నన్ను రూ.40 కోట్లకు ముంచారు : ధోని

MS Dhoni Moves SC Against Amrapali Group - Sakshi

న్యూఢిల్లీ :  రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌ తనను మోసం చేసిందని టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆమ్రపాలి గ్రూప్‌ తరఫున ప్రచారం చేసినందుకుగానూ తనకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని చెల్లించలేదని పేర్కొన్నాడు. అదే విధంగా ఆమ్రపాలి ప్రాజెక్టులో తాను బుక్‌ చేసుకున్న పెంట్‌హౌజ్‌ను కూడా స్వాధీనం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. రియల్టీ కుంభకోణంలో చిక్కుకున్న ఆమ్రపాలి గ్రూపు ప్రస్తుతం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆమ్రపాలి సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నందుకు తనకు చెల్లిస్తానన్న రూ. 40 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారని ధోని పేర్కొన్నాడు. ఈ మొత్తం తనకు చెల్లించాల్సిందిగా ఆమ్రపాలిని ఆదేశించాలని ధోని అత్యున్నత స్థానానికి విఙ్ఞప్తి చేశాడు. రాంచీలోని ఆమ్రపాలి సఫారీలో ఉన్న పెంట్‌హౌజ్‌ను తనకు స్వాధీనపరచాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు.

చదవండి : కోర్టురూమ్‌లోనే ‘అమ్రపాలి’ డైరెక్టర్లు అరెస్ట్‌ 

కాగా ఈ రియల్టీ గ్రూప్‌నకు ధోని 2009 నుంచి 2016 వరకు అంబాసిడర్‌గా వ్యవహరించాడు. పెట్టుబడిదారులను ఆకర్షించేలా నిర్మించిన పలు ప్రకటనల్లో కనిపించాడు. అంతేగాక ఈ గ్రూపు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో ధోనితో పాటు అతడి భార్య సాక్షి కూడా భాగస్వామ్యమయ్యారు. ఆమ్రపాలి గ్రూపునకు చెందిన చారిటబుల్‌ వింగ్‌ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఇక ఇన్వెస్టర్ల నుంచి రూ.2,765 కోట్లను వసూలు చేసి వాటిని దారి మళ్లించినట్టు ఆమ్రపాలి గ్రూప్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ గ్రూప్‌నకు చెందిన 16 ఆస్తుల వేలానికి సుప్రీంకోర్టు ఇటీవలే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తద్వారా వచ్చిన నిధులను... నిలిచిపోయిన ప్రాజెక్టుల పని ప్రారంభించడానికి ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌(ఎన్‌బీసీసీ) వినియోగించుకోడానికి కూడా వీలు కల్పించింది. ఈ క్రమంలో నిలిచిపోయిన 15 హౌసింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 46,575 ఫ్లాట్స్‌ను 36 నెలల్లో దశల వారీగా నిర్మించి ఇవ్వగలమని.. ఇందుకు రూ.8,500 కోట్ల నిధులు కావాలని  సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌లో ఎన్‌బీసీసీ ప్రతిపాదించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top