ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్‌ఎఫ్‌సీ) రూ. 4,532 కోట్ల విలువైన ట్యాక్స్ ఫ్రీ బాండ్లను జారీ చేస్తోంది.
ఐఆర్‌ఎఫ్‌సీ ట్యాక్స్ ఫ్రీ బాండ్లు
ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్‌ఎఫ్‌సీ) రూ. 4,532 కోట్ల విలువైన ట్యాక్స్ ఫ్రీ బాండ్లను జారీ చేస్తోంది. డిసెంబర్ 8న ప్రారంభమయ్యే ఈ బాండ్లపై కూపన్ రేటును గరిష్టంగా 7.53 శాతంగా నిర్ణయించారు. 10, 15, 20 ఏళ్ల కాలపరిమితి గల బాండ్లపై రిటైల్ ఇన్వెస్టర్లకు కూపన్ రేట్లను వరుసగా 7.32%, 7.53%, 7.50% నిర్ణయించారు. 15 ఏళ్ల కాలపరిమితి కంటే 20 ఏళ్ల కాలపరిమితి గల బాండ్లపై తక్కువ వడ్డీరేటును ఆఫర్ చేస్తుండటం గమనార్హం.
కనీస ఇన్వెస్ట్‌మెంట్ విలువను రూ. 1,000 నిర్ణయించారు. ఈ బాండ్లపై ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై ఎటువంటి పన్ను మినహాయింపులు లభించవు. కానీ ఈ బాండ్స్ అందించే వడ్డీని పన్ను లేని ఆదాయంగా పరిగణిస్తారు. కాబట్టి వీటిని ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌గా వ్యవహరిస్తారు.
టాటా నుంచి థీమ్ ఫండ్స్
టాటా మ్యూచువల్ ఫండ్ సంస్థ ఐదు రకాల థీమాటిక్స్ ఫండ్స్‌ను ప్రవేశపెట్టింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ ఇండియా, ఇండియా కన్జూమర్, ఇండియా ఫార్మా అండ్ హెల్త్‌కేర్, రిసోర్సెస్ అండ్ ఎనర్జీ ఫండ్ పేరుతో ఐదు రకాల థీమ్స్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో మీకు నచ్చిన థీమ్‌ను ఎంచుకుంటే ఆ రంగంలోని కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు.
ప్రస్తుతం ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా మంత్రం జపిస్తుండటంతో ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి డిజిటల్ ఇండియా థీమ్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫండ్‌ను ఎంచుకుంటే డిజిటల్ ఇండియాలో భాగమయ్యే అంటే ఐటీ, టెలికాం, ఆనెలైన్ మార్కెటింగ్ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. డిసెంబర్ 4న ప్రారంభమైన ఈ ఐదు ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలు డిసెంబర్ 18తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్‌మెంట్‌ను రూ. 5,000గా నిర్ణయించారు. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌తో ఈ థీమాటిక్ ఫండ్స్‌లో రిస్క్ అధికంగా ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు.
పేటీఎం ప్రీపెయిడ్ కార్డులు
మొబైల్ వాలెట్ సేవలు అందిస్తున్న పేటీఎం సంస్థ ప్రీపెయిడ్ కార్డులను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి కో-బ్రాండెడ్ వర్చువల్ ప్రీపెయిడ్ కార్డులను ప్రారంభించింది. మొబైల్ వాలెట్‌కు అనుసంధానమైన పనిచేసే ఈ కార్డులతో వివిధ వెబ్‌సైట్లలో కొనుగోళ్లు చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. నెట్‌బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు లేని వారికి ఉపయోగపడే విధంగా ఈ ప్రీపెయిడ్ కార్డులను ప్రవేశపెట్టినట్లు పేటీఎం పేర్కొంది.
స్టాక్ హోల్డింగ్‌తో అర్థయంత్ర ఒప్పందం
స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (ఎస్‌హెచ్‌సీఐఎల్) ఫైనాన్షియల్ సేవలను అందించే అర్థయంత్ర ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగం గా ఎస్‌హెచ్‌సీఐఎల్‌కు చెందిన ఖాతాదారులకు వ్యక్తిగత వెల్త్‌మేనేజ్‌మెంట్ సేవలను అర్థయంత్ర అందిస్తుంది. ప్రస్తుతం ఎస్‌హెచ్‌సీఐఎల్‌కు దేశవ్యాప్తంగా 180 శాఖలతో 7 లక్షల మంది ఖాతాదారులను కలిగి ఉంది.


