అది మా డీఎన్ఏలోనే ఉంది : అంబానీ

 Mukesh Ambani Says RIL Net Debt Free, Fulfilled Promise Before Schedule - Sakshi

రుణ రహిత సంస్థగా రిలయన్స్  ఇండస్ట్రీస్

వాటాదారులకిచ్చిన వాగ్దానాన్ని ముందుగానే నిలుపుకున్నాం

వరుస పెట్టుబడులు, రైట్స్ ఇష్యూ  మద్దతు

సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ కల నెరవేరింది. వరుస పెట్టుబడుల సునామీతో రిలయన్స్ అప్పులు లేని సంస్థగా అవతరించి మరో కీలక మైలురాయిని అధిగమించింది. 2021 మార్చి నాటికి ఆర్ఐఎల్ సంస్థను రుణ రహిత సంస్థగా తీర్చిదిద్దుతానన్న వాగ్దానాన్ని ముందే నెరవేర్చామని ఛైర్మన్ ముకేశ్ అంబానీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశిత సమయంకంటే ముందుగానే సాధించాం.  "రిలయన్స్ ఇపుడు బంగారు దశాబ్దంలో" ఉందని బిలియనీర్ అంబానీ ప్రకటించారు.  (ధనాధన్‌ జియో)
 
అంచనాలను అధిగమించడం మా డీఎన్ఏలోనే ఉంది
2021 మార్చి 31 నాటికి రిలయన్స్‌ను అప్పులు లేని కంపెనీగా మారుస్తామని వాటాదారులకు ఇచ్చిన వాగ్దానాన్ని చాలా ముందుగానే నేరవేర్చామని ప్రకటించేందుకు చాలా ఆనందంగా ఉందని అంబానీ తెలిపారు. ఇది గర్వించదగ్గ సందర్భం...వాటాదారుల అంచనాలను మళ్లీ మళ్లీ అధిగమించిడం రిలయన్స్ డీఎన్ఏలోనే ఉందని పేర్కొన్నారు. అలాగే రిలయన్స్ వ్యవస్థాపకులు, తన తండ్రి ధీరూబాయి అంబానీ ఆశయాల సాధన, దేశ శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధిలో మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించడమే కాదు.. వాటిని సాధిస్తామంటూ అంబానీ భరోసా ఇచ్చారు.

కాగా  రిలయన్స్ టెలికాం  విభాగం  జియో ప్లాట్ ఫాంలోకి ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి ఇటీవల భారీగా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో పాటు రైట్స్ ఇష్యూ రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఏప్రిల్ 22 నుంచి తొమ్మిది వారాల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 24.7 శాతం వాటాల విక్రయం ద్వారా రిలయన్స్ 115,693.95 కోట్ల రూపాయలు సేకరించింది. మరోవైపు రైట్స్ ఇష్యూ 1.59 సార్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్ కావడం మరో విశేషం. దీని ద్వారా 53,124.20 కోట్ల రూపాయలను సాధించింది.  కేవలం 58 రోజుల్లో 168,818 కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకోవడంతో  రిలయన్స్  నిర్దేశిత లక్ష్యం నెరవేరింది. మార్చి 31, 2020 నాటికి గ్రూప్ నికర అప్పు 1,61,035 కోట్ల రూపాయలుగా ఉంది. 2021 మార్చి నాటికి  రుణ రహిత సంస్థగా అవతరించనున్నామని గత ఏడాది  ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు  శుక్రవారం నాటి మార్కెట్ లో రిలయన్స్ షేరు  ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 1,684 రూపాయల వద్ద రికార్డ్ గరిష్టానికి చేరింది.(మరో మెగా డీల్ : అంబానీ కల నెలవేరినట్టే!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top