ఐసీఐసీఐ వివాదంపై కేంద్రం దృష్టి

MCA inspecting NuPower Renewables, 5 other cos linked to ICICI - Sakshi

న్యూపవర్‌లో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ తనిఖీలు

సంబంధిత మరో 5 కంపెనీల్లో కూడా  

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు రుణాల వివాదంపై కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల (ఎంసీఏ) శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా వివాదాస్పద న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌తో పాటు సంబంధిత మరో అయిదు కంపెనీల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి పి.పి.చౌదరి తెలిపారు. కంపెనీల చట్టం సెక్షన్‌ 206 (5) కింద ఐసీఐసీఐ బ్యాంకు రుణ వివాదంతో ముడిపడి ఉన్న ఆరు కంపెనీల తనిఖీలకు ఏప్రిల్‌ 23న ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఎంసీఏ పరిధిలోని రీజనల్‌ డైరెక్టర్‌ (పశ్చిమ రీజియన్‌) వీటిని నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. సెక్షన్‌ 206 కింద అకౌంటు పుస్తకాల తనిఖీలు, ఎంక్వైరీలు, కీలక వివరాలు సేకరించేందుకు దర్యాప్తు చేసే ఇన్‌స్పెక్టర్‌కు అధికారాలు ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంకు.. ఆర్‌బీఐ పరిధిలో ఉంటుంది కనుక తమ శాఖ ఆ బ్యాంకు వ్యవహారాలేమీ పరిశీలించడం లేదంటూ ఎంసీఏ సీనియర్‌ అధికారి ఇటీవలే పేర్కొన్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తన కుటుంబసభ్యులకు ప్రయోజనం చేకూర్చేలా ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచర్‌ .. క్విడ్‌ ప్రో కో ప్రాతిపదికన వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాలిచ్చారని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ లావాదేవీకి ప్రతిగా చందా కొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌ సంస్థలో వీడియోకాన్‌ పెట్టుబడులు పెట్టిందని ఆరోపణలు ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంక్, సీబీఐ, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటికే దీనిపై విచారణ జరుపుతున్నాయి. కొచర్‌తో పాటు బ్యాంకుకు కూడా సెబీ షోకాజ్‌ నోటీసులు పంపింది. ఐసీఐసీఐ బ్యాంకు .. అమెరికాలో కూడా లిస్టయి ఉన్నందున అక్కడి సెక్యూరిటీస్‌ ఎక్సే్చంజ్‌ కమిషన్‌ కూడా ఈ వివాదంపై దృష్టి సారించింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top