ఆర్బీఐ, బ్యాంకుల పనితీరు.. ప్చ్!

ఆర్బీఐ, బ్యాంకుల పనితీరు.. ప్చ్!


మొండి బకాయిలపై పార్లమెంటరీ కమిటీ అసంతృప్తి

బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వానికి విఘాతమని విశ్లేషణ

పార్లమెంటుకు నివేదిక సమర్పించిన స్థాయీ సంఘం




న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్‌పీఏ) సమస్య విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), బ్యాంకుల పనితీరుపై పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పెద్ద భారంగా మారిన మొండిబకాయిల సమస్య-  సంబంధిత నిర్వహణా యంత్రాంగం విశ్వసనీయతనే ప్రశ్నిస్తోందని, బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వానికి ముప్పుగా ఉందని నివేదిక పేర్కొంది.  మొండి బకాయిల పరిష్కారం దిశలో తన నిబంధనల అమలులో ఆర్‌బీఐ అంతగా విజయం సాధించలేదని పేర్కొంది. 2015 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర మొండిబకాయిల విలువ రూ.2,05,024 కోట్లుకాగా, స్థూలంగా ఇవి రూ.3,69,990 కోట్లుగా నమోదైంది.



2014 మార్చి నాటికి మొండిబకాయిలుగా మారే అవకాశం ఉన్న రుణాల పరిమాణం 10 శాతంగా ఉంటే... 2015 మార్చి నాటికి ఇది 11 శాతానికి పెరిగింది. 2015 సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాది కాలంలో మొండిబకాయిలుగా మారే అవకాశాలు ఉన్న రుణ పరిమాణం రూ.5.91 లక్షల కోట్ల నుంచి రూ.6.8 లక్షల కోట్లకు ఎగసింది.   కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం వీరప్ప మొయిలీ నేతృత్వంలో... మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌సహా 31 మంది సభ్యులతో కూడిన  స్థాయీ సంఘం ఇచ్చిన నివేదికలో ముఖ్యాంశాలు ...


{పస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) ముగిసే నాటికి స్థూలంగా మొండి బకాయిలు రూ.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని వెలువడుతున్న కొన్ని అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం, ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ,  ఈ బకాయిలు పెరిగిపోతుండడం ఆందోళనకు ప్రధాన కారణం.


దేశం వేగంగా వృద్ధి చెందుతోందని, అభివృద్ధి చెందిన దేశాలకు పోటీపూర్వకంగా మారుతోందని ఒకపక్క చెప్పుకుంటున్నాం. అయితే మరోవైపు నెలకొన్న మొండిబకాయిల తీవ్రత ‘వృద్ధి కథనాన్ని’ దెబ్బతీస్తోంది.


మొండిబకాయిల సమస్య పరిష్కారానికి ఆర్‌బీఐ ఇస్తున్న మార్గదర్శకాలు లక్ష్యాలను సాధించడం లేదు. సమస్యపై ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. సవాలును ఎదుర్కొనే అంశాన్ని బ్యాంకుల బోర్డు డెరైక్టర్ల నిర్ణయానికి వదిలివేయకుండా ఆర్‌బీఐ తనకుతాను కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.


ఇప్పటికైనా సాధ్యమైనంత త్వరగా, సకాలంలో సమస్య పరిష్కారం తీసుకోకపోతే... పరిస్థితి మరింత తీవ్రతకు దారితీస్తుంది.


ఈ మొత్తం అంశాన్ని పరిశీలించడానికి, తగిన నిర్ణయాలు తీసుకోడానికి ఆర్‌బీఐ, బ్యాంకులు, రుణ గ్రహీత స్థాయిల్లో మూడు ప్రత్యేక సాధికార కమిటీలను ఏర్పాటు చేయాలి.


సమస్య విషయంలో బ్యాంకు బోర్డుల్లో ఆర్‌బీఐ, ఆర్థికమంత్రిత్వశాఖ నామినీ డెరైక్టర్లు, సీఎండీ, ఎండీలను కూడా బాధ్యులుగా చేయాలి.


మంజూరీ నిబంధనల్లో లోపాల వల్ల రుణాలు తీసుకున్న కొందరు ప్రమోటర్లు ఈ నిధులను వ్యాపారేతర కార్యకలాపాలకు మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. మొండిబకాయిలు తీవ్రంగా పెరగడానికి కారణం ఇదేనన్న వాదనా ఉంది. ఈ పరిస్థితుల్లో రుణ తీరుపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి.


రుణ పునర్‌వ్యవస్థీకరణ కోరుకుంటున్న కంపెనీలు ఆయా అంశాలను బహిరంగపరచాలి. వీటిని రహస్యంగా ఉంచడంలో ఎటువంటి అర్థం లేదు.


 ఎస్‌బీఐలో ఉద్దేశ్యపూర్వక ఎగవేతలు రూ.11,700 కోట్లు!

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో దాదాపు 1,164 ఖాతాల విషయంలో ఉద్దేశ్యపూర్వక ఎగవేతలు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించి మొండిబకాయిలుగా మారిన మొత్తం రుణ విలువ 2015 సెప్టెంబర్ నాటికి రూ.11,700 కోట్లు. ఆర్థిక మంత్రిత్వశాఖ సమీకరించిన గణాంకాలు ఈ అంశాన్ని పేర్కొన్నాయి. సర్వీసులు నిలిచిపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వాటా ఇందులో రూ.1,600 కోట్లు. ఈ రుణ మొత్తానికి గ్యారెంటార్లుగా యూబీ హోల్డింగ్స్, విజయ్‌మాల్యాలు ఉన్నారు. ఎస్‌బీఐ ఐదు అనుబంధ బ్యాంకుల్లో విల్‌ఫుల్ డిఫాల్టర్ల సంఖ్య అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కలిగిఉంది. బ్యాంకుకు సంబంధించి 197 కేసుల్లో రూ.2,088 కోట్ల బకాయిలు ఉన్నాయి. తరువాతి స్థానాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌లు ఉన్నాయి. ఎస్‌బీఐ స్థూల మొండిబకాయిల మొత్తం డిసెంబర్ నాటికి రూ.72,792 కోట్లు.



పీఎస్‌యూ బ్యాంకులకు రేటింగ్ ముప్పు

బడ్జెట్‌లో మరిన్ని కేటాయింపులు లేకపోతే కష్టం

మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరిక

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) మరింత మూలధనం అందించేందుకు రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోని పక్షంలో వాటి రేటింగ్స్‌పై ప్రతికూల ప్రభావం పడగలదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఎల్)కు ముందస్తుగా ప్రొవిజనింగ్ చేయడం వల్ల పీఎస్‌బీలకు మరింత అధికంగా మూలధనం సమకూర్చాల్సిన అవసరం ఉంటుందని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ వడ్లమాని తెలిపారు. దేశీయంగా 11 పీఎస్‌బీలకు మూడీస్ రేటింగ్స్ ఇస్తోంది. సంస్థ అంచనా ప్రకారం 2019 మార్చి 31తో ముగిసే నాలుగేళ్ల వ్యవధిలో ఈ బ్యాంకులకు కనీసం రూ. 1.45 లక్షల కోట్లు అవసరమవుతాయి. వేల్యుయేషన్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో పీఎస్‌బీలు సమీప భవిష్యత్‌లో క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించగలిగే అవకాశాలు తక్కువేనని మూడీస్ పేర్కొంది. దీంతో రాబోయే 18 నెలల్లో మరిన్ని నిధుల కోసం ఈ బ్యాంకులు ప్రభుత్వం వైపే చూడొచ్చని వివరించింది. 2019 మార్చి నాటికి పీఎస్‌బీలకు దాదాపు రూ. 70,000 కోట్లు మూలధనం సమకూర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో 2015-16, 2016-17లో రూ. 25,000 కోట్లు చొప్పున, అటు పైన రెండేళ్లు ఏడాదికి రూ. 10,000 కోట్లు చొప్పున అందించనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top