రామ్‌కీ ఎన్విరో విదేశీ టూర్‌!  | Ramky Envaro Foreign Tour | Sakshi
Sakshi News home page

రామ్‌కీ ఎన్విరో విదేశీ టూర్‌! 

Feb 1 2018 1:28 AM | Updated on Feb 1 2018 1:28 AM

Ramky Envaro Foreign Tour - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  వ్యర్థాల నిర్వహణలో ఉన్న దిగ్గజ సంస్థ రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌... విదేశీ మార్కెట్లలో మరింత విస్తరిస్తోంది. అమెరికా, ఒమన్, సౌదీ అరేబియా, అబుదాబి, దుబాయ్, సింగపూర్, బంగ్లాదేశ్‌లో ప్రాజెక్టులను నిర్వహిస్తున్న ఈ సంస్థ.. ఇండోనేసియా, థాయ్‌లాండ్, వియత్నాం, మలేసియాల్లోనూ విస్తరణకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సంస్థ ఆదాయంలో మూడింట ఒక వంతు అంతర్జాతీయ కార్యకలాపాల నుంచే వస్తోంది. 2022 నాటికి ఇది 50 శాతానికి చేరుతుందని రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ ఎండీ, సీఈవో ఎం.గౌతమ్‌ రెడ్డి చెప్పారు. బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... వాణిజ్యపరంగా అనుకూలమైన ప్రపంచస్థాయి పరిష్కారాలను తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు.

పెట్టుబడి రూ.1,000 కోట్లు..
ఒమన్‌లో మున్సిపల్‌ వ్యర్థాల నిర్వహణ, సౌదీ అరేబియాలో వ్యర్థాల నిర్వహణ ప్లాంటు నిర్మాణం, దుబాయ్‌లో నిర్మాణ వ్యర్థాల రికవరీ ఫెసిలిటీ ఏర్పాటుకు రామ్‌కీ ఎన్విరో ఇటీవలే అంతర్జాతీయ కాంట్రాక్టులను దక్కించుకుంది. అలాగే పారిశ్రామిక, జీవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ల ఏర్పాటు, నిర్వహణకు దోహా, జోర్డాన్, బంగ్లాదేశ్‌ నుంచి ఆర్డర్లు పొందింది. వీటి నిర్మాణానికి వచ్చే రెండేళ్లలో రామ్‌కీ సంస్థ రూ.900–1,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. 

మెరైన్‌ సర్వీసుల్లోకి..
ఇటీవలే టెక్సాస్‌కు చెందిన నేచుర్‌ ఎన్విరాన్‌మెంటల్, మెరైన్‌ సర్వీసెస్‌లో 50 శాతం వాటాను రామ్‌కీ ఎన్విరో కొనుగోలు చేసింది. తద్వారా సముద్ర వ్యర్థాల నిర్వహణలోకి ప్రవేశించిన భారత కంపెనీగా రికార్డుకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సేవల్లో 10 కంపెనీలే ఉన్నాయని గౌతమ్‌ రెడ్డి తెలిపారు. ‘‘నేచుర్‌ ఎన్విరాన్‌మెంట్‌ సంస్థ ఏటా రూ.40 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. భారత్‌తో పాటు పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దీని సేవలను అందుబాటులోకి తెస్తాం’’ అని వివరించారు.

అయిదేళ్లలో 50 శాతం..
రామ్‌కీ ఎన్విరో సంస్థ 2016–17లో రూ.1,550 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,800 కోట్లు ఉండొచ్చని గౌతమ్‌ రెడ్డి చెప్పారు. ‘‘దీన్లో విదేశీ వ్యాపారం వాటా రూ.600 కోట్లు ఉంటుంది. రెండేల్లో మొత్తం టర్నోవర్‌ రూ.3,500 కోట్లకు చేరే అవకాశముంది. దీన్లో విదేశీ వాటా 30 శాతం ఉంటుంది. అంతర్జాతీయ వ్యాపారం వాటా ఐదేళ్లలో 50 శాతానికి చేరుతుందనే నమ్మకం ఉంది’’ అని వివరించారు.

వ్యర్థాల నుంచి విద్యుత్‌..
హైదరాబాద్‌ జవహర్‌నగర్‌లో కంపెనీకి మున్సిపల్‌ వ్యర్థాల నిర్వహణ ప్లాంటుంది. రోజుకు సుమారు 6,000 టన్నుల వ్యర్థాలు ఈ కేంద్రానికి వస్తాయి. ఇక్కడే వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 20 మెగావాట్ల ప్లాంటు నిర్మాణంలో ఉంది. 2019 మార్చికల్లా విద్యుత్‌ ప్లాంటు అందుబాటులోకి రానుంది. రామ్‌కీ ఎన్విరో దీనికోసం రూ.340 కోట్లు వెచ్చిస్తోంది. ఇక జవహర్‌నగర్‌ డంప్‌ యార్డులో క్యాపింగ్‌ పనులు వేగం పుంజుకున్నాయి. క్యాపింగ్‌ పూర్తయితే పరిసరాల కాలుష్యానికి చెక్‌ పడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement