యాక్సిస్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ షాక్‌..

RBI drops Axis Bank from list of bullion importers - Sakshi

బులియన్‌ దిగుమతి బ్యాంకుల జాబితా నుంచి తొలగింపు

ముంబై: ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవోగా మరోసారి శిఖా శర్మ కొనసాగింపుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్‌బీఐ తాజాగా ఆ బ్యాంక్‌కు ఇంకో షాకిచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం పసిడి, వెండి దిగుమతికి అనుమతి పొందిన 16 బ్యాంకుల జాబితాలో యాక్సిస్‌ పేరును పక్కన పెట్టింది. భారీ స్కామ్‌లో చిక్కుకున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌తో పాటు క్విడ్‌ ప్రో కో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్‌ సారథ్యంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా ఈ లిస్టులో ఉన్నప్పటికీ.. యాక్సిస్‌ బ్యాంక్‌ పేరు మాత్రం లేదు.

గతేడాది మొత్తం 19 బ్యాంకులు బులియన్‌ దిగుమతులకు లైసెన్సులు పొందగా.. పసిడి, వెండిని అత్యధికంగా దిగుమతి చేసుకున్న బ్యాంకుల్లో యాక్సిస్‌ కూడా ఉంది. సాధారణంగా బ్యాంకులు పసిడి, వెండిని దిగుమతి చేసుకుని, వ్యాపార సంస్థలకు విక్రయిస్తుంటాయి. ఫీజుల రూపంలో ఆదాయం ఆర్జించడంతో పాటు కీలకమైన పెద్ద ఖాతాదారులతో సత్సంబంధాలు పెంచుకోవడానికి కూడా బ్యాంకులకు ఇది ఉపయోగపడుతుంది.  

సీఈవో, ఎండీగా శిఖా శర్మను మరోసారి కొనసాగించడాన్ని పునఃపరిశీలించాలంటూ యాక్సిస్‌ బ్యాంక్‌కు ఇప్పటికే సూచించిన ఆర్‌బీఐ .. తాజాగా బులియన్‌ దిగుమతి బ్యాంకుల లిస్టు నుంచి ఆ బ్యాంక్‌ను తొలగించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. శిఖా శర్మ హయాంలో మొండిబాకీలు భారీగా పెరిగి, బ్యాంకు పనితీరు క్షీణించిందనే కారణంతో ఆమెను చీఫ్‌గా కొనసాగించాలన్న నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలంటూ బ్యాంక్‌కు ఆర్‌బీఐ సూచించిన సంగతి తెలిసిందే.

ఈసారి బులియన్‌ దిగుమతి లైసెన్సులు కోల్పోయిన వాటిల్లో కరూర్‌ వైశ్యా బ్యాంక్, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ కూడా ఉన్నాయి. అనుమతులు పొందిన వాటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంక్, యస్‌ బ్యాంక్‌ మొదలైన వాటితో పాటు అంతర్జాతీయ బ్యాంక్‌లైన ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, బ్యాంక్‌ ఆఫ్‌ నోవా స్కోషియా కూడా ఉన్నాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top