ఓఎన్‌జీసీ బైబ్యాక్‌ రూ.4,022 కోట్లు 

ONGC clears share buyback worth Rs 4022 crore - Sakshi

షేర్‌ బైబ్యాక్‌ ధర రూ.159

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ కంపెనీ రూ.4,022 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌కు కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఓఎన్‌జీసీ వెల్లడించింది. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా 1.97 శాతం వాటాకు సమానమైన 25.29 కోట్ల షేర్లను, ఒక్కో షేర్‌ను రూ.159కు కొనుగోలు చేస్తామని  పేర్కొంది. ఓఎన్‌జీసీలో కేంద్ర ప్రభుత్వానికి 65.64 శాతం వాటా ఉండటంతో ఓఎన్‌జీసీ షేర్ల బైబ్యాక్‌ కారణంగా ప్రభుత్వానికి రూ.2,640 కోట్ల నిధులు వస్తాయని అంచనా. కాగా మూలధన పెట్టుబడుల కోసం నిధులు ఖర్చుకాగా ఈ సారి మధ్యంతర డివిడెండ్‌ను ఓఎన్‌జీసీ చెల్లించడం లేదని సమాచారం. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా కంపెనీ తాను జారీ చేసిన షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఇటీవలే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొ (ఐఓసీ) కంపెనీ రూ.4,435 కోట్ల మేర షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా రూ.6,556 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రకటించింది.
 
కేంద్రం ఒత్తిడి... 
నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల షేర్లను బైబ్యాక్‌ చేయాలని, అధిక డివిడెండ్‌ను చెల్లించాలని  కేంద్రం ఒత్తిడి చేస్తోంది. ఈ సంస్థల్లో అధిక వాటా ఉండటంతో  షేర్ల బైబ్యాక్‌ కారణంగా ప్రభుత్వానికి భారీగా నిధులు లభిస్తాయి. ఈ నిధులను బడ్జెట్‌ లోటు పూడ్చుకోవడానికి వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే డజనుకు పైగా ప్రభుత్వ రంగ కంపెనీలు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించాయి. ఐఓసీ, నాల్కో, భెల్, ఆయిల్‌ ఇండియా, కోల్‌ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌ఎల్‌సీ, కొచ్చిన్‌ షిప్‌యార్డ్, కేఐఓసీఎల్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల షేర్ల బైబ్యాక్‌ కారణంగా కనీసం రూ.5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.  

వచ్చే నెల 1 నుంచి ఎన్‌హెచ్‌పీసీ షేర్ల బైబ్యాక్‌  
ఎన్‌హెచ్‌పీసీ షేర్ల బైబ్యాక్‌ వచ్చే నెల 1 నుంచి ప్రా రంభమవుతోంది. అదే నెల 14న ముగిసే ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా 2.09% వాటాకు సమానమైన 21.42 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.28 ధరకు ఈ కంపెనీ కొనుగోలు చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌కు రికార్డ్‌ తేదీగా గత నెల 30ని కంపెనీ నిర్ణయించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top