స్పెషల్‌ కిడ్స్‌కు ‘పినాకిల్‌ బ్లూమ్స్‌’

New startup pinnacle blooms - Sakshi

కొత్త టెక్నాలజీల ఆసరాగా థెరపీ

హైదరాబాద్‌లో నాలుగు కేంద్రాలు

ఫ్రాంచైజీల ద్వారా భారీ విస్తరణ

‘స్టార్టప్‌ డైరీ’తో కంపెనీ ఫౌండర్‌ కోటిరెడ్డి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మానసికంగా సరైన ఎదుగుదల లేని పిల్లలే... స్పెషల్‌ కిడ్స్‌. దేశంలో ఇలాంటివారి సంఖ్య 5 లక్షలకుపైనే. సరిపల్లి కోటిరెడ్డి కుమారుడికీ ఇలాంటి సమస్యే వచ్చింది. వైద్యుల దగ్గరికి తీసుకెళితే ఆటిజం (బుద్ధి మాంద్యం) అని చెప్పారు. అయితే కోటిరెడ్డి దానిపై పూర్తిస్థాయిలో శోధించారు.

రుగ్మతేంటో తెలుసుకున్నారు. చికిత్సతో కొంతవరకూ నయం చేయగలిగారు. అలాగని అక్కడితో ఆగిపోలేదు!! అలాంటి పిల్లలకు తగిన విద్య, ఇతర సేవలు అందించడానికి ‘పినాకిల్‌ బ్లూమ్స్‌’ను ఏర్పాటు చేశారు. ఇపుడు దాన్ని విస్తరించే పనిలో పడ్డారు. కంపెనీ గురించి ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే...

‘‘మా బాబుకి 20 నెలలున్నప్పుడు ఆటిజం అని డాక్టర్‌ చెప్పారు. ఆ బాధ నుంచి కొద్ది రోజుల్లోనే తేరుకుని నిజంగా ఆటిజం ఉందా అని అధ్యయనం చేశాను. చివరకది సెన్సోరిన్యూరల్‌ హియరింగ్‌ లాస్‌ (వినికిడి సమస్య) అని తేలింది. పిల్లాడికి కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ సర్జరీ చేయించాం.

ఇప్పటికీ బాబుకి ప్రత్యేక శ్రద్ధ అవసరం. అయితే ఆటిజం, డాల్‌ ఫేస్, మానసిక రుగ్మత, ప్రవర్తన సమస్యలతో దేశంలో 5 లక్షల పైచిలుకు మంది పిల్లలు బాధపడుతున్నారు. పిల్లలు పెరిగేంత వరకు సమస్య బయటపడదు. వీరికోసం ఏదో ఒకటి చెయ్యాలనిపించింది.  

పరిశోధన ఆధారంగా..
స్పెషల్‌ కిడ్స్‌కు ఎటువంటి థెరపీ ఇవ్వాలో లోతైన అధ్యయనం చేశాం. ఇందుకు రూ.4 కోట్ల వరకు ఖర్చయింది. సెంటర్ల ఏర్పాటు, కంపెనీ ఏర్పాటుకు రూ.1.5 కోట్లు వెచ్చించాం. మా సెంటర్ల ద్వారా స్పెషల్‌ కిడ్స్‌కు స్పీచ్, స్పెషల్‌ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఆడియాలజీ సేవలు అందిస్తున్నాం.

ఇందుకు తొలిసారిగా మెషీన్‌ లెర్నింగ్, బిగ్‌ డేటా టెక్నాలజీని ఆసరాగా చేసుకున్నాం. ఆడియాలజిస్ట్, సైకాలజిస్ట్, స్పీచ్, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్, లాంగ్వేజ్‌ పాత్, ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్టులతో కూడిన 40 మంది నిపు ణులు ప్రస్తుతం పూర్తిస్థాయి సేవలందిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, హార్వర్డ్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి సైకాలజీలో పరిశోధన చేస్తున్నాం.

కేంద్రీకృత వ్యవస్థ ద్వారా..
పిల్లలు, తల్లిదండ్రులు, సిబ్బందిపై కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ పర్యవేక్షణ ఉంటుంది. బాబు, పాప తల్లిదండ్రులకు ప్రతిరోజు 45 నిమిషాల పాటు కౌన్సెలింగ్‌ ఉంటుంది. ప్రతి సెషన్‌లో పిల్లలకు అందిన సేవలపై తల్లిదండ్రులు పినాకిల్‌ కనెక్ట్‌ యాప్‌లో రేటింగ్‌ ద్వారా తమ స్పందనను తెలియజేయాలి.

ఇంట్లో పిల్లల ప్రవర్తన సమాచారాన్ని పొందుపరచాలి. ఈ అంశాల ఆధారంగా థెరపీలో మార్పు ఉంటుంది. అలాగే బాబు, పాప గురించి, వారితో ఎలా మెలగాలో నిపుణులు   యాప్‌ ద్వారా చెప్తారు. సమస్య స్థాయినిబట్టి 3 నెలల నుంచి 2 ఏళ్ల వరకు థెరపీ అవసరం.

విదేశాల్లోనూ అడుగుపెడతాం..
హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, మాదాపూర్, సుచిత్ర, వెస్ట్‌ మారేడ్‌పల్లిలో పినాకిల్‌ బ్లూమ్స్‌ కేంద్రాలున్నాయి. రెండు నెలల్లో హైదరాబాద్‌లోనే మరో 7 కేంద్రాలు వస్తున్నాయి. విస్తరణకు రూ.9 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏపీలో ఫ్రాంచైజీ విధానంలో 30 సెంటర్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.

భారత్‌లో అన్ని రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ విస్తరిస్తాం. ఫ్రాంచైజీకి ప్లే స్కూళ్లు, చిల్డ్రన్‌ హాస్పిటల్స్, న్యూరాలజిస్టులకు ప్రాధాన్యమిస్తాం. 1,500 చదరపు అడుగుల విస్తీర్ణం, రూ.2–3 లక్షల పెట్టుబడి అవసరం. ప్రభుత్వం అనుమతిస్తే ప్రతి జిల్లా కేంద్రంలో ఏదైనా గవర్నమెంటు స్కూల్లో పినాకిల్‌ బ్లూమ్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధం. ఈ సెంటర్లలో ఉచితంగా సేవలు అందిస్తాం,

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top