వాహనాల తయారీకి వైరస్‌ బ్రేక్‌..

Maruti Suzuki suspends production at Gurgaon And Manesar plants - Sakshi

ఉత్పత్తి నిలిపివేస్తున్న ఆటోమొబైల్‌ కంపెనీలు

జాబితాలో మారుతీ, హోండా, ఫియట్‌ తదితర సంస్థలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యల్లో భాగంగా ఆటోమొబైల్‌ దిగ్గజాలు ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) గురుగ్రామ్, మానెసర్‌లోని (హరియాణా) తమ ప్లాంట్లలో తక్షణం ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ రెండు ప్లాంట్లలో ఏటా 15.5 లక్షల వాహనాలు ఉత్పత్తవుతాయి. అటు రోహ్‌తక్‌లోని పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా మూసివేస్తున్నట్లు పేర్కొంది. షట్‌డౌన్‌ ఎన్నాళ్ల పాటు ఉంటుందనేది ప్రభుత్వ విధానంపై ఆధారపడి ఉంటుందని వివరించింది. అటు హోండా కార్స్‌ ఈ నెలాఖరు దాకా తమ రెండు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. తప్పనిసరి సర్వీసుల విభాగాల సిబ్బంది మినహా మిగతా ఉద్యోగులంతా ఇళ్ల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని హెచ్‌సీఐఎల్‌ ప్రెసిడెంట్‌ గకు నకానిషి తెలిపారు.

మరోవైపు, మహీంద్రా అండ్‌ మహీంద్రా కూడా మహారాష్ట్రలోని ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నాగ్‌పూర్‌ ప్లాంట్‌లో ఇప్పటికే ఆపివేశామని, చకన్‌ (పుణే), కాండివిలి (ముంబై) ప్లాంట్లలో సోమవారం నుంచి నిలిపివేస్తామని పేర్కొంది. అటు ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్స్‌ సైతం తమ ప్లాంట్లో ఈ నెలాఖరుదాకా ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఎంజీ మోటార్‌ ఇండియా సంస్థ గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంటును మార్చి 25 దాకా మూసివేస్తున్నట్లు తెలిపింది.  

ఇతర దేశాల్లోనూ..: హీరో మోటోకార్ప్‌
ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌తో పాటు కొలంబియా, బంగ్లాదేశ్‌ తదితర విదేశీ ప్లాంట్లలో కూడా కార్యకలాపాలు తక్షణమే నిలిపివేస్తున్నట్లు ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ వెల్లడించింది. మార్చి 31 దాకా ఇది అమలవుతుందని పేర్కొంది. జైపూర్‌లోని సెంటర్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ సహా ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులు నివాసాల నుంచే విధులు నిర్వర్తిస్తారని వివరించింది. అత్యవసర సర్వీసుల సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు హాజరవుతారని పేర్కొంది. హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) భారత్‌లోని మొత్తం నాలుగు ప్లాంట్లలోనూ కార్యకలాపాలు తక్షణమే నిలిపివేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

మహీంద్రా ఫండ్‌...
మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా కొద్ది వారాల పాటు లాక్‌డౌన్‌ చేయాలంటూ ప్రతిపాదించారు. పెద్ద ఎత్తున తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటు అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, ఆర్మీకి తమ గ్రూప్‌ ప్రాజెక్ట్‌ టీమ్‌ పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్దమని చెప్పారు. ‘మా మహీంద్రా హాలిడేస్‌ సంస్థ తరఫున రిసార్ట్‌లను తాత్కాలిక వైద్య కేంద్రాలుగా మార్చి, సేవలు అందించేందుకు కూడా సిద్ధం‘ అని ఆనంద్‌ మహీంద్రా తెలిపారు.  వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉన్నందున.. తమ ప్లాంట్లలో వాటి తయారీపై తక్షణం కసరత్తు ప్రారంభించామని తెలిపారు. అత్యంత ప్రతికూల ప్రభావాలెదుర్కొనే చిన్న వ్యాపార సంస్థలు, స్వయం ఉపాధి పొందేవారికి తోడ్పాటు అందించేందుకు మహీంద్రా ఫౌండేషన్‌ ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తుందని  మహీంద్రా చెప్పారు. తన పూర్తి వేతనాన్ని ఫండ్‌కు విరాళమిస్తున్నట్లు.. ఇతర ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళమివ్వొచ్చన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top