తు లాభం ఏకంగా 213 శాతం పెరిగి రూ.1,392 కోట్లకు చేరింది. దుకాణాల విస్తరణ, ఉన్న దుకాణాల్లో అమ్మకాలు పెరగడంతో ఆదాయం సైతం రెట్టింపై రూ.32,436 కోట్లుగా నమోదైంది. దేశవ్యాప్తంగా 5,800 పట్టణాల్లో కంపెనీకి 9,146 స్టోర్లు ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక కాలంలో రిటైల్‌ వ్యాపారం రూ.444 కోట్ల పీబీడీఐటీ (తరుగుదల, వడ్డీ, పన్నుకు ముందు లాభం) నమో దు చేసింది. ఆదాయం రూ.14,646 కోట్లుగా ఉంది.  

జియోకు లాభాలు 
టెలికం విభాగం రిలయన్స్‌ జియో నికర లాభం రూ.681 కోట్లుగా ఉంది. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 11.3 శాతం పెరిగింది. కంపెనీ చందాదారుల సంఖ్య 25.2 కోట్లుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జియో పన్నుకు ముందు రూ.271 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. సెప్టెంబర్‌ క్వార్టర్లో నికరంగా 3.7 కోట్ల కస్టమర్లు జియో నెట్‌వర్క్‌కు తోడయ్యారు. జూన్‌ క్వార్టర్లో నూతన చం దాదారుల సంఖ్య 2.87 కోట్లుగా ఉంది. ఓ యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో రూ.134.5గా ఉండగా,  సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.131.7కు తగ్గింది.  

రిఫైనరీ మార్జిన్‌ 
రిఫైనింగ్‌ వ్యాపారంలో ఆదాయం 3.25 శాతం వృద్ధితో రూ.98,760 కోట్లకు చేరుకుంది. ఎబిట్‌ (వడ్డీ, పన్నుకు ముందస్తు ఆదాయం) 19.6 శాతం క్షీణించి రూ.5,322 కోట్లుగా నమోదైంది. జూన్‌ త్రైమాసికంలోనూ ఎబిట్‌ 16.8 శాతం తగ్గడం గమనార్హం. బ్యారెల్‌ చమురుపై స్థూల రిఫైనరీ మార్జిన్‌ 9.50 డాలర్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 12 డాలర్లు కాగా, జూన్‌ త్రైమాసికంలో 10.5 డాలర్లుగా ఉంది. అయితే, జీఆర్‌ఎం అంతకుముందు త్రైమాసికంతో పోల్చితే ఫ్లాట్‌గా 10.6–10.9 డాలర్ల మధ్య ఉండొచ్చని అనలిస్టులు అంచనా వేశారు. చమురు ధరలు క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చితే... ఈ ఏడాది సెప్టెంబర్‌ క్వార్టర్‌ నాటికి 45 శాతం పెరిగాయి. బ్రెండ్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 75 డాలర్లకు చేరుకుంది. పెట్రోకెమికల్‌ వ్యాపారం పన్నుకు ముందస్తు లాభం 63 శాతం వృద్ధితో రూ.8,120 కోట్లుగా ఉంది. ఆయిల్, గ్యాస్‌ ఉత్పత్తి వ్యాపారంలో నష్టాలు పెరిగాయి. పన్నుకు ముందు రూ.480 కోట్ల నష్టాలు వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ నష్టాలు రూ.272 కోట్లుగా ఉన్నాయి. 

పెరిగిన రుణ భారం 
జియో కోసం రిలయన్స్‌ పెట్టుబడులు పెడుతూనే ఉంది. దీంతో కంపెనీ రుణ భారం సెప్టెంబర్‌ త్రైమాసికానికి రూ.2,58,701 కోట్లకు పెరిగింది. జూన్‌ క్వార్టర్లో ఇది రూ.2,42,116 కోట్లు. కంపెనీ నగదు నిల్వలు క్రితం త్రైమాసికంలో ఉన్న రూ.79,492 కోట్ల నుంచి రూ.76,740 కోట్లకు తగ్గాయి.

సవాళ్ల మధ్య బలమైన పనితీరు
స్థూల ఆర్థికపరమైన సవాళ్ల మధ్య కూడా మా సంస్థ బలమైన నిర్వహణ, ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. వార్షికంగా చూస్తే ఆదాయాల్లో మంచి వృద్ధి నెలకొంది. కమోడిటీ, కరెన్సీ మార్కెట్లో తీవ్ర అస్థిరతల మధ్య మా సమగ్ర రిఫైనింగ్, పెట్రోకెమికల్‌ వ్యాపారం బలమైన నగదు ప్రవాహాలను నమోదు చేసింది’’ అని ఆర్‌ఐఎల్‌ చైర్మన్, ఎండీ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. కన్జ్యూమర్‌ వ్యాపారం ఊపందుకుంటోందని చెప్పారు. రిటైల్‌ వ్యాపారం ఎబిట్డా వార్షికంగా చూస్తే మూడు రెట్లు పెరగ్గా, జియో ఎబిట్డా 2.5 రెట్లు పెరిగినట్టు అంబానీ తెలిపారు.

రిలయన్స్‌ చేతికి హాత్‌వే, డెన్‌నెట్‌వర్క్‌ 
కేబుల్‌ టీవీ, వైర్డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విభాగంలో రిలయన్స్‌ వేగంగా విస్తరించే దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా డెన్‌ నెట్‌వర్క్‌లో 66 శాతం వాటా తీసుకోనున్నట్టు తెలియజేసింది. ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా రూ.2,045 కోట్లు, సెకండరీ మార్కెట్లో రూ.245 కోట్లతో ప్రస్తుత ప్రమోటర్ల నుంచి షేర్లను కొనుగోలు చేయనుంది. అలాగే, హాత్‌వే కేబుల్‌లోనూ ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా రూ.2,940 కోట్ల పెట్టుబడితో 51.34 శాతం వాటా కొనుగోలు చేయనుంది. 90.8 కోట్ల షేర్లను ఒక్కో షేరుకు రూ.32.35 ధరపై జారీ చేయనున్నట్టు హాత్‌వే కేబుల్‌ ప్రకటించింది. హాత్‌వే, హాత్‌వే భవానీ కేబుల్‌ టెల్‌ అండ్‌ డేటాకామ్‌ సంయుక్త సంస్థ అయిన జీటీపీఎల్‌ హాత్‌వే లిమిటెడ్‌ మైనారిటీ వాటాదారులకు ఆర్‌ఐఎల్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనుంది.  

Advertisement
Advertisement