భారత్‌మ్యాట్రిమోని బ్రాండ్ కింద ఆన్‌లైన్ ద్వారా పెళ్లి సంబంధాలు కుదిర్చే మ్యాట్రిమోనిడాట్‌కామ్ త్వరలో పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీఓ)కు రానున్నది.
ఐపీఓకు వస్తున్న మ్యాట్రిమోని
Aug 31 2017 3:28 PM | Updated on Sep 12 2017 1:29 AM
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌మ్యాట్రిమోని బ్రాండ్ కింద ఆన్‌లైన్ ద్వారా పెళ్లి సంబంధాలు కుదిర్చే మ్యాట్రిమోనిడాట్‌కామ్ త్వరలో పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీఓ)కు రానున్నది. సెప్టెంబర్ 11న ఇది స్ట్రీట్‌లోకి అడుగుపెట్టాలని చూస్తోంది. జూలైలోనే ఈ ఐపీఓకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందింది. ఐపీఓకు సంబంధించిన పత్రాలను కూడా ఈ సంస్థ సెబీకి సమర్పించింది. 3,767,254 ఈక్విటీ షేర్లను ఈ సంస్థ జారీచేయనుంది.
ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను ప్రకటనలకు, వ్యాపార ప్రమోషన్ కార్యకలాపాలకు, చెన్నై పరిసర ప్రాంతాల్లో భూమి కొనుగోలు చేసి ఆఫీసు కట్టడానికి, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలను తిరిగి చెల్లించడానికి, జనరల్ కార్పొరేట్ అవసరాలకు వాడనుంది. ఈ ఐపీఓ ద్వారా మ్యాట్రిమోని రూ.500 కోట్ల మేర నిధులు సమీకరించనున్నదని సమాచారం. సెప్టెంబర్ 11 మొదలయ్యే ఈ ఐపీఓ ఆఫర్, సెప్టెంబర్13తో ముగుస్తుంది.
గత ఆర్థిక సంవత్సరం (2014-15) చివరి నాటికల్లా మ్యాట్రిమోనీడాట్‌కామ్ సంస్థ రూ.243 కోట్ల ఆదాయాన్ని, రూ.18 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది. ఈ సంస్థ వద్ద 26.5 లక్షల వధూవరుల ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇంత భారీ స్థాయి లో ఐపీఓకు వస్తోన్న 2వ ఇంటర్నెట్ కంపెనీ ఇది. ఇంతకు ముందు లోకల్ సెర్చ్ ఇంజన్ జస్ట్ డయల్ 2013లో రూ.950 కోట్లు ఐపీఓ ద్వారా సమీకరించింది.
Advertisement
Advertisement