పర్సంటేజ్‌లతో పండగ చేస్కో!

RBI cuts policy rate and FY20 growth forecast - Sakshi

మరో విడత ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత

రెపో, రివర్స్‌ రెపో రేట్లు పావు శాతం తగ్గింపు

గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు చౌక

జీడీపీ వృద్ధి రేటు భారీగా తగ్గింపు

2019–20కు 6.1 శాతంగా అంచనా

ముంబై: పండుగల వేళ.. రుణ గ్రహీతలకు ఆర్‌బీఐ మరోసారి శుభవార్త తెచ్చింది. గృహ, వాహన, కార్పొరేట్‌ రుణాలు చౌకగా లభ్యమయ్యేలా  వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటించింది.  దేశ వృద్ధికి ఆర్‌బీఐ విధానం మద్దతుగా నిలుస్తుందన్న మాటను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మరో విడత ఆచరణలో చూపించారు. ఇందుకుగాను కీలక రేట్లకు మరో పావు శాతం కోత పెట్టారు. రెపో, రివర్స్‌ రెపోలను 25 బేసిస్‌ పాయింట్ల చొప్పున (0.25 శాతం) తగ్గించారు. తద్వారా రుణాల రేట్లను మరి కాస్త దిగొచ్చేలా చేశారు.

ఎందుకంటే గతంలో మాదిరిగా బ్యాంకులు ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించకుండా ఉండేందుకు అవకాశం లేదు. అక్టోబర్‌ 1 నుంచి ఆర్‌బీఐ పేర్కొన్న ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్లలో (ముఖ్యంగా రేపోరేటు) ఏదో ఒకదాని ఆధారంగా బ్యాంకులు రిటైల్‌ రుణాలపై రేట్లను అమలు చేయాల్సి ఉంటుంది. నిదానించిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా గడిచిన ఏడాది కాలంలో ఆర్‌బీఐ రేట్లను తగ్గిస్తూనే వస్తోంది. 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఐదు పర్యాయాలు నికరంగా 135 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించడం జరిగింది.

కాకపోతే బ్యాంకులే ఈ ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురాలేదు. ఇప్పటి వరకు రుణాలపై అవి తగ్గించింది 50 బేసిస్‌ పాయింట్లకు మించలేదు. ఇకపై ఆర్‌బీఐ విధాన నిర్ణయాలకు అనుగుణంగా బ్యాంకులు కూడా రిటైల్‌ రుణ రేట్లను వెంటనే సవరించాల్సి వస్తుంది. దీనివల్ల వాహన, గృహ, వ్యక్తిగత, ఇతర రుణాలు చౌకగా మారనున్నాయి. తక్కువ వడ్డీ రేట్లతో కార్పొరేట్‌ కంపెనీలపైనా భారం తగ్గుతుంది. దీంతో అవి మరింత పెట్టుబడులతో ముందుకు రాగలవు. రుణాల వినియోగం పెరిగితే, అది వ్యవస్థలో డిమాండ్‌ పెరిగేందుకు దారితీస్తుంది. ముఖ్యంగా పండుగల సమయంలో ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు వినియోగదారులకు ఉత్సాహాన్నిచ్చేదే.

వృద్ధి రేటు అంచనాలు భారీగా తగ్గింపు...
దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గించి ఆర్‌బీఐ షాక్‌కు గురిచేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని తాజాగా పేర్కొంది. గత పాలసీ సమావేశంలో వృద్ధి రేటును ఆర్‌బీఐ 6.9 శాతంగా అంచనా వేయడం గమనార్హం. అయితే, జూన్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుతుందని ఆర్‌బీఐ కూడా ఊహించలేదు. ఈ విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌ ఓ సందర్భంలో పేర్కొన్నారు కూడా.  ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పుంజుకోకపోవడంతోపాటు, ఎగుమతులు తగ్గడమే తన అంచనాల తగ్గింపునకు కారణాలుగా పేర్కొంది. కాకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్ధభాగం.. అక్టోబర్‌ నుంచి వృద్ధి రికవరీ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది.  ఇక, 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి పుంజుకుంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

పాలసీ సమీక్ష ముఖ్యాంశాలు...  
► ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో ఉన్న ఆరుగురు సభ్యులు కూడా పాలసీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఐదుగురు సభ్యులు పావు శాతం తగ్గింపునకు అనుకూలంగా ఓటు వేయగా, రవీంద్ర ధోలాకియా మాత్రం 0.40 బేసిస్‌ పాయింట్ల తగ్గింపునకు అనుకూలంగా ఓటేశారు.   
► ఆర్‌బీఐ తన ప్రస్తుత విధానమైన సర్దుబాటు ధోరణిని అలాగే కొనసాగించింది. అంటే పరిస్థితులకు అనుగుణంగా రేట్ల తగ్గింపు నిర్ణయాలకు ఇది వీలు కల్పిస్తుంది.  
► తాజా రేట్ల తగ్గింపు తర్వాత రెపో రేటు 5.15 శాతానికి, రివర్స్‌ రెపో రేటు 4.9 శాతానికి చేరాయి. రెపో రేటు అంటే... బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటు. రివర్స్‌ రెపో రేటు అంటే బ్యాంకులు తన వద్ద ఉంచిన నిధులపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటు. రెపో రేటు 2010 తర్వాత కనిష్ట స్థాయికి చేరింది. 2010 మార్చిలో రెపో రేటు 5 శాతంగా ఉంది. గత ఎంపీసీ సమీక్షలో 35 బేసిస్‌ పాయింట్ల మేర రెపోను తగ్గించారు.
► క్రితం నాలుగు ఎంపీసీ భేటీల్లో వడ్డీ రేట్లను 110 బేసిస్‌ పాయింట్లు తగ్గించినప్పటికీ, కస్టమర్లకు రుణాలపై ఈ ప్రయోజన బదలాయింపు అస్థిరంగా, అసంపూర్ణంగా ఉందని ఆర్‌బీఐ  పేర్కొంది.
► అమెరికా–చైనా వాణిజ్య యుద్ధంతో పడిపోతున్న వృద్ధిని నిలు వరించేందుకు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు (అమెరికా ఫెడ్‌ సహా) వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
► 2019–20 రెండో త్రైమాసికానికి ద్రవ్యోల్బణం అంచనాలను 3.4 శాతానికి ఆర్‌బీఐ ఎంపీసీ సవరించింది. అలాగే, ద్వితీయ ఆరు నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3.5–3.7 శాతం మధ్య ఉంటుందన్న గత అంచనాలనే కొనసాగించింది. ద్రవ్యోల్బణాన్ని మధ్య కాలానికి 4 శాతానికే పరిమితం చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం.  
► వ్యవసాయ రంగ పరిస్థితులు ఆశాజనకంగా మారాయని ఎంపీసీ పేర్కొంది. తిరిగి ఉపాధి కల్పనకు, ఆదాయానికి, దేశీయ వృద్ధికి సానుకూలించనున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్‌ 3–5 తేదీల్లో జరుగుతుంది.

వృద్ధి కోసం రేట్ల కోత అవసరమే: దాస్‌
నిలిచిన వృద్ధి ఇంజిన్‌ను వెంటనే పరుగెత్తించేలా చేయాల్సిన అవసరమే.. రేట్లను దశాబ్ద కనిష్ట స్థాయికి తగ్గించాల్సి వచ్చినట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ‘‘వృద్ధి ధోరణి ఇలాగే ఉన్నంత కాలం... అలాగే, వృద్ధి పుంజుకునేంత వరకు ఆర్‌బీఐ తన ప్రస్తుత సర్దుబాటు విధానాన్నే కొనసాగిస్తుంది’’ అని దాస్‌ అభయమిచ్చారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ద్వారా కేంద్రం రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం కోల్పోనుండడం ద్రవ్యలోటుపై ప్రభావం చూపించే అవకాశాలపై ఎదురైన ఒక ప్రశ్నకు... ‘‘బడ్జెట్‌లో పేర్కొన్న లక్ష్యానికి (జీడీపీలో 3.3 శాతం) ద్రవ్యలోటును పరిమితం చేస్తామని కేంద్రం చెబుతోంది. కనుక  కేంద్ర ప్రభుత్వ అంకితభావాన్ని సందేహించాల్సిన అవసరం లేదు’’ అని దాస్‌ చెప్పారు. ద్రవ్య ప్రోత్సాహకాలు, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ఆర్థిక వ్యవస్థకు సానుకూలతలుగా దాస్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం మధ్యంతర డివిడెండ్‌ రూపంలో రూ.30 వేల కోట్లను కోరనుందన్న విషయమై తనకు అవగాహన లేదన్నారు.

బ్యాంకింగ్‌ రంగం పటిష్టం
దేశ బ్యాంకింగ్‌ రంగంపై తలెత్తుతున్న సందేహాలు, వదంతులను తోసిపుచ్చుతూ.. బ్యాంకింగ్‌ వ్యవస్థ బలంగా, సుస్థిరంగా ఉందని, భయపడేందుకు కారణాలేమీ లేవన్నారు దాస్‌. ఒక్క కోపరేటివ్‌ బ్యాంకులో తలెత్తిన సమస్య పునరావృతం కాబోదన్నారు. దీన్ని బ్యాంకింగ్‌ వ్యవస్థ సాధారణ పరిస్థితికి ముడిపెట్టి చూడడం తగదన్నారు. అక్రమాలు వెలుగు చూడడంతో ఇటీవలే  పీఎంసీ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే.
 
ఎవరేమన్నారంటే...
25 బేసిస్‌ పాయింట్ల మేర రేట్ల కోతతోపాటు అవసరమైతే తదుపరి రేట్ల కోత ఉంటుందని చెప్పడం అన్నది.. వృద్ధి ఆందోళనలకు ముగింపు పలికేందుకు ద్రవ్య, పరపతి విధానాలు కలసి పనిచేస్తాయన్న భరోసాను  ఇస్తోంది.     
– రజనీష్‌ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్‌

135 బేసిస్‌ పాయింట్లను ఈ ఏడాది తగ్గించడానికి తోడు ప్రభుత్వం తీసుకున్న పలు ప్రోత్సాహక చర్యలు పలు రంగాల్లో వృద్ధికి దారితీస్తుంది. ఇది ప్రస్తుత స్థాయి నుంచి దేశ వృద్ధి పెరిగేందుకు తోడ్పడుతుంది.
– చంద్రజిత్‌ బెనర్జీ, డైరెక్టర్‌ జనరల్, సీఐఐ

బెంచ్‌ మార్క్‌ లెండింగ్‌ రేట్లను ఆర్‌బీఐ తగ్గించడం, వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవలీ తీసుకున్న చర్యలకు అదనపు ప్రోత్సాహాన్నిస్తుంది  
– కేంద్ర ఆర్థిక శాఖ

అంచనా వేసిన మేరకే రేట్ల కోత ఉంది. అయితే, మార్కెట్లు మరింత రేటు కోతను అంచనా వేయడంతో నిరాశ చెందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 25–40 బేసిస్‌ పాయింట్ల వరకు రేట్ల తగ్గింపు ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం.
– అభిషేక్‌ బారు, వైస్‌ ప్రెసిడెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు  

ఎంఎఫ్‌ఐల రుణ పరిమితి పెంపు
సూక్ష్మ రుణ సంస్థలకు (మైక్రో ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్లు/ఎంఎఫ్‌ఐ) సంబంధించి రుణ పరిమితిని పెంచుతూ ఆర్‌బీఐ పాలసీ సమీక్ష సందర్భంగా ఓ సానుకూల నిర్ణయాన్ని వెలువరించింది. దీని వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రుణాల లభ్యత పెరుగుతుంది. ఓ రుణ గ్రహీతకు గరిష్టంగా రూ.లక్షగా ఉన్న పరిమితిని రూ.1.25 లక్షలు చేసింది. ఎంఎఫ్‌ఐ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీలు) రుణ గ్రహీతలకు సంబంధించి గృహ ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలకు, పట్టణాల్లో రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఆదాయం, రుణ వితరణ పరిమితులను చివరిసారిగా 2015లో ఆర్‌బీఐ సవరించింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top