ఆగస్ట్‌లో తగ్గిన సేవల రంగం వృద్ధి

Reduced service sector growth in August - Sakshi

  51.5 శాతంగా నమోదు

జూలైలో ఇది 54.2  

న్యూఢిల్లీ: దేశీయ సేవల రంగం కార్యకలాపాలు 21 నెలల గరిష్ట స్థాయి నుంచి ఆగస్ట్‌లో తగ్గుముఖం పట్టాయి. నూతన ఆర్డర్లు తగ్గడం, అదే సమయంలో కంపెనీలు ఉద్యోగులను పెంచుకోవడంతో ఉత్పత్తి వ్యయం ఎగిసేందుకు దారితీసినట్టు నెలవారీ సర్వేలో తెలిసింది. నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ జూలైలో 54.2 శాతానికి చేరగా, ఆగస్ట్‌లో 51.5 శాతానికి తగ్గింది. ఆగస్ట్‌లో నూతన ఆర్డర్ల రాక మూడు నెలల్లోనే కనిష్టంగా ఉంది.

సేవల రంగం వృద్ధి గరిష్టానికి చేరి చల్లబడినట్టు ఈ గణాంకాలు సంకేతాలిస్తున్నాయని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ అనలిస్ట్‌ ఆష్నా దోధియా తెలిపారు. ఇక సీజన్‌వారీగా సర్దుబాటు చేసిన నికాయ్‌ ఇండియా కాంపోజిట్‌ (సేవలు, తయారీ) పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ సైతం జూలైలో 54.1 శాతం కాగా, ఆగస్ట్‌లో 51.9 శాతానికి తగ్గింది. తయారీ, సేవలు రెండింటిలోనూ వృద్ధి బలహీనంగా ఉందని ఇది తెలియజేస్తోంది. ఇన్‌పుట్‌ వ్యయానికి సంబంధించి ద్రవ్యోల్బణం తొమ్మిది నెలల్లోనే బలంగా ఉందని తేలింది. సానుకూల అంశం ఏమిటంటే వ్యాపార విశ్వాసం ఈ ఏడాది మే నెల తర్వాత అధిక స్థాయికి చేరింది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top