మిగిలేవి ఐదు పెద్ద బ్యాంకులే! | Sakshi
Sakshi News home page

మిగిలేవి ఐదు పెద్ద బ్యాంకులే!

Published Mon, Apr 3 2017 12:34 AM

మిగిలేవి ఐదు పెద్ద బ్యాంకులే!

అందులో ఎస్‌బీఐ ఒకటి: ఉదయ్‌ కోటక్‌
ముంబై: దేశబ్యాంకింగ్‌ రంగంలో బలమైన స్థిరీకరణ అవసరం ఉందని కోటక్‌ మహీంద్రా బ్యాంకు వైస్‌చైర్మన్‌ ఉదయ్‌ కోటక్‌  అన్నారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఉన్నట్టే మనదేశంలోనూ ఐదు బ్యాంకులే ఆర్థిక సేవల రంగంలో నిలదొక్కుకుంటాయన్నారు. ‘‘చాలా దేశాల్లో మూడు నుంచి ఐదు పెద్ద బ్యాంకులే ఈ రంగాన్ని శాసిస్తున్నాయి. భారత్‌ ఇందుకు మినహాయింపు కాదు. భవిష్యత్తులో మన దేశంలోనూ ఇదే పరిస్థితి రానుంది’’ అని ఉదయ్‌ కోటక్‌ ఓ ఇంటర్వూ్యలో చెప్పారు. దేశీయంగా అలాంటి పెద్ద బ్యాంకుల్లో ఎస్‌బీఐ ఒకటని చెప్పారు.

రెండేళ్ల క్రితం కోటక్‌ బ్యాంకు ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకును విలీనం చేసుకోగా, తాజాగా మరోసారి విలీన  ప్రయత్నాలు చేస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవన్నీ ఊహాగానాలేనని ఉదయ్‌ చెప్పినప్పటికీ తాజా వ్యాఖ్యలు విలీనాలపై కోటక్‌ బ్యాంక్‌ ఆసక్తిగానే ఉన్నట్టు సంకేతాలిస్తున్నాయి. ‘‘మార్పునకు మేము సిద్ధం. అది సాహసోపేతంగా, ఆర్థిక సేవల రంగం దిశను మార్చేలా ఉంటుంది’’ అని ఉదయ్‌ చెప్పారు. ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకు విలీనం ద్వారా తాము చాలా నేర్చుకున్నట్టు చెప్పారు. అదే సమయంలో విలీనాలకు తొందరపడడం లేదన్నారు. అయినప్పటికీ తమ కళ్లు, చెవులు విలీనాల కోసం తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement